క్రీడాభూమి

కోహ్లీ ‘ రికార్డు డబుల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: కెప్టెన్ విరాట్ డబుల్ సెంచరీ సాధించి, కొత్త రికార్డును నెలకొల్పితే, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా అజేయ శతకంతో రాణించడంతో, బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ రెండో రోజు భారత్ 6 వికెట్లకు 687 పరుగుల భారీ స్కోరువద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి సౌమ్య సర్కార్ వికెట్‌ను కోల్పోయి 41 పరుగులు చేసింది.
టీమిండియా రెండో రోజు ఆటను మూడు వికెట్ల నష్టానికి 356 పరుగుల స్కోరువద్ద ఆరంభించింది. అప్పటికి కోహ్లీ 111, ఆజింక్య రహానే 45 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లాదేశ్ బౌలింగ్‌పై ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ స్కోరుబోర్డును ముందుకు దూకించిన వీరు నాలుగో వికెట్‌కు 222 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 456 పరుగుల వద్ద రహానే వికెట్ కూలింది. అతను 133 బంతులు ఎదుర్కొని, 11 ఫోర్లతో 82 పరుగులు సాధించి తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో మెహదీ హసన్ మీర్జా క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. మరో 39 పరుగుల తర్వాత కోహ్లీ వికెట్ కూడా కూలింది. అతను తన మారథాన్ ఇన్నింగ్స్‌లో 246 బంతులు ఎదుర్కొన్నాడు. 24 ఫోర్లతో 204 పరుగులు చేసి, తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లోనే ఎల్‌బిగా వెనుదిరిగాడు. రవిచంద్రన్ అశ్విన్ 45 బంతుల్లో 34 పరుగులు చేసి, మెహదీ హసన్ మీర్జా బౌలింగ్‌లో సౌమ్య సర్కార్‌కు దొరికాడు. అనంతరం సాహా, రవీంద్ర జడేజా మరో వికెట్ కూలకుండా స్కోరును 166 ఓవర్లలో 687 పరుగులకు చేర్చగా, ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్టు కెప్టెన్ కోహ్లీ ప్రకటించాడు. సాహా 155 బంతులు ఎదుర్కొని, 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో 106 పరుగులు సాధించి నాటౌట్‌గా ఉన్నాడు. అతనికి కెరీర్‌లో ఇది రెండో టెస్టు సెంచరీ. అతనితోపాటు మరో నాటౌట్ బ్యాట్స్‌మన్ జడేజా 78 బంతుల్లో 60 పరుగులు చేశాడు. తైజుల్ ఇస్లాం 156 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టగా, మెహదీ హసన్ మీర్జాకు రెండు వికెట్లు లభించాయి. కాగా, భారత్ తరఫున మూడు వరుస టెస్టుల్లో కనీసం ఒక బ్యాట్స్‌మన్ రెండు వందలు లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించడం విశేషం. ఇంగ్లిండ్‌పై ముంబయిలో కోహ్లీ 235 పరుగులు చేశాడు. చెన్నై టెస్టులో కరుణ్ నాయర్ అజేయంగా 303 పరుగులు సాధించాడు. ఈ టెస్టులో తిరిగి కోహ్లీ 204 పరుగులతో విజృంభించాడు. కాగా, రహానేతో కలిసి కోహ్లీ మూడోసారి డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. వీరిద్దరూ ఈమూడు డబుల్ సెంచరీ పార్ట్‌నర్‌షిప్స్‌ను నాలుగో వికెట్‌కే సాధించడం గమనార్హం. సచిన్ తెండూల్కర్, సౌరవ్ గంగూలీ కూడా మూడు పర్యాయాలు, నాలుగో వికెట్‌కే డబుల్ సెంచరీ భాగస్వామ్యాలను అందించారు.
ఉమేష్ దెబ్బ
భారత్ భారీ స్కోరుకు దీటైన సమాధానం ఇవ్వడానికి మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బంగ్లాదేశ్‌ను ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ తొలి దెబ్బతీశాడు. సౌమ్య సర్కార్ (15)ను అతను వికెట్‌కీపర్ సాహా క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. అనంతరం మోమినుల్ హక్ (1 నాటౌట్)తో కలిసి ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ వికెట్ కూలకుండా జాగ్రత్త పడ్డాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 14 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 41 పరుగులు చేసింది. మోమినుల్ హక్‌తోపాటు క్రీజ్‌లో ఉన్న తమీమ్ ఇక్బాల్ 48 బంతుల్లో, మూడు ఫోర్లతో 24 పరుగులు చేశాడు.
**
టీమిండియా అరుదైన రికార్డు
* భారత జట్టుకు అరుదైన రికార్డు దక్కింది. వరుసగా మూడు టెస్టుల్లో ఆరు వందలకుపైగా పరుగులు సాధించిన ఏకైక జట్టుగా చరిత్రకెక్కింది. ఇంగ్లాండ్‌తో ముంబయిలో జరిగిన టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 631 పరుగులు చేసిన భారత్ ఆ మ్యాచ్‌ని ఇన్నింగ్స్‌ను తేడాతో గెల్చుకుంది. ఆ వెంటనే చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్లకు 759 పరుగులు సాధించింది. ఆ టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. ఇప్పుడు హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లకు 687 పరుగులు చేసింది. వరుసగా మూడు టెస్టుల్లో ఆరు వందలకు మించి స్కోరును నమోదు చేసిన ఒకే ఒక జట్టుగా రికార్డు సృష్టించింది.
టెస్టుల్లో భారత్ సాధించిన అత్యధిక స్కోర్లలో 6 వికెట్లకు 687 (డిక్లేర్డ్) ఐదో స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్‌తో జరిగిన చెన్నై టెస్టులో ఏడు వికెట్లకు 759 పరుగులు సాధించింది. 2009లో శ్రీలంకపై ముంబయి టెస్టులో తొమ్మిది వికెట్లకు 726 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. 2010లో శ్రీలంకతో కొలంబోలో జరిగిన టెస్టులో 707 పరుగులు సాధించింది. 2004లో ఆస్ట్రేలియాపై సిడ్నీ టెస్టులో 7 వికెట్లకు 705 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. వీటి తర్వాతి స్థానం తాజా స్కోరుది. మొత్తం మీద బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు మొదటి రెండు రోజుల్లోనే ఎన్నో రికార్డులు నెలకొన్నాయ. మ్యాచ్ ముగిసేలోగా ఇంకెన్ని నమోదవుతాయో చూడాలి.
**
నాలుగు సిరీస్‌లు
నాలుగు డబుల్ సెంచరీలు!
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. నాలుగు వరుస సిరీస్‌ల్లో నాలుగు డబుల్ సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంతకు ముందు ఆస్ట్రేలియా ‘లెజెండరీ క్రికెటర్’ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్, భారత మాజీ కెప్టెన్, ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ మూడు వరుస సిరీస్‌ల్లో మూడు డబుల్ సెంచరీలు నమోదు చేశారు. కాగా, ఇంతకు ముందు వరుసగా వెస్టిండీస్ (200), న్యూజిలాండ్ (211), ఇంగ్లాండ్ (235) జట్లతో జరిగిన సిరీస్‌ల్లో డబుల్ సెంచరీలు చేసిన కోహ్లీ బంగ్లాదేశ్‌పైనా అదే ఫీట్‌ను ప్రదర్శించి, నాలుగు వరుస సిరీస్‌ల్లో నాలుగు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా చరిత్ర పుటల్లో చోటు సంపాదించాడు.
**

