క్రీడాభూమి

అదృష్టవంతులెవరో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఆటగాళ్ల వేలానికి రంగం సిద్ధమైంది. సోమవారం జరిగే వేలంలో 350 మందికిపైగా ఆటగాళ్లు జాబితాలో ఉంటే, 76 మందికి మాత్రమే అవకాశం దక్కుతుంది. దీనితో, ఎవరు ఐపిఎల్ కుటుంబంలోకి వస్తారు? ఎవరికి నిరాశ ఎదురవుతుంది? అనే ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. వేలం జాబితాలో ఉన్న ఆటగాళ్లకు కనీస ధర (బేస్ ప్రైస్) 10 నుంచి 2 కోట్ల రూపాయల వరకు ఉంది. శనివారం ముగిసిన ముస్తాక్ అలీ టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో చూపిన ప్రతిభను బట్టి వేలంలో ఆయా ఆటగాళ్లకు డిమాండ్ ఉంటుందని అంటున్నారు.

బెంగళూరు, ఫిబ్రవరి 19: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో మరోసారి ఆటగాళ్ల వేలానికి రంగం సిద్ధమైంది. ఫ్రాంచైజీలు ఎప్పుడు, ఎవరిని నెత్తికెక్కించుకుంటారో.. ఎవరిని విసిరికొడతారో ఎవరికీ తెలియని పరిస్థితి. నిరుడు జరిగిన ఐపిఎల్ వేలమే ఇందుకు నిదర్శనం. ఆస్ట్రేలియా సీనియర్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌కు అత్యధికంగా 9.5 కోట్ల రూపాయలు లభించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. నిజానికి, భారత ఆటగాడు యువరాజ్ సింగ్‌కు అత్యధిక మొత్తం లభిస్తుందని, అతనే రికార్డు మొత్తాన్ని పొందుతాడని అందరూ ఊహించినప్పటికీ, అందుకు భిన్నంగా 34 ఏళ్ల వాట్సన్‌కు అత్యధిక ధర పలికింది. డాలర్లలో చూస్తే వాట్సన్‌కు 1.39 మిలియన్లు లభించాయి. మూడు ఫ్రాంచైజీలు అతని కోసం తీవ్రంగా పోటీపడగా, అత్యధిక ధరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) అతనిని దక్కించుకుంది. మొత్తం 351 మంది ఆటగాళ్లను 2016 వేలంలో చేర్చారు. యువీకి భారీ ధర లభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైనప్పటికీ, ఆటగాళ్లందరిలోనూ షేన్ వాట్నస్, భారతీయుల్లో పవన్ నేగీ ఎవరూ ఊహించని రీతిలో భారీ మొత్తాలను సంపాదించుకున్నారు. 2015లో రికార్డు మొత్తాన్ని దక్కించుకున్న యువీ దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్‌తో కలిసి సంయుక్తంగా తృతీయ స్థానాన్ని పంచుకోవాల్సి వచ్చింది.
ఐపిఎల్ వేలంలో విచిత్రాలు జరుగుతాయని చెప్పడానికి నిరుడు భారతీయుల్లో అత్యధిక మొత్తాన్ని పవన్ నేగీ అనే అనామకుడు దక్కించుకోవడాన్ని మించిన సాక్ష్యం లేదు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఫ్రాంచైజీ అతనిపై ఏకంగా 8.5 కోట్ల రూపాయలు వెచ్చించింది. 30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలానికి వెళ్లిన అతనికి ఇంత భారీ మొత్తాన్ని ఎవరూ ఊహించలేదు. చివరికి అతను కూడా దిగ్భ్రాంతికి గురై ఉంటాడు. 2011 వరల్డ్ కప్‌ను భారత్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్ కంటే నేగీకి ఎక్కువ మొత్తం లభించడం విచిత్రం. ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల ఎడమ చేతివాటం బౌలర్ నేగీ నిరుటి ఐపిఎల్ వేలానికి ముందు కెరీర్‌లో కేవలం రెండు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. చేసిన పరుగులు 54. 126 బంతులు వేసి రెండు వికెట్లు పడగొట్టాడు. అటు గణాంకాలుగానీ, ఇటు సామర్థ్యంగానీ అతనిని ఐపిఎల్ వేలంలో అత్యుత్తమ భారత క్రికెటర్‌గా నిలబెట్టే స్థాయిలో లేకపోయినా, ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఎందుకు అంత భారీ మొత్తాన్ని ఖర్చు చేసిందో ఎవరికీ అర్థం కాలేదు. ఇక వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రాకు నిరుడు రూ. 5.5 కోట్లు లభించాయి. షేన్ వాట్సన్, యువరాజ్ సింగ్‌తోపాటు రెండు కోట్ల బేస్ ప్రైస్‌గల నెహ్రాను కూడా జాక్‌పాట్ వరించింది. ఇప్పుడు అతను మళ్లీ జాతీయ జట్టులోకి రావడంతో, వేలంలో మరింత భారీ ధర పలికే అవకాశాలున్నాయి.
బేస్ ప్రైస్ నామమాత్రమే!
