క్రీడాభూమి

కోహ్లీ సేన ఓటమికి ఐదు కారణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, ఫిబ్రవరి 26: ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు ఓడడానికి కారణాలను విశే్లషకులు ఏకరువు పెడుతున్నారు. ఆస్ట్రేలియా గెలిచిందా లేక భారత్ ఓడిందా అన్న ప్రశ్నకు సమాధానం వెతకడంలో చాలా మంది నిమగ్నమయ్యారు. ఒకేలా వినిపిస్తున్నా, రెంటికీ తేడా ఉంది. ఆస్ట్రేలియా గెలవడమంటే, ఆ జట్టు ఆటగాళ్లు అన్ని విభాగాల్లోనూ నిజమైన ఆధిపత్యాన్ని కనబరచడం. భారత్ ఓడిందంటే, చేతులారా ఓటమిని కొనితెచ్చుకోవడం. ఓటమి అన్నది లేకుండా 19 టెస్టులను పూర్తి చేసి, పుణే మ్యాచ్‌లో హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగిన టీమిండియా ఏకంగా 333 పరుగుల భారీ తేడాతో ఎందుకు ఓడింది? మూడుమ్మడిగా విఫలమైన భారత క్రికెటర్లు పరాజయాన్ని ఆహ్వానించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, మ్యాచ్ తీరుతెన్నులను పరిశీలిస్తే టీమిండియా ఓడడానికి ఐదు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో మొదటిది టాస్. సాధారణంగా ప్రతి మ్యాచ్‌లోనూ పిచ్ ఒకటిరెండు రోజుల తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుంది. కానీ, పుణే స్టేడియంలో పిచ్ అందుకు భిన్నంగా కనిపించింది. వికెట్ పూర్తిగా ఎండిపోయింది. పగుళ్లు కూడా ఉన్నాయి. తేమ అన్నదే లేకపోవడంతో, ఆరంభం నుంచి చివరి వరకూ బౌలర్లకు స్వర్గ ధామంగా మారింది. మ్యాచ్ ఆరంభానికి ముందు రోజే టాస్ కీలమన్న అభిప్రాయం వ్యక్తమైంది. అదే నిజమని తేలింది. ఒకవేళ కోహ్లీ టాస్ గెలిచివుంటే, పరిస్థితి మరోలా ఉండేది. కానీ, టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ పిచ్‌పై పరుగులు రాబట్టడం కష్టమని పసిగట్టిన అతని నిర్ణయం సత్ఫలితాన్నిచ్చింది. కోహ్లీ బృందం ఓడడంలో టాస్ కూడా కీల పాత్ర పోషించింది.
ఈ అనూహ్య ఫలితానికి మరో కారణం కోహ్లీ ఫామ్. సుమారు రెండేళ్లుగా భారత జట్టు పూర్తిగా అతనిపైనే ఆధారపడిందన్నది వాస్తవం. అతను బ్యాటింగ్‌కు దిగిన ప్రతిసారీ భారీ స్కోర్లను అభిమానులు ఆశించడం ఆనవాయితీగా మారింది. నాలుగు సిరీస్‌ల్లో నాలుగు డబుల్ సెంచరీలు చేయడం కోహ్లీ ప్రతిభకు నిదర్శనం. అద్వితీయ ఫామ్‌లో ఉన్న ఆటగాడు ఒక్కసారిగా నీరసపడిపోయి, మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ కావడం టీమిండియాను దెబ్బతీసింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ అతను జట్టును ఆదుకోలేకపోయాడు. 13 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇప్పటి వరకూ నాలుగో ఇన్నింగ్స్‌లో కోహ్లీ సగటు 61 పరుగులు. ఆ స్థాయి బ్యాటింగ్ అనుకోకుండా పతనం కావడం మిగతా ఆటగాళ్లపైనా ప్రభావం చూపింది. ఇన్నాళ్లూ భారత్‌ను గెలిపించిన కోహ్లీ ఫామ్ ఇప్పుడు ఒక అడుగు వెనక్కు తగ్గడంతో ఓటమికి కారణమైంది.
ఫీల్డింగ్‌లో భారత్ ఎప్పుడూ వెనుకంజలోనే ఉంటుందనేది అందరికీ తెలిసిన నిజం. ఏక్‌నాథ్ సోల్కర్, మణీందర్ సింగ్, మహమ్మద్ అజరుద్దీన్ వంటి ఫీల్డర్లను అరుదుగా చూస్తాం. అసలే టీమిండియా ఫీల్డింగ్‌లో వీక్. దీనికి తోడు మహారాష్ట్ర క్రికెట్ సంఘం (ఎంసిఎ) మైదానంపై ఫీల్డర్లకు సరైన గ్రిప్ దొరకలేదు. ప్రత్యేకించి స్టంప్స్ సమీపంలో కాపుకాసిన వారు వేగంగా కదలడంలో విఫలమయ్యారు. పదేపదే క్యాచ్‌లు జార విడిచారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో సెంచరీతో కదంతొక్కిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ మూడుసార్లు ఇచ్చిన క్యాచ్‌లను భారత ఫీల్డర్లు విడిచిపెట్టారు. ఒక జట్టు ఓడడానికి ఇంతకంటే పెద్ద కారణం ఏం కావాలి.
స్టార్క్ అర్ధ శతకం కూడా భారత్ పరాజయంలో తన వంతు పాత్ర పోషించింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఒకానొక దశలో 196 పరుగులకే ఏడు వికెట్లు చేజార్చుకొని, తక్కువ స్కోరుకే పరిమితమయ్యే ప్రమాదంలో పడింది. అలాంటి పరిస్థితుల్లో స్టార్క్ 63 బంతులు ఎదుర్కొని 61 పరుగులు సాధించాడు. అత్యంత విలువైన ఆ అర్ధ శతకం ఆసీస్‌ను బలమైన స్థితిలో నిలబెట్టింది. చివరికి భారత్ ఓటమికి ఒక కారణమైంది.
పైన పేర్కొన్న కారణాలన్నీ ఒక ఎత్తయితే, స్టీవ్ ఒకీఫ్ విజృంభణ మరో ఎత్తు. అంతగా పేరులేని స్పిన్నర్ల చేతిలో భారత జట్టు దెబ్బతిన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈసారి ఆ పాత్రను ఒకీఫ్ పోషించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 35 పరుగులకు 6 వికెట్లు పడగొట్టిన అతను రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణించాడు. మరోసారి 35 పరుగులే ఇచ్చి, ఆరు వికెట్లు సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కూల్చిన స్పిన్నర్ నాథన్ లియాన్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి, భారత్ ఓటమిని, ఆసీస్ విజయాన్ని పరిపూర్ణం చేశాడు.

చిత్రం..భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