క్రీడాభూమి

గాయాలు వేధిస్తున్నా..డబ్బు కోసం ఆట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్: గాయాలు వేధిస్తున్నా, వాటిని దాచిపెట్టి, కేవలం డబ్బు కోసం వివిధ టోర్నీల్లో ఆడడం దాదాపు అన్ని క్రీడల్లోనూ ఆటగాళ్లకు ఆనవాయితీగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) వంటి వివిధ టోర్నీల్లో క్రికెటర్లు గాయాలను పట్టించుకోకుండా డబ్బు కోసమే ఆడుతున్నారని, అందుకే, జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించాల్సి వచ్చినప్పుడు విశ్రాంతిని కోరుకోవడమో లేక పూర్తి స్థాయిలో ఆడలేక చేతులెత్తేయడమో చేస్తున్నారని వివిధ దేశాల క్రికెట్ బోర్డులు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఫుట్‌బాల్, టెన్నిస్ తదితర రంగాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. స్పెయిన్‌కు చెందిన నికొలాస్ ఆల్మగ్రో ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో కేవలం 23 నిమిషాలు మ్యాచ్ ఆడి, మోకాలి నొప్పి కారణంగా ఆటను కొనసాగించలేనంటూ రిటైర్ కావడం ఈ విమర్శలను మరోసారి తెరపైకి తెచ్చింది. ఫ్రాన్స్ ఆటగాడు జెరెమీ చార్డీతో తలపడిన అల్మగ్రో మొదటి సెట్‌లో 0-4 తేడాతో వెనుకబడ్డాడు. అప్పటికే పలుమార్లు మోకాలును రుద్దుకుంటూ, టవల్‌తో ఒత్తుకుంటూ గాయం గురించి నిర్వాహకులకు చెప్పకనే చెప్పాడు. అరగంట ఆట కూడా పూర్తి కాకముందే, మోకాలి నొప్పితో కదల్లేకపోతున్నానని ప్రకటించి, మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో మొదటి రౌండ్‌లో ఓడిన ఆటగాడిగా లభించే 50,000 డాలర్ల చెక్కు తీసుకొని నిష్క్రమించాడు. ఆ సమయంలో కామెంటరీ చెప్తున్న ‘డబుల్స్ లెజెండ్’ టాడ్ ఉడ్‌బ్రిడ్జ్ తీవ్రంగా స్పందించాడు. ఆల్మగ్రో కేవలం డబ్బు కోసమే టోర్నీకి వచ్చినట్టు అనుమానం కలుగుతున్నదని వ్యాఖ్యానించాడు. టోర్నీ మధ్యలో ఫిట్నెస్ సమస్యలు తలెత్తితే ఊహించుకోచ్చుగానీ, మొదటి సెట్, మొదటి ఇరవై నిమిషాల్లోనే గాయం కారణంగా వైదొలగడం విచిత్రమని అన్నాడు. చాలా మంది అభిమానులు, ప్రముఖులు కూడా ఇలాంటి అనుమానాలే వ్యక్తం చేశారు. మోకాలి గాయం వేధిస్తుంటే, ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఎందుకు ఆడాల్సి వచ్చిందని నిలదీశారు. కాగా, తనపై వచ్చిన విమర్శలను ఆల్మగ్రో తోసిపుచ్చాడు. ఒకప్పుడు తాను ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉన్న విషయాన్ని అతను గుర్తుచేశాడు. కెరీర్‌లో ఇప్పటి వరకూ పది మిలియన్ డాలర్లు సంపాదించానని, కేవలం 50,000 డాలర్ల కోసం ఇక్కడికి రావాల్సిన అవసరం తనకు లేదని వ్యాఖ్యానించాడు. మోకాలికి దెబ్బ తగిలిన మాట వాస్తవమని, అయితే, దాని నుంచి కోలుకున్నానని, ప్రాక్టీస్ సమయంలోనూ తనకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని చెప్పాడు. అందుకే, మెల్బోర్న్ వచ్చానని, కానీ, మొదటి సెట్ ఆరంభమైన వెంటనే నొప్పికూడా మొదలైందని తెలిపాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మ్యాచ్ నుంచి వైదొలిగానని, దీనికి విపరీతార్థాలు తీయడం సమంజసం కాదని అన్నాడు. అల్మగ్రో ఇంత వివరణ ఇచ్చినప్పటికీ, అతను కేవలం డబ్బు కోసమే టోర్నీకి హాజరయ్యాడన్న వాదనే బలంగా వినిపిస్తున్నది.

చిత్రం..నికొలాస్ ఆల్మగ్రో