క్రీడాభూమి

ఓపెనర్ల విజృంభణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 18: విజయ్ హజారే క్రికెట్ టోర్నమెంట్‌లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని జార్ఖండ్‌పై బెంగాల్ 41 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ చేరింది. ధోనీ బృందం బస చేసిన హోటల్‌లో అగ్ని ప్రమాదం సంభవించడంతో, శుక్రవారం జరిగిన ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ శనివారానికి వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్ 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 329 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు శ్రీవత్స గోస్వామి, అభిమన్యు ఈశ్వరన్ శతకాలు చేయడంతో, ఆ జట్టుకు భారీ స్కోరు సాధ్యమైంది. మొదటి వికెట్‌కు 198 పరుగు జోడించిన తర్వాత మోను కుమార్ బౌలింగ్‌లో కుమార్ దేబ్రాత్ సింగ్ క్యాచ్ పట్టగా అవుటైన గోస్వామి 99 బంతులు ఎదుర్కొని, 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 101 పరుగులు చేశాడు. ఈశ్వరన్ 121 బంతులు ఎదుర్కొని, 7 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో సరిగ్గా 101 పరుగులే చేసి రనౌట్ అయ్యాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ మనోజ్ తివారీ 75 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, అగ్నివ్ పన్ (19), సుదీప్ చటర్జీ (19) తక్కువ స్కోర్లకే అవుటయ్యాడు. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి తివారీతోపాటు అనుస్తుప్ మజుందార్ (1) క్రీజ్‌లో ఉన్నాడు. జార్ఖండ్ బౌలర్లలో వరుణ్ ఆరోన్ ఒక్కడే కొంత మెరుగ్గా బౌలింగ్ చేసి రెండు వికెట్లు పడగొట్టాడు.
ప్రజ్ఞాన్ ఓఝా పంజా
విజయం సాధించి, ఫైనల్‌లో చోటు సంపాదించడానికి భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సిన జార్ఖండ్‌ను ప్రజ్ఞాన్ ఓఝా దారుణంగా దెబ్బతీశాడు. కెప్టెన్ ధోనీ 62 బంతుల్లోనే 70 పరుగులు చేసినప్పటికీ, తన జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. అతనితోపాటు సౌరభ్ తివారీ (48), ఇశాంక్ జగ్గీ (59) కూడా కొంత సేపు బెంగాల్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు శ్రమించారు. మిగతా వారు విఫలం కావడంతో ఆ జట్టు 50 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌటైంది. ఓఝా 71 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టాడు. కనిష్క్ సేథ్, సాయన్ ఘోష్ చెరి రెండు వికెట్లు కూల్చారు.
ఫైనల్‌లో టైటిల్ కోసం తమిళనాడుతో బెంగాల్ తలపడుతుంది. ఇంతకు ముందు జరిగిన మొదటి సెమీ ఫైనల్‌లో తమిళనాడు ఆరు వికెట్ల తేడాతో బరోడాను ఓడించింది. బరోడా 49.3 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌట్‌కాగా, తమిళనాడు 47.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన విషయం తెలిసిందే.

చిత్రాలు..శ్రీవత్స గోస్వామి, అభిమన్యు ఈశ్వరన్