క్రీడాభూమి

జట్టు దృష్టంతా ఆసీస్ సిరీస్‌పైనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: తమ దృష్టి మొత్తం ఆస్ట్రేలియాతో జరగబోయే నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌పైనే కేంద్రీకృతమైందని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టును గెల్చుకున్న తర్వాత, ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డును స్వీకరించిన అతను మాట్లాడుతూ ఆసీస్‌తో ఈనెల 23 నుంచి పుణేలో మొదలయ్యే మొదటి టెస్టు కోసం ఎదురుచూస్తున్నామని అన్నాడు. బలమైన ఇంగ్లాండ్‌ను 4-0 తేడాతో ఓడించామని, ఆస్ట్రేలియాపై అదే స్థాయిలో ఆడాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నాడు. వరుసగా నాలుగు సిరీస్‌ల్లో నాలుగు డబుల్ సెంచరీలు సాధించి, సరికొత్త రికార్డు నెలకొల్పడంపై అతను స్పందిస్తూ, హైదరాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందన్నాడు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ, బంగ్లాదేశ్ అద్భుతంగా ఆడిందని, చివరి వరకూ పోరాటాన్ని కొనసాగించిందని ప్రశంసించాడు.
పాఠాలు నేర్చుకున్నాం: ముష్ఫికర్
భారత్‌తో జరిగిన టెస్టులో ఓడినప్పటికీ ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ రహీం అన్నాడు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్‌ను నిలువరించడం సులభ సాధ్యం కాదని వ్యాఖ్యానించాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లోనూ మెరుగైన బ్యాటింగ్‌తో రాణించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశామని అన్నాడు. భారత్‌కు స్పిన్ విభాగంలోగాక, ఫాస్ట్ బౌలింగ్‌లోనూ ఎన్నో మార్పులు చేసుకునే అవకాశం ఉందని, కానీ, తమకు ఆ స్థాయి బౌలర్లు లేరని చెప్పాడు. మొత్తం మీద ఈ టెస్టులో తమ ఆటతీరు సంతృప్తికరంగానే కొనసాగిందని అన్నాడు.
ముంబయి చేరిన స్మిత్ సేన
ముంబయి: స్టీవెన్ స్మిత్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సోమవారం రాత్రి ముంబయి చేరింది. ఒకరోజు విశ్రాంతి తీసుకున్న తర్వాత, 15వ తేదీన ప్రాక్టీస్ సెషన్‌లో ఆసీస్ ఆటగాళ్లు పాల్గొంటారు. భారత్‌లో ఆస్ట్రేలియా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతుంది. ఇంగ్లాండ్‌తో జరగబోయే ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌కు సిద్ధమయ్యేందుకు భారత్‌తో పోరును ఆసీస్ సరైన వేదికగా భావిస్తున్నది.
నేడు టీమిండియా ఎంపిక
ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ కోసం భారత జట్టును మంగళవారం ఎంపిక చేస్తారు. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ సమావేశంలో ఆటగాళ్ల ఎంపిక జరుగుతుంది. జాతీయ జట్టుకు ఎంపికైనప్పటికీ, గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో పాల్గొనలేకపోయిన మహమ్మద్ షమీకి మళ్లీ జట్టులో చోటు దక్కవచ్చు. అదే విధంగా అమిత్ మిశ్రా గాయపడడంతో జట్టులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్‌ను కూడా సెలక్టర్లు కొనసాగించే అవకాశం ఉంది. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌కు ఎంపికైన జట్టులో భారీ మార్పులు లేకుండానే ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపిక చేయవచ్చన్న వాదన వినిపిస్తున్నది.