క్రీడాభూమి

ఐసిసి చైర్మన్ పదవికి మనోహర్ రాజీనామా ... బిసిసిఐతో విభేదాలే కారణం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఐసిసి చైర్మన్‌గా రెండేళ్ల కాలానికి నేను పోటీ లేకుండా గత ఏడాది ఎన్నికయ్యాను. సంస్థను పారదర్శకంగా ఉంచడానికి, పాలనా వ్యవహారాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించాను. పాలక మండలి సభ్యుల సహాయ సహకారాలతో నేను విధులను నిర్వర్తించాను. కానీ, వ్యక్తిగత కారణాల వల్ల నేను ఆగస్టులో జరిగే ఐసిసి వార్షిక సమావేశానికి అధ్యక్షత వహించలేను. అందుకే, నా పదవికి ఈ క్షణమే రాజీనామా చేస్తున్నాను. నాకు ఇన్నాళ్లూ సహకరించిన ఐసిసి అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ఐసిసి అత్యుత్తమ సంస్థగా కొనసాగాలని కోరుకుంటున్నాను’.
- శశాంక్ మనోహర్

న్యూఢిల్లీ, మార్చి 15: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) అధ్యక్ష పదవికి శశాంక్ మనోహర్ రాజీనామా చేశాడు. అతను స్పష్టమైన కారణాలను పేర్కోకపోయినప్పటికీ, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)తో కొనసాగుతున్న విభేదాలే ఇందుకు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. బిసిసిఐ అధ్యక్షుడిగా ఉన్న అతను నిరుడు మే 10న రాజీనామా చేసి, ఆతర్వాత ఐసిసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. కానీ, బాధ్యతలు చేపట్టిన ఎనిమిది నెలల్లోనే రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఇటీవలే పలు సంస్కరణలను ప్రవేశపెట్టిన అతను భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులతో కూడిన ‘బిగ్ త్రీ’ దేశాలకు ఉన్న ప్రత్యేక ఆర్థిక హక్కులు, భారీ వాటాలపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశాడు. దీనితోపాటు క్రికెట్ పాలనా వ్యవహారాలను మరింత పారదర్శకంగా ఉంచేందుకు కసరత్తు ప్రారంభించాడు. ఐసిసి తదుపరి సమావేశంలో ఈ సంస్కరణలపై ఓటింగ్ జరగనుంది. అయితే, ‘బిగ్ త్రీ’కి భారీ వాటా రాకుండా అడ్డుకుంటున్న మనోహర్ చర్యలను బిసిసిఐ వ్యతిరేకిస్తున్నది. ఇప్పటికే టెస్టు హోదాగల బంగ్లాదేశ్, శ్రీలంక, జింబాబ్వే క్రికెట్ బోర్డుల మద్దతును కూడగట్టుకుంది. ఐసిసి సమావేశంలో మనోహర్ సంస్కరణలకు ఆమోద ముద్ర పడాలంటే, మూడింట రెండు వంతుల మంది అనుకూలంగా ఓటు వేయాలి. పది దేశాలకు టెస్టు హోదా ఉంటే, వాటిలో నాలుగు తీర్మానాలకు వ్యతిరేకంగా ఓటు వేస్తే, సంస్కరణల ప్రయత్నం బెడిసికొడుతుంది. ఓటింగ్‌కు వెళ్లి, అక్కడ చావుదెబ్బ తినేకంటే, ముందుగానే వైదొలగడం మంచిదని భావించిన మనోహర్ రాజీనామా చేశాడన్న వాదన బలంగా వినిపిస్తున్నది. ఫిబ్రవరిలో జరిగిన పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సెప్టెంబర్‌లో జరగబోయే సర్వసభ్య సమావేశంలో ఆమోదం లభించదేమోనన్న భయం మనోహర్‌ను వెంటాడుతున్నదని అతని సన్నిహిత వర్గాల భోగట్టా.
బిసిసిఐ ఆగ్రహం!
