క్రీడాభూమి

ఎవరిపైనా చర్యలు లేవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, మార్చి 9: బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో చోటు చేసుకున్న డిఆర్‌ఎస్ వివాదంలో ఎవరిపైనా చర్యలు తీసుకోవడం లేదని, అందుకు తగినంత బలమైన ఫిర్యాదులు కూడా తమకు అందలేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) స్పష్టం చేసింది. దీనితో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ వివాదానికి తెరపడినట్టే. ‘బుద్ధిక్షయం’ వివాదంగా మీడియా అభివర్ణించిన ఈ సంఘటనపై తదుపరి చర్యలకు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు పట్టుబట్టకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. బెంగళూరు టెస్టులో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు, భారత పేసర్ ఉమేష్ యాదవ్ వేసిన బంతి స్మిత్ ప్యాడ్స్‌కు తగిలింది. అతను వికెట్లకు అడ్డంగా దొరికిపోయాడంటూ ఉమేష్ ఎల్‌బికి అప్పీల్ చేయగా, అంపైర్ సానుకూలంగా స్పందించడం వివాదానికి దారి తీసింది. అంపైర్ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత కూడా స్మిత్ మైదానాన్ని వీడలేదు. నింపాదిగా నడుచుకుంటూ, నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న పీటర్ హ్యాండ్స్‌కోమ్ వద్దకు వెళ్లి, అతనితో మంతనాలు జరిపాడు. అంతేగాక, కోచ్, మేనేజర్ తదితర సపోర్టింగ్ స్ట్ఫా సూచనల కోసం డ్రెస్సింగ్ రూమ్‌వైపు చూస్తూ కాలక్షేపం చేశాడు. అక్కడి నుంచి సరైన సూచన రాకపోవడంతో, గత్యంతరం లేని పరిస్థితుల్లో పెవిలియన్ దారిపట్టాడు. కాగా, స్మిత్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడని, క్రీడాస్ఫూర్తిని దారుణంగా దెబ్బతీశాడని కోహ్లీ ఆరోపించాడు. డిఆర్‌ఎస్ నిర్ణయాన్ని డ్రెస్సింగ్ రూమ్ అంశంగా మార్చేశాడని మండిపడ్డాడు. తాను చేసింది పొరపాటేనని స్మిత్ చేసిన ప్రకటనను కోహ్లీ పట్టించుకోలేదు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రెండుమూడు పర్యాయాలు డ్రెస్సింగ్ రూమ్‌వైపు చూసిన స్మిత్ ఆతర్వాత డిఆర్‌ఎస్ అప్పీల్స్ సమయంలోనూ సపోర్టింగ్ స్ట్ఫా సూచనల కోసం ఎదురుచూశాడని, ఇది నిబంధనలను కాలరాయడమేనని విమర్శించాడు. ఇలావుంటే, కోహ్లీకి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ), స్మిత్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) అండగా నిలిచాయి. డిఆర్‌ఎస్ అప్పీల్ చేయకుండా మైదానంలో నిలబడడం తన తప్పేనని, ఆ సమయంలో తనకు ఏమీ తోచలేదని స్టీవెన్ స్మిత్ చేసిన వ్యాఖ్యలో తప్పేమీ లేదని సిఎ పేర్కొంది. ‘బుద్ధిక్షయం’ వివాదంగా మీడియా అభివర్ణించిన ఈ వివాదానికి ఏమాత్రం ప్రాధాన్యత లేదని స్పష్టం చేసింది. మొత్తం మీద స్మిత్‌కు సిఎ మద్దతు ప్రకటిస్తే, కోహ్లీ చేసిన ఆరోపణలను బిసిసిఐ సమర్థించింది. అంతేగాక, స్మిత్‌పై చర్య తీసుకోవాల్సిందిగా ఐసిసి మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.
అధికారులతో ఐసిసి చర్చలు
బిసిసిఐ, సిఎ బహిరంగ ప్రకటనలతో యుద్ధానికి కాలుదువ్వడంతో ఐసిసి తక్షణమే స్పందించింది. మ్యాచ్ రిఫరీకి బిసిసిఐ చేసిన ఫిర్యాదు కూడా జత కలవడంతో, పరిస్థితిని గమనించిన ఐసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్‌సన్ రంగంలోకి దిగినట్టు సమాచారం. బిసిసిఐ, సిఎ అధికారులతో చర్చించి, వివాదం మరింత ముదరకుండా జాగ్రత్తపడ్డాడని తెలుస్తున్నది. బెంగళూరులో ఒక అద్భుతమైన మ్యాచ్‌ని చూసే అవకాశం అందరికీ లభించిందని, రెండు జట్లు సర్వశక్తులు ఒడ్డి ఆడాయని రిచర్డ్‌సన్ తన ప్రకటనలో పేర్కొన్నాడు. అదే ఉత్సాహాన్ని రాంచీలో జరిగే మూడో టెస్టులోనూ ఇరు జట్లు కొనసాగిస్తాంచాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. ఈ సంఘటనలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదన్న నిర్ణయానికి ఐసిసి వచ్చిందని ప్రకటించాడు. మూడో టెస్టుపై దృష్టి కేంద్రీకరించాల్సిందిగా జరు జట్లను కోరడం ద్వారా, ఈ వివాదానికి తెరపడిందని అతను చెప్పకనే చెప్పాడు.
డిఆర్‌ఎస్ గురించి తెలుసుకున్నా..
అంపైర్ డిసిషన్ రివ్యూ సిస్టం (డిఆర్‌ఎస్) గురించి ఇప్పుడు తాను చాలా తెలుసుకున్నానని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ పీటర్ హ్యాండ్స్‌కోమ్ అన్నాడు. సపోర్టింగ్ స్ట్ఫా అభిప్రాయాన్ని తెలుసుకోవాలని తానే తమ కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌కు సూచించానని హ్యాండ్స్‌కోమ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. డిఆర్‌ఎస్ నిబంధనలపై తనకు సరైన అవగాహన లేనందుకే డ్రెస్సింగ్ రూమ్ నుంచి సూచన తీసుకోవాల్సిందిగా స్మిత్‌కు సూచించానని, దీనిపై వివాదం రేగిన తర్వాత నిబంధనల గురించి పూర్తిగా తెలుసుకున్నానని ఒక ఇంటర్వ్యూలో హ్యాండ్స్‌కోమ్ అన్నాడు. ఎల్‌బి అప్పీల్‌పై సపోర్టింగ్ స్ట్ఫా, సహచర ఆటగాళ్లు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకోవడం నిబంధనలకు విరుద్ధమని తనకు ఇప్పుడు బాగా అర్థమైందని తెలిపాడు. ఇకపై పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతానని అన్నాడు.

చిత్రం..తప్పించుకున్నట్టేనా?
ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్