క్రీడాభూమి

తాహిర్‌కు 5 వికెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆక్లాండ్, ఏప్రిల్ 17: న్యూజిలాండ్‌తో జరిగిన ఏకైక టి-20 మ్యాచ్‌ని దక్షిణాఫ్రికా 78 పరుగుల తేడాతో కైవసం చేసుకుంది. స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ ఐదు వికెట్లు సాధించి, కివీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను తీవ్రంగా దెబ్బతీశాడు. తన బౌలింగ్ ప్రతిభతో జట్టును గెలిపించిన తాహిర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తన బ్యాటింగ్ బలంపై విపరీతమైన నమ్మకంతో ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. ప్రత్యర్థి ఆహ్వానం మేరకు మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. ఓపెనర్ హషీం ఆమ్లా 43 బంతులు ఎదుర్కొని, 62 పరుగులు (తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్) సాధించాడు. మిడిల్ ఆర్డర్‌లో కెప్టెన్ ఫఫ్ డు ప్లెసిస్ (36), ఎబి డివిలియర్స్ (26), జీన్ పాల్ డుమినీ (29) కూడా మెరుగైన బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికాకు గౌరవ ప్రదమైన స్కోరును అందించారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, కొలిన్ డి గ్రామ్‌హోమ్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు. కాగా, సాధించగలిగిన లక్ష్యాన్ని ఛేదించడంలో కివీస్ దారుణంగా విఫలమైంది. టామ్ బ్రూస్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడంటే, మిగతా బ్యాట్స్‌మెన్ ఎంతగా విఫలమయ్యారో స్పష్టమవుతుంది. చివరిలో టిమ్ సౌథీ (20) కొంత సేపు జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. 3.5 ఓవర్లు బౌల్ చేసిన తాహిర్ 24 పరుగులకు ఐదు వికెట్లు కూల్చాడు. ఆండిలె ఫెహ్లుక్వాయో 19 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు. క్రిస్ మోరిస్‌కు రెండు వికెట్లు దక్కాయి.

చిత్రం..ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో ఇమ్రాన్ తాహిర్