క్రీడాభూమి

పుజారా డబుల్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, మార్చి 19: ఫస్ట్‌డౌన్ ఆటగాడు చటేశ్వర్ పుజారా డబుల్ సెంచరీ పూర్తిచేయగా, వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా శతకాన్ని నమోదు చేయడంతో, ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌ను తొమ్మిది వికెట్లకు 603 పరుగుల భారీ స్కోరువద్ద భారత్ డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. భారత్ కంటే ఈ జట్టు ఇంకా 129 పరుగులు వెనుకంజలో ఉండగా, ఎనిమిది వికెట్లు చేతిలో ఉన్నాయి. ఆరు వికెట్లకు 360 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను కొనసాగించిన భారత్ 527 పరుగుల స్కోరువద్ద పుజరా వికెట్‌ను కోల్పోయింది. ఏడో వికెట్‌కు సాహాతో కలిసి 199 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన పుజారా తన మారథాన్ ఇన్నింగ్స్‌లో 525 బంతులు ఎదుర్కొని, 21 ఫోర్లతో 202 పరుగులు సాధించి, నాథన్ లియాన్ బౌలింగ్‌లో గ్లేన్ మాక్స్‌వెల్ క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. తర్వాత కొద్ది సేపటిలో సాహా వికెట్ కూడా కూలింది. కెరీర్‌లో మూడో శతకాన్ని నమోదు చేసిన అతను 233 బంతులు ఎదుర్కొని, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 117 పరుగులు చేసి, స్టీవ్ ఒకీఫ్ బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌కు చిక్కాడు. చివరిలో రవీంద్ర జడేజా వేగంగా పరుగులు రాబట్టాడు. 55 బంతుల్లో అజేయంగా 54 పరుగులు చేసిన అతని స్కోరులో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఉమేష్ యాదవ్ 16 పరుగులకు ఒకీఫ్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్‌కు క్యాచ్ అందించి వెనుదిరిగాడు. మొత్తం 210 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 603 పరుగులు సాధించిన దశలో తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్టు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రకటించాడు. అప్పటికి జడేజాతోపాటు ఇశాంత్ శర్మ (0) క్రీజ్‌లో ఉన్నాడు. ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్‌కు నాలుగు వికెట్లు లభించగా, స్టీవ్ ఒకీఫ్ మూడు వికెట్లు పడగొట్టాడు.
మొదటి ఇన్నింగ్స్‌లో 199 పరుగులు వెనుకబడిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ దారుణంగా మొదలైంది. జట్టు స్కోరు 17 పరుగుల వద్ద ఓపెనర్ డేవిడ్ వార్నర్ (14)ను రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన నాథన్ లియాన్ (2)ను కూడా అదే రీతిలో అవుట్ చేశాడు. ఈ వికెట్ కూలిన వెంటనే నాలుగో రోజు ఆట ముగిసినట్టు అంపైర్లు ప్రకటించారు. అప్పటికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 7.2 ఓవర్లలో రెండు వికెట్లకు 23 పరుగులు చేయగా, మాట్ రెన్‌షా ఏడు పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు.

