క్రీడాభూమి

సమాధానంలేని ప్రశ్నలెన్నో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, మార్చి 12: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడని, క్రీడాస్ఫూర్తిని మంటగలిపాడని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన ఆరోపణలు ఉద్రిక్తతలకు దారితీసినప్పటికీ, ఇరు దేశాల క్రికెట్ బోర్డుల అధికారులు సమావేశమై చర్చించడంతో తాత్కాలికంగా ముగిసింది. కోహ్లీ, స్మిత్‌సహా ఎవరిపైనా చర్యలు తీసుకోవడం లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించడం, స్మిత్‌పై చేసిన ఫిర్యాదును భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఉపసంహరించుకోవడం వంటి అంశాలు ఈ వివాదానికి తెరపడినట్టేనన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. కానీ, బెంగళూరు టెస్టులో చోటు చేసుకున్న ఈ సంఘటనపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ ఇంకా కొనసాగుతునే ఉంది. ఈ మొత్తం వివాదంలో సమాధానంలేని ప్రశ్నలు కోకొల్లలుగా ఉన్నాయి. సంఘటన వివరాల్లోకి వెళితే, స్మిత్ మెదడు మొద్దుబారుతున్నదని, అందుకే, నిబంధనలకు విరుద్ధంగా అతను డిఆర్‌ఎస్ అప్పీల్స్ సమయంలోనూ డ్రెస్సింగ్ రూమ్‌వైపు చూస్తూ, సపోర్టింగ్ స్ట్ఫా సూచనల కోసం ఎదురుచూశాడని కోహ్లీ విమర్శలు చేయడంతో వివాదం తెరపైకి వచ్చింది. డిఆర్‌ఎస్ అప్పీల్ చేయకుండా మైదానంలో నిలబడడం ద్వారా తాను తప్పు చేశానని, నిజానికి ఆ సమయంలో తనకు ఏమీ తోచలేదని స్మిత్ వ్యాఖ్యానించడంతో దీనికి ‘బుద్ధిక్షయం’ వివాదమన్న ముద్రపడింది. ఆ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఉమేష్ యాదవ్ వేసిన బంతి అతని ప్యాడ్స్‌కు తగిలింది. ఒకవేళ స్మిత్ వికెట్లకు అడ్డంగా లేకపోతే, బంతి నేరుగా స్టంప్స్‌ను పడగొట్టి ఉండేదన్న అభిప్రాయంతో ఉమేష్ ఎల్‌బి అప్పీల్ చేయగా, అంపైర్ దానికి సానుకూలంగా స్పందించాడు. కానీ, ఈ అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న రీతిలో స్మిత్ మైదానాన్ని వీడలేదు. మెల్లిగా నడుచుకుంటూ నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న పీటర్ హ్యాండ్స్‌కోమ్ వద్దకు వెళ్లాడు. ఒకవైపు అతనితో మాట్లాడుతూనే మరోవైపు సపోర్టింగ్ స్ట్ఫా సూచనల కోసం డ్రెస్సింగ్ రూమ్‌వైపు చూశాడు. అక్కడి నుంచి సూచనలేవీ రాకపోవడంతో, డిఆర్‌ఎస్ అప్పీల్ చేయకుండానే పెవిలియన్‌కు వెశ్లాడు. కాగా, ఈ సంఘటనపై కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. డిఆర్‌ఎస్‌ను డ్రెస్సింగ్ రూమ్‌కు చేర్చాడంటూ మండిపడ్డాడు. మైదానంలో ఉన్న ఆటగాడు సలహాలు, సూచనల కోసం డ్రెస్సింగ్ రూమ్‌వైపు చూడకూడదన్న నిబంధనను అతను గుర్తుచేశాడు. డిఆర్‌ఎస్‌కు అప్పీల్ చేసే సమయంలో దీనిని మరింత ఖచ్చితంగా పాటించాల్సి ఉండగా, స్మిత్ ఆ విషయానే్న పట్టించుకోలేదని అన్నాడు. పొరపాటు జరిగిందని స్మిత్ అంగీకరించినప్పటికీ, అతనిపై చర్యకు కోహ్లీ డిమాండ్ చేశాడు. దీనితో బిసిసిఐ రంగంలోకి దిగింది. స్మిత్‌పై ఐసిసి మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్‌కు లిఖఇతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనకు తానే బాధ్యుడినని, డిఆర్‌ఎస్‌కు వెళ్లాలో లేదో సపోర్టింగ్ స్ట్ఫా నుంచి తెలుసుకోవాల్సిందిగా తానే స్మిత్‌కు సూచించానని హ్యాండ్స్‌కోమ్ ట్వీట్ చేసి, మొత్తం బాధ్యతను తన నెత్తిన వేసుకున్నాడు.
