క్రీడాభూమి

రవిచంద్రుడు కిందికి.. రవీంద్రుడు పైకి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) తాజాగా విడుదల చేసిన ప్రపంచ అత్యుత్తమ టెస్టు బౌలర్ల జాబితాలో టీమిండియా ఎడమచేతి వాటం స్పిన్నర్ రవీంద్ర జడేజా అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా రాంచీలో డ్రాగా ముగిసిన మూడో మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు కైవసం చేసుకున్న జడేజా ఈ ర్యాంకింగ్స్‌లో తన సహచరుడు రవిచంద్రన్ అశ్విన్‌ను అధిగమించి నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. ఇంతకుముందు 892 పాయింట్లతో అశ్విన్‌తో కలసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచిన జడేజా రాంచీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 124 పరుగులకు 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 52 పరుగులకు కైవసం చేసుకున్న విషయం విదితమే. దీంతో జడేజా మరో 7 రేటింగ్ పాయింట్లను తన ఖాతాలో జమ చేసుకుని ఉత్తమ టెస్టు బౌలర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్, బిషన్ సింగ్ బేడీ తర్వాత అగ్రస్థానానికి చేరుకున్న మూడవ భారత ఆటగాడిగా అవతరించాడు. అంతేకాకుండా ప్రస్తుతం మొత్తం 899 రేటింగ్ పాయింట్లను కలిగివున్న జడేజా మరో పెద్ద మైలురాయికి చేరువయ్యాడు. జడేజా ఖాతాలో మరో పాయింట్ జమ అయితే రవిచంద్రన్ అశ్విన్ తర్వాత 900 పాయింట్ల మైలురాయిని చేరుకున్న రెండవ భారత బౌలర్‌గా అతను ఆవిర్భవిస్తాడు. గతంలో అత్యధికంగా 904 రేటింగ్ పాయింట్లు సాధించిన అశ్విన్ రాంచీ టెస్టులో కేవలం రెండు వికెట్లు మాత్రమే రాబట్టడంతో 37 పాయింట్లు కోల్పోయాడు. దీంతో అతను ఇప్పుడు 862 పాయింట్లతో ఉత్తమ బౌలర్ల జాబితాలో జడేజా తర్వాత రెండవ స్థానానికి పడిపోయాడు.
పుజారాకు కెరీర్ బెస్టు ర్యాంకు
ఇదిలావుంటే, ఉత్తమ బ్యాట్స్‌మెన్ జాబితాలో చటేశ్వర్ పుజారా రెండవ స్థానానికి ఎగబాకి కెరీర్ బెస్టు ర్యాంకుకు చేరుకున్నాడు. రాంచీ టెస్టులో డబుల్ సెంచరీ (202 పరుగులు)తో సత్తా చాటుకుని తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించిన పుజారా తన రేటింగ్ పాయింట్లను 861కి పెంచుకుని తాజా ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు ఎగబాకాడు. దీంతో ఇంతకుముందు ఈ జాబితాలో రెండో ర్యాంకులో ఉన్న న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కాన్ విలియమ్‌సన్ ప్రస్తుతం ఐదో స్థానానికి దిగజారాడు. రాంచీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అజేయంగా 178 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 21 పరుగులు సాధించిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ కెరీర్‌లోనే అత్యధికంగా 941 రేటింగ్ పాయింట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలువగా, ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ మూడో స్థానంలోనూ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలోనూ యథాతథంగా కొనసాగుతున్నారు.
ఆసీస్-దక్షిణాఫ్రికా మధ్య ఆసక్తికర పోటీ
ఉత్తమ టెస్టు క్రికెట్ జట్ల జాబితాలో ఇప్పటికే అగ్రస్థానాన్ని ఖరారు చేసుకున్న భారత జట్టు ఏప్రిల్ 1వ తేదీన 10 లక్షల డాలర్ల నగదు బహుమతిని అందుకునేందుకు సిద్ధమైన విషయం విదితమే. అయితే ఈ జాబితాలో రెండవ స్థానం కోసం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నెలకొన్న పోటీ ఆసక్తికరంగా మారింది. కటాఫ్ తేదీ (ఏప్రిల్ 1వ తేదీ) నాటికి ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచి 5 లక్షల డాలర్లను గెలుచుకునేందుకు ఈ రెండు జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. టీమిండియాతో ధర్మశాలలో జరిగే నాలుగో టెస్టు మ్యాచ్‌ను కనీసం డ్రాగా ముగించినా ఆస్ట్రేలియా జట్టుకు రెండో ర్యాంకు ఖరారవుతుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఓటమిపాలైనా లేక హామిల్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగే చివరి టెస్టులో సఫారీలు విజయం సాధించినా లేక డ్రాగా ముగించినా దక్షిణాఫ్రికా జట్టు రెండో స్థానంలో నిలుస్తుంది. ఏప్రిల్ 1వ తేదీ నాటికి ఉత్తమ టెస్టు జట్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచిన జట్టుకు 2 లక్షల డాలర్లు, నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు లక్ష డాలర్లు చొప్పున నగదు బహుమతులను అందజేస్తారు.

చిత్రం..మరో మైలురాయకి చేరువైన రవీంద్ర జడేజా