స్కోరుబోర్డు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 137.3 ఓవర్లలో 451 ఆలౌట్ (మాట్ రెన్‌షా 44, స్టీవెన్ స్మిత్ 178 నాటౌట్, గ్లేన్ మాక్స్‌వెల్ 104, ఉమేష్ యాదవ్ 3/106, రవీంద్ర జడేజా 5/124).
భారత్ తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 8 వికెట్లకు 360): లోకేష్ రాహుల్ సి మాథ్యూ వేడ్ బి పాట్ కమిన్స్ 67, మురళీ విజయ్ స్టంప్డ్ మాథ్యూ వేడ్ బి స్టీవ్ ఒకీఫ్ 82, చటేశ్వర్ పుజారా సి మాక్స్‌వెల్ బి నాథన్ లియాన్ 202, విరాట్ కోహ్లీ సి స్టీవెన్ స్మిత్ బి పాట్ కమిన్స్ 6, ఆజింక్య రహానే సి మాథ్యూ వేడ్ బి పాట్ కమిన్స్ 14, కరుణ్ నాయర్ బి జొస్ హాజెల్‌వుడ్ 23, రవిచంద్రన్ అశ్విన్ సి మాథ్యూ వేడ్ బి పాట్ కమిన్స్ 3, వృద్ధిమాన్ సాహా సి మాక్స్‌వెల్ బి స్టీవ్ ఒకీఫ్ 117, రవీంద్ర జడేజా 54 నాటౌట్, ఉమేష్ యాదవ్ సి డేవిడ్ వార్నర్ బి స్టీవ్ ఒకీఫ్ 16, ఇశాంత్ శర్మ 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 19, మొత్తం (210 ఓవర్లలో 9 వికెట్లకు) 603 డిక్లేర్డ్.
వికెట్ల పతనం: 1-91, 2-193, 3-225, 4-276, 5-320, 6-328, 7-527, 8-541, 9-596.
బౌలింగ్: జొష్ హాజెల్‌వుడ్ 44-10-103-1, పాట్ కమిన్స్ 39-10-106-4, స్టీవ్ ఒకీఫ్ 77-17-199-3, నాథన్ లియాన్ 46-2-163-1, గ్లేన్ మాక్స్‌వెల్ 4-0-13-0.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ బి రవీంద్ర జడేజా 14, మాట్ రెన్‌షా 7 నాటౌట్, నాథన్ లియాన్ బి రవీంద్ర జడేజా 2, ఎక్‌స్ట్రాలు 0, మొత్తం (7.2 ఓవర్లలో 2 వికెట్లకు) 23.
వికెట్ల పతనం: 1-17, 2-23.
బౌలింగ్: అశ్విన్ 4-0-17-0, రవీంద్ర జడేజా 3.2-1-6-2.

* మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు డబుల్ సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మెన్‌లో పుజారా ఆరోవాడు. ఈ జాబితాలో వీరేందర్ సెవాగ్, సచిన్ తెండూల్కర్ చెరి ఆరు డబుల్ సెంచరీలతో నంబర్ వన్ స్థానంలో ఉన్నారు. రాహుల్ ద్రవిడ్ ఐదు పర్యాయాలు డబుల్ సెంచరీ చేశాడు. విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ చెరి నాలుగు సార్లు ఈ ఫీట్‌ను ప్రదర్శించారు. పుజారా మూడోసారి డబుల్ సెంచరీతో రాణించాడు. కాగా, టెస్టు చరిత్రలో సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ 12 డబుల్ సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. కుమార సంగక్కర 11, బ్రియాన్ లారా 9 డబుల్ సెంచరీలతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన పుజారా 525 బంతులు ఎదుర్కొన్నాడు. భారత్ తరఫున ఒక ఇన్నింగ్స్‌లో ఎక్కువ బంతులు ఆడిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రాహుల్ ద్రవిడ్‌ను రెండో స్థానానికి నెట్టేసి, తాను అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. ద్రవిడ్ 2004లో రావల్పిండిలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో 495 బంతులు ఆడాడు. నవ్‌జోత్ సింగ్ 1997లో వెస్టిండీస్‌పై 491 బంతులు ఆడి, ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. కాగా, భారత్‌లో జరిగిన టెస్టుల్లో ఎక్కువ బంతులు ఎదుర్కొన్న ఆటగాళ్లలోనూ పుజారా అగ్రస్థానంలో, వివిఎస్ లక్ష్మణ్ (452 బంతులు), వినోద్ కాంబ్లి (411 బంతులు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

భారత బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా కెరీర్‌లో మూడో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఆస్ట్రేలియాపై అతను ఈ ఫీట్ సాధించడం ఇది రెండోసారి. సచిన్ తెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్ కూడా ఆసీస్‌పై చెరి రెండుసార్లు డబుల్ సెంచరీ చేసి, భారత్ తరపున నెలకొల్పిన రికార్డును పుజారా సమం చేశాడు. మొత్తం మీద ఆసీస్‌పై ఎక్కువసార్లు డబుల్ సెంచరీ చేసిన ఆటగాళ్లలో అతనికి మూడో స్థానం దక్కింది.

చిత్రాలు.. చటేశ్వర్ పుజారా , వృద్ధిమాన్ సాహా