ఆసీస్ ఎదురుదాడి
పొరపాటు జరిగినట్టు స్మిత్, హ్యాండ్స్‌కోమ్ అంగీకరించినా, కోచ్ డారెన్ లీమన్‌సహా క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) అధికారులు ఎదురుదాడికి దిగారు. అంపైర్ నిర్ణయాలను సవాలు చేసే డిఆర్‌ఎస్ అప్పీల్స్‌కు వెళ్లే ప్రతిసారీ డ్రెస్సింగ్ రూమ్‌వైపు చూస్తున్నారని కోహ్లీ చేసిన ఆరోపణలను లీమన్ ఖండించాడు. కోహ్లీ మాటల్లో ఏమాత్రం నిజం లేదని అన్నాడు. మరికొంత మంది సిఎ అధికారులు ఆత్మరక్షణ కోసం టీమిండియాపై ప్రతివిమర్శలకు దిగారు. ఆస్ట్రేలియా మీడియా కూడా వివాదం చల్లారకుండా ఆజ్యం పోస్తూనే ఉంది. మొత్తం మీద భారత్, ఆసీస్ క్రికెట్ బోర్డులు బహిరంగ విమర్శలకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే, బిసిసిఐ వ్యవహారాలను పరిశీలించడానికి సుప్రీం కోర్టు ఇటీవల నియమించిన పాలక కమిటీ (సిఒఎ) జోక్యం చేసుకున్నట్టు సమాచారం. సిఒఎ సూచించిందో లేక బోర్డు అధికారులే నిర్ణయించుకున్నారో తెలియదుగానీ, సిఎతో రాజీకి వచ్చింది. సిఎ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్‌సదర్లాండ్, బిసిసిఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ జోహ్రి బెంగళూరులో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. స్మిత్‌పై ఫిర్యాదును బిసిసిఐ ఉపసంహరించుకోగా, ఈ వివాదం ముగిసిందని సిఎ ప్రకటించింది. ఎవరిపైనా చర్యలు తీసుకోవడం లేదని ఐసిసి స్పష్టం చేసింది. ఈ పరిణామాలను గమనిస్తే డిఆర్‌ఎస్ వివాదాన్ని ఇరు జట్ల ఆటగాళ్లు మరచిపోయి, మిగతా రెండు టెస్టుల్లో ఏమీ జరగనట్టే ఆడతారని అనుకోవాలి. కానీ, ఇది సాధ్యమా? కోహ్లీ దూకుడును తగ్గించుకుంటాడా? స్లెడ్జింగ్‌కు పాల్పడకుండా ఆస్ట్రేలియా క్రికెటర్లు సంయమనం పాటిస్తారా? క్రీడాస్ఫూర్తికి విఘాతం కలిగించిందన్న వివాదంపై సరైన విచారణ జరపకుండానే చర్యలు ఉండవని ప్రకటించిన ఐసిసిపై వివిధ దేశాలకు చెందిన ప్రస్తుత, మాజీ క్రికెటర్లు, అధికారులు విమర్శలు చేయకుండా ఉంటారా? తప్పు నీదంటే నీదంటూ దుమ్మెత్తి పోసుకున్న భారత, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు హఠాత్తుగా ఎందుకు రాజీకొచ్చాయి? ఫిర్యాదును ఉపసంహరించుకున్నట్టు బిసిసిఐ ప్రకటించిన కొన్ని క్షణాల్లోనే ఎవరిపైనా చర్యలు ఉండవని ఐసిసి ఏ ప్రాతిపదికన ప్రకటించింది? విచారణ జరపకుండానే, సరైన ఆధారాల్లేవంటూ ఎలా నిర్ధారణకు వచ్చింది? ఈ ప్రశ్నలపై స్పష్టత రాకుంటే, డిఆర్‌ఎస్ వివాదం ముగిసిందని అనుకోవడానికి వీల్లేదు. రాంచీ, ధర్మశాల వేదికలుగా జరిగే చివరి రెండు టెస్టులు ఉద్రిక్తతలకు తావులేకుండా ప్రశాంతంగా ముగిసే అవకాశాలు కూడా లేవు.

చిత్రం..టీమిండియా కోచ్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీ