క్రీడాభూమి

ఒకీఫ్ స్పినే్నశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, ఫిబ్రవరి 24: ఆస్ట్రేలియా ఎడమచేతి వాటం స్పిన్నర్ స్టీవ్ ఒకీఫ్ దెబ్బకు టీమిండియా కుప్పకూలింది. తిరుగులేని బ్యాటింగ్ బలంతో గత 19 టెస్టుల్లో ఒక్క ఓటమిని కూడా చవిచూడకుండా దూసుకెళుతున్న విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 105 పరుగులకే ఆలౌటైంది. స్టీవ్ ఒకీఫ్ ఆరు వికెట్లు పడగొట్టి, భారత్‌ను దారుణంగా దెబ్బతీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లకు 143 పరుగులు చేసింది. ఈ జట్టు ఇప్పటికే 298 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించగా, ఆరు వికెట్లు చేతిలో ఉన్నాయి. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (59), మిచెల్ మార్ష్ (21) క్రీజ్‌లో ఉన్నారు.
తొమ్మిది వికెట్లకు 256 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో, మ్యాచ్ రెండో రోజు, శుక్రవారం ఉదయం ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా, మొదటి ఓవర్‌లో ఐదు బంతుల్లో, మరో నాలుగు పరుగులు జోడించి అలౌటైంది. మిచెల్ స్టార్క్ 63 బంతుల్లో 61 పరుగులు చేసి, అశ్విన్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. అయితే, ఆసీస్‌ను 260 పరుగులకే ఆలౌట్ చేసిన ఆనందం భారత్‌కు ఎక్కువ సేపు నిలవలేదు. మురళీ విజయ్ పది పరుగులు చేసి, జట్టు స్కోరు 26 పరుగుల వద్ద వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్ క్యాచ్ పట్టగా జొష్ హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో అవుట్‌కావడంతో మొదలైన భారత్ పతనం ఏ దశలోనూ ఆగలేదు. లోకేష్ రాహుల్ ఒంటరి పోరాటం సాగించినప్పటికీ, మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి అతనికి సరైన సహకారం లభించలేదు. చటేశ్వర్ పుజారా 6 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో మాథ్యూ వేడ్‌కు చిక్కాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం రెండు బంతులు ఎదుర్కొని, పరుగుల ఖాతాను తెరవకుండానే మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో పీటర్ హ్యాండ్స్‌కోమ్ క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. ఆసీస్ బౌలింగ్‌ను సమర్థంగా ప్రతిఘటిస్తూ, హాఫ్ సెంచరీని పూర్తి చేసిన లోకేష్ రాహుల్‌ను డేవిడ్ వార్నర్ క్యాచ్ అందుకోగా స్టీవ్ ఓకీఫ్ అవుట్ చేశాడు. 97 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 64 పరుగులు చేశాడు. 94 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా మరో 11 పరుగులకే ఆలౌటైంది. ఒకరి తర్వాత మరొకరిగా భారత బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. 40.1 ఓవర్లలో 105 పరుగులకే మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. మహారాష్ట్ర క్రికెట్ సంఘం మైదానంలోని స్పిన్ పిచ్ తీరును ఒకీఫ్ నూరుశాతం సద్వినియోగం చేసుకున్నాడు. రాహుల్‌తోపాటు మురళీ విజయ్, ఆజింక్య రహానే మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారంటే, భారత బ్యాట్స్‌మెన్ ఏ స్థాయిలో విఫలమయ్యారో ఊహించుకోవచ్చు.
టీమిండియాను మొదటి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితం చేసిన ఆస్ట్రేలియా ఆతర్వాత రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించి, పది పరుగుల వద్ద డేవిడ్ వార్నర్ (10) వికెట్‌ను కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో అతను ఎల్‌బిగా వెనుదిరిగాడు. షాన్ మార్ష్ 21 బంతులు ఎదుర్కొన్నప్పటికీ, ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. అశ్విన్ బౌలింగ్‌లో అతను ఎల్‌బి అయ్యాడు. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యతను కెప్టెన్ స్టీవెన్ స్మిత్ స్వీకరించాడు. అతనికి కొంత సేపు అండగా నిలిచిన పీటర్ హ్యాండ్స్‌కోమ్ (19)ను మురళీ విజయ్ క్యాచ్ పట్టగా అశ్విన్ పెవిలియన్ పంపాడు. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకోని మాట్ రెన్‌షా 50 బంతుల్లో 31 పరుగులు చేసి, జయంత్ యాదవ్ బౌలింగ్‌లో ఇశాంత్ శర్మకు చిక్కాడు. ఫోర్త్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన మిచెల్ మార్ష్ (21 నాటౌట్)తో కలిసి స్మిత్ మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడ్డాడు. 117 బంతులు ఎదుర్కొన్న అతను 59 పరుగులు సాధించి, ఆసీస్‌కు భారీ స్కోరును అందించే దిశగా సాగుతున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 46 ఓవర్లలో నాలుగు వికెట్లకు 143 పరుగులు సాధించింది.

మూడేళ్ల తర్వాత కోహ్లీ డకౌట్
పుణే: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్ పట్టుకొని క్రీజ్‌లో గార్డ్ తీసుకున్న మరుక్షణం నుంచే అతని నుంచి పరుగుల వరదను ప్రేక్షకులు ఆశిస్తారు. సుమారు ఏడాదిన్నరగా అద్వితీయ ఫామ్‌ను కొనసాగిస్తున్న అతను సున్నాకే అవుట్‌కావడం అభిమానులను నిరాశ పరచింది. మిచెల్ స్టార్క్ బంతిని వెంటాడి మరీ కోహ్లీ అవుటయ్యాడు.
11 పరుగుల తేడాలో కూలిన ఏడు వికెట్లు!
పుణే: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ కేవలం 11 పరుగుల తేడాతో ఏడు వికెట్లు కోల్పోయింది. ఒకానొక దశలో మూడు వికెట్లు చేజార్చుకొని 94 పరుగులు చేసిన టీమిండియా 105 పరుగులకే అలౌటైంది. 1990లో న్యూజిలాండ్‌పై క్రైస్ట్‌చర్చి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఏడు వికెట్లు కోల్పోయింది. మూడు వికెట్లకు 146 పరుగులు చేసిన భారత్ 164 పరుగులకు ఆలౌటైంది. 1978లో ఇంగ్లాండ్‌పై లార్డ్ మైదానంలో జరిగిన టెస్టులో 21 పరుగులకు ఏడు, 2011లో ది ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్‌పై 21 పరుగులకు ఏడు చొప్పున వికెట్లు కోల్పోయిన భారత్, ఇప్పుడు 11 పరుగుల తేడాతోనే ఏడు వికెట్లను సమర్పించుకుంది. కాగా, టీమిండియా స్వదేశంలో చేసిన అతి తక్కువ స్కోరు 76. దక్షిణాఫ్రికాతో 2008లో అహ్మదాబాద్ టెస్టులో తలపడినప్పుడు భారత్ వంద పరుగుల మైలురాయిని కూడా చేరకుండానే వెనుదిరిగింది. ఈ టెస్టులో 105 పరుగులకే ఆలౌటైంది. అయితే, మొత్తం మీద ఆసీస్‌తో జరిగిన టెస్టులను పరిగణలోకి తీసుకుంటే, 1947-48 సీజన్‌లో భాగంగా గబ్బా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 58 పరుగులకే ఆలౌటైంది.