ఐపిఎల్‌లో బేస్ ప్రైస్ నామమాత్రపు ధరేనని, వాస్తవానికి ఫ్రాంచైజీల మూడ్‌ను బట్టి ఆటగాళ్లు అందలం ఎక్కడమో, అథఃపాతాళానికి పడిపోవడమో జరుగుతుందని ఎన్నో సందర్భాల్లో స్పష్టమైంది. నిరుడు జరిగిన వేలం కూడా ఈ విషయాన్ని రుజువు చేసింది. షేన్ వాట్సన్, యువరాజ్ సింగ్‌తోపాటు ఆశిష్ నెహ్రా, మిచెల్ మార్ష్, సంజూ శాంసన్, ఇశాంత్ శర్మ, కెవిన్ పీటర్సన్, దినేష్ కార్తీక్, స్టువర్ట్ బిన్నీ, ధవళ్ కులకర్ణి తదితరుల కనీస ధర రెండు కోట్ల రూపాయలు. అయితే, నెహ్రాకు 5.5, మిచెల్ మార్ష్‌కు 4.8, సంజూ శాంసన్‌కు 4.2 కోట్ల రూపాయలు లభించాయి. అదే విధంగా ఇశాంత్‌కు 3.8, కెవిన్ పీటర్సన్‌కు 3.5 కోట్లు దక్కాయి. దినేష్ కార్తీక్ తన కనీస ధర కంటే కేవలం 30 లక్షల రూపాయలు అదనంగా పొందగలిగాడు.
వెక్కిరించిన దురదృష్టం
నిరుడు చాలా మంది క్రికెటర్లను దురదృష్టం వెక్కిరించింది. పలువురు స్టార్ క్రికెటర్లకు అవకాశమే దక్కలేదు. అలాంటి వారిలో ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా), న్యూజిలాండ్‌కు చెందిన హార్డ్ హిట్టర్ మార్టిన్ గుప్టిల్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ జార్జి బెయిలీ, దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ హషీం ఆమ్లా, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన ఆటగాళ్లు మహేల జయవర్ధనే, మైఖేల్ హస్సీ, బ్రాడ్ హాడిన్ తదితరులున్నారు. అదే విధంగా డారెన్ సమీ (వెస్టిండీస్), తిలకరత్నే దిల్షాన్ (శ్రీలంక), డేవిడ్ హస్సీ, ఆడమ్ వోగ్స్ (ఆస్ట్రేలియా), మునాఫ్ పటేల్ (్భరత్) వంటి పేరొందిన ఆటగాళ్లనూ దురదృష్టం వెంటాడింది. ఇదే జాబితాలో సుమ్రహ్మణ్య బద్రీనాథ్, ఉస్మాన్ ఖాజా, మనోజ్ తివారీ, కేన్ రిచర్డ్‌సన్, అశోక్ దిండా, అజంతా మెండిస్, సులేమాన్ బెన్, రాహుల్ శర్మ, డారెన్ బ్రేవో, ప్రజ్ఞాన్ ఓఝా తదితరులు కూడా ఉన్నారు. ఈసారి ఐపిఎల్ వేలంలో ఎంత మందికి ఇలాంటి నిరాశ ఎదురవుతుందో, ఎంత మంది అనుకోని మొత్తాలను పొందుతారో చూడాలి. ఈ ప్రశ్న అందరిలోనూ ఆసక్తిని రేపుతున్నది
అందుబాటులో ఎవరుంటారు?
ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా క్రికెటర్లు చాలా మంది ఐపిఎల్ వేలం పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. కాంట్రాక్టు కోసం తహతహలాడుతున్నారు. కానీ, వీరిలో ఎంత మంది అందుబాటులో ఉంటారన్నదే అనుమానం. ముందుగానే ఖరారైన అంతర్జాతీయ సిరీస్‌ల్లో పాల్గొనాల్సి ఉంటే, ఐపిఎల్‌కు దూరంకాక తప్పదు. ఐపిఎల్ కోసం జాతీయ జట్లను నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. మరోసారి అలాంటి పరిస్థితే వస్తే, ఈ టోర్నమెంట్‌లో ఆడే ఆటగాళ్లపై వివధ దేశాల క్రికెట్ బోర్డులు వేటు వేసే ప్రమాదం లేకపోలేదు.
అఫ్గాన్ వీరులు!
ఐపిఎల్ వేలంలో ఈసారి ఇద్దరు అఫ్గానిస్థాన్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. అంతర్యుద్ధంలో నలిగిపోతున్న అఫ్గాన్ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో తమ ఉనికిని చాటుకున్న ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీ, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ మహమ్మద్ షాజాద్ ఐపిఎల్‌లో అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఇస్లామిక్ మత పెద్దల ఆంక్షలను బేఖాతరు చేస్తూ, ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నా వాటిని సమర్థంగా ఎదుర్కొంటూ క్రికెట్‌లో రాణిస్తున్న నబీ, షాజాద్‌లను ఏ జట్లు కొంటాయో, ఎంత మొత్తాలను చెల్లిస్తాయో చూడాలి.