కెప్టెన్‌గా ఎక్కువ డబుల్ సెంచరీలు చేసిన రికార్డు బ్రియాన్ లారా పేరుపై ఉంది. అతను ఐదు పర్యాయాలు ఈ ఫీట్ సాధించాడు. కోహ్లీ కెప్టెన్‌గా నాలుగో డబుల్ సెంచరీ చేసి, సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్, మైఖేల్ క్లార్క్, గ్రేమ్ స్మిత్ సరసన స్థానం సంపాదించాడు.

స్కోరుబోర్డు

భారత్ మొదటి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 3 వికెట్లకు 356): లోకేష్ రాహుల్ బి తస్కిన్ అహ్మద్ 2, మురళీ విజయ్ బి తైజుల్ ఇస్లాం 100, చటేశ్వర్ పుజారా సి ముష్ఫికర్ రహీం బి మెహదీ హసన్ మీర్జా 83, విరాట్ కోహ్లీ ఎల్‌బి తైజుల్ ఇస్లాం 204, ఆజింక్య రహానే సి మెహదీ హసన్ మీర్జా బి తైజుల్ ఇస్లాం 82, వృద్ధిమాన్ సాహా 106 నాటౌట్, అశ్విన్ సి సౌమ్య సర్కార్ బి మెహదీ హసన్ మీర్జా 34, రవీంద్ర జడేజా 60 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 8, మొత్తం (166 ఓవర్లలో 6 వికెట్లకు) 687 డిక్లేర్డ్.
వికెట్ల పతనం: 1-2, 2-180, 3-234, 4-456, 5-495, 6-569.
బౌలింగ్: తస్కిన్ అహ్మద్ 25-2-127-1, కమ్రుల్ ఇస్లాం రబ్బీ 19-1-100-0, సౌమ్య సర్కార్ 1-0-4-0, మెహదీ హసన్ మీర్జా 42-0-165-2, షకీబ్ అల్ హసన్ 24-4-104-0, తైజుల్ ఇస్లాం 47-6-156-3, సబ్బీర్ రహ్మాన్ 3-0-10-0, మహమ్మదుల్లా 5-0-16-0.
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: తమీమ్ ఇక్బాల్ 24 నాటౌట్, సౌమ్య సర్కార్ సి వృద్ధిమాన్ సాహా బి ఉమేష్ యాదవ్ 15, మోమినుల్ హక్ 1 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 1, మొత్తం (14 ఓవర్లలో వికెట్ నష్టానికి) 41.
వికెట్ల పతనం: 1-38.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 5-2-7-0, ఇశాంత్ శర్మ 5-0-30-0, అశ్విన్ 2-1-1-0, ఉమేష్ యాదవ్ 2-1-2-1.

చిత్రాలు..డబుల్ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ, శతకంతో రాణించిన సాహా