క్రీడాభూమి

ఫెదరర్ ది గ్రేట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 29: వెటరన్ ఆటగాడు, స్విట్జర్లాండ్ సూపర్ స్టార్ రోజర్ ఫెదరర్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. 35 ఏళ్ల వయసులోనూ తన ఫిట్నెస్ స్థాయిని నిరూపిస్తూ, కెరీర్‌లో 18వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం ఇక్కడ చివరి వరకూ హోరాహోరీగా జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో అతను చిరకాల ప్రత్యర్థి, ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్‌ను 6-4, 3-6, 6-1, 3-6, 6-3 తేడాతో ఓడించాడు. మొదటి నాలుగు సెట్లలో ఇరువురు చెరి రెండింటిని తమతమ ఖాతాల్లో వేసుకోవడంతో మ్యాచ్‌లో గెలుపు ఎవరిదన్న ఉత్కంఠ నెలకొంది. అయితే, అంతర్జాతీయ పోటీల్లో తనకున్న అపారమైన అనుభవంతో, కీలకమైన చివరి సెట్‌లో ఫెదరర్ తన ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. అద్భుతమైన షాట్లతో, బలమైన సర్వీసులతో రాణించిన ఫెదరర్‌కు తగిన సమాధానం ఇవ్వలేకపోయిన నాదల్‌కు ఓటమి తప్పలేదు. ఫెదరర్ ఆస్ట్రేలియా ఓపెన్‌ను ఐదోసారి గెల్చుకున్నాడు. ఇంతకు ముందు అతను 2004, 2006, 2007, 2010 సంవత్సరాల్లో ఈ టైటిల్‌ను సాధించాడు. కాగా, చివరిసారి అతనికి గ్రాండ్ శ్లామ్ టైటిల్ 2012లో వింబుల్డన్ రూపంలో లభించింది. ఆతర్వాత టైటిళ్ల కోసం అతను చేసిన పోరాటాలు ఫలించలేదు. ఒకానొక దశలో, వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న అతని కెరీర్ ముగిసినట్టేనన్న వార్తలు వచ్చాయి. కానీ, ఆటలో ఆనందాన్ని పొందుతున్నంత కాలం రిటైర్మెంట్ ప్రసక్తే లేదని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఫెదరర్ తేల్చిచెప్పాడు. టైటిళ్లను సాధించే సత్తా తనకు ఉందని స్పష్టం చేశాడు. ఆ మాటలను ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను సాధించి, నిజం చేశాడు. కాగా, ఫెదరర్ ఖాతాలో ఒక ఫ్రెంచ్ ఓపెన్ (2009), ఏడు వింబుల్డన్ (2003, 2004, 2005, 2006, 2007, 2009, 2012), ఐదు యుఎస్ ఓపెన్ (2004, 2005, 2006, 2007, 2008) టైటిళ్లు ఉన్నాయి.
చేజారిన రికార్డు
గ్రాండ్ శ్లామ్ టెన్నిస్‌లో ఓపెన్ శకం ప్రారంభమైన తర్వాత, నాలుగు టోర్నీలను కనీసం రెండేసి పర్యాయాలు సాధించిన తొలి క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పే అవకాశం నాదల్ చేజారింది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఒకసారి (2009) టైటిల్ సాధించిన అతను 2011, 2014 సంవత్సరాల్లో ఫైనల్ చేరినా, విజేతగా నిలవలేకపోయాడు. 2011లో నొవాక్ జొకోవిచ్, 2014లో స్టానిస్లాస్ వావ్రిన్కా అతనిని ఓడించారు. తాజాగా ఇప్పుడు ఫైనల్ చేరి, ఫెదరర్ చేతిలో ఓడాడు. ‘క్లే కోర్టు’పై తిరుగులేని వీరుడిగా పేరు సంపాదించిన అతను అందుకు తగినట్టుగానే ఫ్రెంచ్ ఓపెన్‌లో తొమ్మిది పర్యాయాలు టైటిల్ సాధించాడు. వింబుల్డన్, యుఎస్ ఓపెన్‌లో రెండేసి సార్లు ట్రోఫీని అందుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌ను ఈసారి గెలిస్తే, ఓపెన్ శకంలో ఒక్కో గ్రాండ్ శ్లామ్‌ను రెండేసి పర్యాయాలు సాధించిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించి ఉండేవాడు. కానీ, అతని ఆశలకు ఫెదరర్ గండికొట్టాడు. మొత్తం మీద నాదల్ గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లో ఫైనల్ చేరడం ఇది 21వసారి. వీటిలో 14 విజయాలను సాధించగా, ఏడు పర్యాయాలు పరాజయాలను ఎదుర్కొని రన్నరప్ ట్రోఫీ తీసుకున్నాడు. గ్రాండ్ శ్లామ్స్ ఫైనల్స్‌లో అతను ఫెదరర్ చేతిలో ఓడడం ఇది మూడోసారి. జొకోవిచ్ కూడా మూడసార్లు ఫైనల్‌లో నాదల్‌పై గెలిచాడు.

చిత్రం..ఆస్ట్రేలియా ఓపెన్ ట్రోఫీతో ఫెదరర్