క్రీడాభూమి

పట్టు బిగించిన టీమిండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో విజయానికి టీమిండియా ఏడు వికెట్ల దూరంలో నిలిచింది. మరోవైపు చివరి రోజు ఆలౌట్ కాకుండా నిలబడి, మ్యాచ్‌ని డ్రా చేసుకోవడమే లక్ష్యంగా బంగ్లాదేశ్ పోరాటాన్ని కొనసాగించనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో, విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత్ చివరి రోజైన సోమవారం ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాచ్‌ని తన ఖాతాలో వేసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 388 పరుగులకు ఆలౌట్‌కాగా, మొదటి ఇన్నింగ్స్‌లో 299 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించినప్పటికీ, ప్రత్యర్థికి ఫాలోఆన్ అవకాశం ఇవ్వకుండా, భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడింది. నాలుగు వికెట్లకు 159 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి, బంగ్లాదేశ్ ముందు 459 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. దాదాపు అసాధ్యంగా కనిపిస్తున్న ఈ భారీ స్కోరును సాధించడం కష్టమన్న నిర్ధారణకు వచ్చిన బంగ్లాదేశ్ ఆలౌట్ కాకుండా జాగ్రత్త పడుతూ మ్యాచ్‌ని డ్రా చేసుకోవడమే మేలని భావిస్తున్నది. అయితే, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 103 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ జట్టు గెలవాలంటే చివరి రోజు ఆటలో ఇంకా 356 పరుగులు చేయాలి. ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. డ్రా చేసుకోవాలంటే ఆలౌట్ కాకుండా జాగ్రత్త పడాలి. కానీ, భారత బౌలింగ్‌ను ఎంత వరకూ సమర్థంగా ఎదుర్కొంటుందనేది అనుమానంగానే ఉంది.
ముష్ఫికర్ సెంచరీ
బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ రహీం సెంచరీతో రాణించినప్పటికీ పరిస్థితి ఆశాజనకంగా కనిపించలేదు. ఆరు వికెట్లకు 322 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం ఉదయం ఆటను కొనసాగించిన బంగ్లాదేశ్, మొదటి ఓవర్ నాలుగో బంతికే మెహదీ హసన్ మీర్జా వికెట్‌ను కోల్పోయింది. 107 బంతులు ఎదుర్కొని, 10 ఫోర్లతో 51 పరుగులు చేసిన మెహదీ తన ఓవర్‌నైట్ స్కోరుకు ఒక్క పరుగు కూడా జత చేయకుండానే, భువనేశ్వర్ కుమార్ బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తైజుల్ ఇస్లాం 10 పరుగులు చేసి, ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. ఎనిమిది పరుగులు చేసిన తస్కిన్ అహ్మద్‌ను ఆజింక్య రహానే క్యాచ్ పట్టగా రవీంద్ర జడేజా పెవిలియన్‌కు పంపాడు. కాగా, క్రీజ్‌లో నిలదొక్కుకొని, కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన ముష్ఫికర్ రహీం మొత్తం 262 బంతులు ఎదుర్కొని 127 పరుగులు సాధించి, అశ్విన్ బౌలింగ్‌లో సాహాకు చిక్కాడు. అతని స్కోరులో 16 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. చివరి వికెట్‌గా ముష్ఫికర్ క్రీజ్‌ను వీడడంతో, 127.5 ఓవర్లలో 388 పరుగుల స్కోరువద్ద బంగ్లాదేశ్ ఆలౌటైంది. పది బంతులు ఎదుర్కొన్నప్పటికీ పరుగుల ఖాతాను తెరవని కమ్రుల్ ఇస్లాం రబ్బీ నాటౌట్‌గా ఉన్నాడు. ఉమేష్ యాదవ్ 84 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టగా, అశ్విన్, జడేజా చెరి రెండు వికెట్లు సాధించారు.
పుజారా అర్ధ శతకం
మొదటి ఇన్నింగ్స్‌లో 299 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి, 12 పరుగుల వద్ద మురళీ విజయ్ (7) వికెట్‌ను కోల్పోయింది. అతను తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో ముష్ఫికర్ రహీం క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన అతను రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 14 బంతులు ఎదుర్కొన్నాడు. మరో ఓపెనర్ లోకేష్ రాహుల్ రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమై, 10 పరుగులు చేసి విజయ్ అవునైన విధంగానే వికెట్ పారేసుకున్నాడు. ఈ దశలో చటేశ్వర్ పుజారా, కెప్టెన్ కోహ్లీ టీమిండికు అండగా నిలిచే ప్రయత్నం చేశారు. మొదటి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేసి, మంచి ఫామ్‌లో ఉన్న కోహ్లీ మరోసారి అదే స్థాయిలో రాణిస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశ తప్పలేదు. అతను 40 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 38 పరుగులు చేసి, షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో మహమ్మదుల్లా క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. ఆజింక్య రహానే 20 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లోనే బౌల్డ్ అయ్యాడు. ఫోర్త్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన రవీంద్ర జడేజా (16 నాటౌట్)తో కలిసి పుజారా స్కోరుబోర్డును ముందుకు కదిలించాడు. అతను అర్ధ శతకాన్ని పూర్తి చేసిన తర్వాత, 29 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్టు కోహ్లీ ప్రకటించాడు. 58 బంతులు ఎదుర్కొన్న పుజారా ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 54 పరుగులు సాధించాడు. తస్కిన్ అహ్మద్, షకీబ్ అల్ హసన్ చెరి రెండు వికెట్లు కూల్చారు.
కష్టాల్లో ‘అండర్ డాగ్స్’
ఈ మ్యాచ్‌లో ‘అండర్ డాగ్స్’ ముద్రతో మైదానంలోకి దిగిన బంగ్లాదేశ్ కష్టాల్లో పడింది. 459 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఈ జట్టు 11 పరుగుల స్కోరువద్ద తమీమ్ ఇక్బాల్ వికెట్‌ను కోల్పోయింది. అతను మూడు పరుగులు చేసి, అశ్విన్ బౌలింగ్‌లో కోహ్లీకి చిక్కాడు. భారత బౌలింగ్‌ను కొంత సేపు ధైర్యంతో ఎదుర్కొన్న సౌమ్య సర్కార్ 42 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద జడేజా బౌలింగ్‌లో రహానే చక్కటి క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. 66 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో ఏడు ఫోర్లు ఉన్నాయి. మోమినుల్ హక్ 27 పరుగులు చేసి, అశ్విన్ బౌలింగ్‌లో రహానేకు దొరికిపోయాడు. 75 పరుగుల స్కోరువద్ద బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. ఆతర్వాత మహమ్మదుల్లా (9 నాటౌట్), షకీబ్ అల్ హసన్ (21 నాటౌట్) మరో వికెట్ కూలకుండా జట్టు స్కోరును 103 పరుగులకు చేర్చారు. అశ్విన్ రెండు, జడేజా ఒకటి చొప్పున వికెట్లు పడగొట్టారు.

చిత్రాలు..ముష్ఫికర్ రహీం (127)
*అజేయంగా అర్ధ శతకం చేసిన చటేశ్వర్ పుజారా