మనోహర్ తీరుపై బిసిసిఐ తీవ్ర ఆగ్రహంతో ఉంది. భారతీయుడైనప్పటికీ భారత ప్రయోజనాలను అడ్డుకుంటున్నాడని రగిలిపోతున్నది. ‘బిగ్ త్రీ’ దేశాల ఆజమాయిషీ ఇకపై కొనసాగదని, వీటి నుంచి ఐసిసికి స్వేచ్ఛ లభిస్తుందని పాలక మండలి సమావేశంలో మనోవహర్ చేసిన వ్యాఖ్యలు కూడా బిసిసిఐ ఆగ్రహానికి కారణమయ్యాయి. ఐసిసిలో మొత్తం 106 దేశాలుండగా, కేవలం పది క్రికెట్ బోర్డులకే శాశ్వత సభ్యత్వం ఉంది. కాగా, ఐసిసి ఆదాయంలో సుమారు 80 శాతం కేవలం మూడు దేశాల నుంచే సమకూరుతున్నది. ఇందులో బిసిసిఐది అగ్రస్థానంకాగా, క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ), ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి)లది రెండో స్థానం. అందుకే, అదే దామాషాలో పంపకాలు జరగాలని పట్టుబట్టిన ఈ మూడు ‘బిగ్ త్రీ’ దేశాలు, దతాబ్దాల తరబడి ప్రయత్నించిన తర్వాత, 2014లో అనుకున్నది సాధించాయి. ఇంత కష్టపడి సంపాదించుకున్న హక్కును సంస్కరణల పేరుతో రద్దు చేయడానికి మనోహర్ పూనుకోవడాన్ని బిసిసిఐ జీర్ణించుకోలేకపోతున్నది. అందుకే, వార్షిక సర్వసభ్య సమావేశంలో అతని ప్రతిపాదనలను అడ్డుకోవాలని, అవి వీగిపోయేలా చూడాలని నిర్ణయించుకుంది. కాగా, మొండిపట్టుతో ముందుకెళితే, చేదు అనుభవం తప్పదన్న ఉద్దేశంతో మనోహర్ రాజీనామా చేశాడని అంటున్నారు.
కీలక నిర్ణయాలు
ఐసిసి పాలక మండలి సమావేశంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిలో ఐసిసి ఆదాయం, వాటాల పంపిణీ అంశాలు అత్యంత కీలకంగా మారాయి. క్రికెట్ బోర్డులకు అందే మొత్తాల్లో భారీ వ్యత్యాసం ఉండకూడదని ఐసిసి పాలక మండలి తీర్మానించింది. ఇంత వరకూ ఉన్న అఫిలియేట్ సభ్యత్వాలను రద్దు చేయాలన్న ప్రతిపాదనపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. అంతేగాక, క్రికెట్‌ను అన్ని దేశాలకు చేరువ చేసేందుకు వీలుగా ఐసిసిలో సభత్వానికి ఉండాల్సిన అర్హతలను నిర్ణయించడానికి ఒక కమిటీని నియమించాలని ప్రతిపాదించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా, మండలిలో ఒక మహిళా డైరెక్టర్‌ను తీసుకోవాలని కూడా సూచించింది. పది దేశాలకు మాత్రమే పూర్తిస్థాయి సభ్యత్వం, టెస్టు హోదా ఉండడంతో, మిగతా దేశాల్లో క్రికెట్ ప్రత్యేకించి టెస్టు ఫార్మాట్ ఎదగడం లేదని అభిప్రాయపడింది. కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమైన క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేయాలంటే, ముందుగా పూర్తిస్థాయి హోదాను శాశ్వతంగా ఇచ్చే విధానానికి స్వస్తి పలకాలన్న నిర్ణయానికి వచ్చింది. జింబాబ్వే లాంటి జట్టుకు టెస్టు హోదా ఉండగా, మేటి జట్లకు సైతం గట్టిపోటీనిస్తున్న ఐర్లాండ్, అఫ్గానిస్థాన్ తదితర జట్లకు అర్హతను కల్పించకపోవడం దుర్మార్గమని వ్యాఖ్యానించిన మనోహర్ ఈ విధానానికి తెరదించాల్సిన అవసరం ఉందని పాలక మండలి సమావేశంలో వాదించాడు. అతని సూచనల మేరకే, ర్యాంకింగ్స్‌ను బట్టి టెస్టు హోదాను ఎప్పటికప్పుడు మార్చాల్సిన అవసరం ఉందని ఆ సమావేశం తీర్మానించింది. ర్యాంకింగ్స్‌లో మొదటి ఏడు స్థానాల్లో ఉన్న జట్లను పక్కకుపెట్టి, మిగతా మూడు జట్లతోపాటు స్కాట్‌లాండ్, అఫ్గానిస్థాన్, ఐర్లాండ్ తదితర జట్ల మధ్య అర్హతా పోటీలను నిర్వహించాలని నిర్ణయించింది. ఆ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లకు టెస్టు హోదా లభించేలా నిబంధనావళిని సవరించాలన్న నిర్ణయానికి వచ్చింది.
