క్రీడాభూమి

త్వరలో బిసిసిఐ ఎస్‌జిఎం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) త్వరలోనే అత్యవసర సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం)ను నిర్వహించనుందని సమాచారం. పిఎస్ రామన్ అధ్యక్షతన బిసిసిఐ లీగల్ ప్యానెల్ ఆదివారం ఇక్కడ సమావేశమై, సుప్రీం కోర్టు చేసిన పలు వ్యాఖ్యలపై సుదీర్ఘంగా చర్చించింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్, కోశాధికారి అనిరుద్థ్ చౌదరీ, లీగల్ ప్యానెల్ సభ్యులు డివిఎస్‌ఎస్ సోమయాజులు, అభే అప్టే ఈ సమావేశానికి హాజరయ్యారు. అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికీ, బోర్డు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం లోధా కమిటీ ఇటీవల చేసిన సూచనలపై కమిటీ కూలంకషంగా చర్చించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌పై విచారణను పూర్తి చేసిన సుప్రీం కోర్టు ఆతర్వాత శిక్షలను ఖరారు చేయడానికి ఆర్‌ఎం లోధా అధ్యక్షతన లోధా కమిటీని నియమించింది. అంతేగాక, బిసిసిఐ పాలన పారదర్శకంగా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలను సూచించాల్సిందిగా కోరింది. పలువురిని విచారించిన తర్వాత లోధా కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలపై రెండేసి సంవత్సరాల నిషేధాన్ని విధించింది. అంతేగాక, రాజస్థాన్ సహ భాగస్వామి రాజ్ కుంద్రా, చెన్నైకి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించిన గురునాథ్ మెయప్పన్‌లను జీవితకాలం సస్పెండ్ చేసింది. ఇటీవలే సుప్రీం కోర్టుకు ఒక నివేదికను సమర్పించింది. స్పాట్ ఫిక్సింగ్‌ను నియంత్రీకరించడానికి వీలుగా బెట్టింగ్‌కు చట్టబద్ధత కల్పించే అంశాన్ని ఆలోచించాలని సూచించింది. అంతగాక, సాధ్యమైనంత వరకూ రాజకీయ నాయకుల జోక్యం బిసిసిఐలో ఉండకూడదని పేర్కొంది. బోర్డులోని ఎలాంటి పదవికైనా మంత్రులను అనర్హులుగా ప్రకటించాలని, అంతేగాక, వరుసగా రెండు పర్యాయాలు, మొత్తం మీద మూడుసార్ల కంటే ఎక్కువ కాలం బిసిసిఐ కార్యవర్గానికి ఎన్నికయ్యే అవకాశం లేకుండా చర్య తీసుకోవాలని సూచించింది. బోర్డులో ఏ పదవికైనా గరిష్ట వయోపరిమితిని ఖరారు చేయాలని కోరింది.
సిఫార్సులను అమలు చేయండి
ఇలావుంటే, లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాలని బిసిసిఐకి సుప్రీం కోర్టు సూచించింది. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. బోర్టు పాలన మరింత పారదర్శకంగా ఉండాలని పేర్కొంది. లోధా కమిటీ సిఫార్సులన్నీ ఆచరణనీయమైనవని, వాటిలో అభ్యంతరం చెప్పగల అంశం ఒక్కటి కూడా లేదని వ్యాఖ్యానించింది. అయితే, అనుబంధ సంఘాలతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు బిసిసిఐ తెలిపింది. తన నిర్ణయాన్ని తెలిపేందుకు నాలుగు వారాల సమయాన్ని కోరింది. బోర్డు కోరిన విధంగానే సుప్రీం కోర్టు నాలుగు వారాల్లో ఏదో ఒక నిర్ణయానికి రావాలని ఆదేశించింది.
ఎస్‌జిఎం సాధ్యమే
బోర్డు నిబంధనల ప్రకారం అత్యవసరంగా ఒక ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలంటే, కనీసం 21 రోజుల ముందుగా అన్ని సభ్య సంఘాలు, క్రీడా బోర్డులకు బిసిసిఐ నోటీను పంపాల్సి ఉంటుంది. ఆ నిబంధన ప్రకారం సుప్రీం కోర్టు ఇచ్చిన గడువులోగా నోటీసు సిద్ధం చేసుకొని, అందరికీ పంపి, ఆతర్వాత సమవేశాన్ని నిర్వహించడం సాధ్యం కాదు. అయితే, మరో నిబంధన కింద బోర్డు అధ్యక్షుడు తన విస్తృత అధికారాలను వినియోగించవచ్చు. దాని ప్రకారం ఎస్‌జిఎంను నిర్వహించడానికి పది రోజుల ముందు నోటీసు పంపితే సరిపోతుంది. ఈ రెండో నిబంధన ప్రకారం ఎస్‌జిఎంకు బిసిసిఐ సన్నాహాలు ప్రారంభిస్తుంది.

చిత్రం... ముంబయలో ఆదివారం జరిగిన సమావేశానికి హాజరవుతున్న బిసిసిఐ లీగల్ ప్యానల్ అధ్యక్షుడు పిఎస్ రామన్