తొమ్మిది జట్లతో కూడిన టెస్టు లీగ్‌ను, 2023 నుంచి ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్‌లో పాల్గొనే అర్హతను సంపాదించేందుకు మొత్తం 13 జట్ల మధ్య టోర్నీని నిర్వహించాలని ఐసిసి పాలక మండలి నిర్ణయించింది. డిఆర్‌ఎస్‌ను ఇకపై అన్ని దేశాలు ఒకే విధంగా అమలు చేయాలని, పిచ్‌ల తీరుతెన్నుల బాధ్యతను ఆయా దేశాల క్రికెట్ బోర్డులే స్వీకరించాలని, మైదానంలో ఆటగాళ్లు క్రమశిక్షణతో మెలిగేలా అన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. దీనికి అవసరమైతే నిబంధనావళిలో మార్పులు తీసుకురావాలని ప్రతిపాదించింది. క్రికెటర్లకు మెరిట్ పాయింట్లను కేటాయించాలని కూడా నిర్ణయించింది. వీటి ఆధారంగానే ఆయా ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని, ఐదేళ్ల కాలానికి డీమెరిట్ పాయింట్లను లెక్కకట్టి, క్రమశిక్షణ లేని ఆటగాళ్లపై కనీసం 12 నెలల నిషేధాన్ని విధించే విధంగా నిబంధనలను సవరించాలని తీర్మానించింది.
వేచిచూస్తున్న సిఎ, ఇసిబి
మిగతా ప్రతిపాదనలను సిఎ, ఇసిబి పెద్దగా వ్యతిరేకించడం లేదు. అయితే, ‘బిగ్ త్రీ’ దేశాలకు వాటాల్లో ఎక్కువ భాగం ఇవ్వకుండా అడ్డుకుంటునే ప్రతిపాదపై కొంత అసంతృప్తితో ఉంది. బిసిసిఐ ఈ ప్రతిపాదనను బహిరంగగానే వ్యతిరేకించింది. జింబాబ్వే, లంక, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులను తన శిబిరంలోకి తెచ్చుకుంది. సిఎ, ఇసిబి ఇంత వరకూ బిసిసిఐకు బహిరంగంగా మద్దతు తెలపలేదు. పరిస్థితిని నిశితంగా గనమిస్తున్న ఈ రెండు క్రికెట్ బోర్డులు వేచిచూసే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. కానీ, ఓటింగ్ అంటూ జరిగితే, తమ దేశాల నుంచి వెళ్లే ఆదాయానికి సరైన దామాషాలో పంపకం ఉండాలన్న డిమాండ్‌కే ఈ రెండు క్రికెట్ బోర్డులు కట్టుబడే అవకాశం ఉంది. భారత్ వ్యూహం ఇప్పటికే స్పష్టంకాగా, బంగ్లాదేశ్, శ్రీలంక, జింబాబ్వే క్రికెట్ బోర్డులు కూడా ఐసిసి ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నాయి. పది శాశ్వత సభ్య దేశాల్లో నాలుగు దేశాలు వ్యతిరేకిస్తే, కీలక ప్రతిపాదలకు ఆమోద ముద్ర లభించదు. ఈ నాలుగు దేశాలకు సిఎ, ఇసిబి మద్దతు కూడా ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఐసిసిలో విప్లవాత్మక మార్పులకు ప్రయత్నించి, విఫలమయ్యేకంటే, వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందే పదవి నుంచి వైదొలడమే శ్రేయస్కరమన్న నిర్ణయానికి మనోహర్ వచ్చాడని తెలుస్తున్నది. ఈ కారణంగా అతను రాజీనామా చేశాడని అంటున్నారు. కానీ, రాజీనామాకు గల కారణలపై ఇంత వరకూ స్పష్టత రాలేదు.