క్రీడాభూమి

అరంగేట్రం అదిరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుకు వికెట్లు కూల్చిన స్పిన్నర్ కుల్దీప్
సెంచరీతో స్టీవెన్ స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్

కుల్దీప్ యాదవ్ భారత తరఫున టెస్టుల్లో ఆడిన 288వ క్రికెటర్. మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ అతనికి టీమిండియా క్యాప్‌ను అందించాడు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల కుల్దీప్ 2012లో అండర్-19 ప్రపంచ కప్‌ను సాధించిన భారత జట్టులో సభ్యుడిగా ఉండే అవకాశాన్ని కొద్దిలో కోల్పోయాడు. అయితే, ఆ లోటును టెస్టు ఆటగాడిగా అరంగేట్రం చేయడం ద్వారా భర్తీ చేసుకున్నాడు.
వేళ్లనుకాకుండా, చేతి మణికట్టును ఉపయోగించి బంతిని స్పిన్ చేసే భారత ఎడమచేతి వాటం బౌలర్లలో కుల్దీప్ మొదటివాడు. ఆసియా ఖండంలో రెండోవాడు. శ్రీలంక ఎడమచేతి వాటం రిస్ట్ స్పిన్నర్ లక్షన్ సండాకన్ తర్వాత ఆసియా నుంచి టెస్టు ఆడిన అదే తరహా బౌలర్‌గా కుల్దీప్ గుర్తింపు పొందాడు.

ధర్మశాల, మార్చి 25: ఆస్ట్రేలియాతో శనివారం ప్రారంభమైన చివరి, నాలుగో టెస్టులో అరంగేట్రం చేసిన భారత యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అదరగొట్టాడు. నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అతని బౌలింగ్‌కు దాసోహమన్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకే ఆలౌటైంది. స్టీవెన్ స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, శతకాన్ని నమోదు చేశాడు. లేకపోతే, ఆసీస్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 10 పరుగుల స్కోరు వద్ద ఓపెనర్ మాట్ రెన్‌షా (1) వికెట్‌ను కోల్పోయింది. ఉమేష్ యాదవ్ అతనిని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆరంభంలోనే ఎదురుదెబ్బతిన్న జట్టును ఓపెనర్ డేవిడ్ వార్నర్‌తో కలిసి స్మిత్ చక్కదిద్దాడు. ఈ సిరీస్‌లో ఇంత వరకూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన వార్నర్ ఈ మ్యాచ్‌లో నిలదొక్కుకొని ఆడేందుకు ప్రయత్నించాడు. స్మిత్‌తో కలిసి రెండో వికెట్‌కు 134 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన తర్వాత కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో, విరాట్ కోహ్లీ స్థానంలో భారత్‌కు నాయకత్వం వహిస్తున్న అజింక్య రహానే క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. అతను 87 బంతులు ఎదుర్కొని, 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 56 పరుగులు సాధించాడు. అయితే, ఇన్నింగ్స్ ఒక గాడిలో పడిందన్న ఆనందం ఆసీస్‌కు ఎక్కువ సేపు లేకుండాపోయింది. మిచెల్ మార్ష్ (4), పీటర్ హ్యాండ్స్‌కోమ్ (8) సింగిల్ డిజిట్స్‌తోనే సరిపుచ్చుకున్నారు. బాధ్యతాయుతంగా ఆడుతూ, 173 బంతుల్లో, 14 ఫోర్లతో 111 పరుగులు చేసిన స్మిత్‌ను అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. రహానే చక్కటి క్యాచ్ పట్టడంతో స్మిత్ పోరాటానికి తెరపడింది. రాంచీ టెస్టులో సెంచరీ సాధించిన గ్లేన్ మాక్స్‌వెల్ కేవలం ఎనిమిది పరుగులకే వెనుదిరిగాడు. పీటర్ హ్యాండ్స్‌కోమ్ మాదిరిగానే మాక్స్‌వెల్‌ను కూడా కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ మాథ్యూ వేడ్ (125 బంతుల్లో 57) అర్ధ శతకంతో జట్టుకు అండగా నిలిచే ప్రయత్నం చేశాడు. కానీ, పాట్ కమిన్స్ (21), స్టీవ్ ఒకీఫ్ (8), నాథన్ లియాన్ (13) పరుగుల వేటలో విఫలమయ్యారు. దీనితో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌కు 88.3 ఓవర్లలో 300 పరుగుల వద్ద తెరపడింది. అప్పటికి జొస్ హాజెల్‌వుడ్ రెండు పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ 68 పరుగులకు నాలుగు వికెట్లు సాధించగా, ఉమేష్ యాదవ్ రెండు వికెట్లు కూల్చాడు. భువనేశ్వర్ కుమార్, అశ్విన్, రవీంద్ర జడేజా తలా ఒక్కో వికెట్ తమ ఖాతాల్లో వేసుకున్నారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఒక ఓవర్ ఆడి, ఒక్క పరుగు కూడా చేయలేదు.

స్కోరుబోర్డు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ సి అజింక్య రహానే బి కుల్దీప్ యాదవ్ 56, మాట్ రెన్‌షా బి ఉమేష్ యాదవ్ 1, స్టీవెన్ స్మిత్ సి అజింక్య రహానే బి అశ్విన్ 111, షాన్ మార్ష్ సి వృద్ధిమాన్ సాహా బి ఉమేష్ యాదవ్ 4, పీటర్ హ్యాండ్స్‌కోమ్ బి కుల్దీప్ యాదవ్ 8, మాథ్యూ వేడ్ బి రవీంద్ర జడేజా 57, పాట్ కమిన్స్ సి అండ్ బి కుల్దీప్ యాదవ్ 21, స్టీవ్ ఒకీఫ్ రనౌట్ 8, నాథన్ లియాన్ సి చటేశ్వర్ పుజారా బి భువనేశ్వర్ కుమార్ 13, జొస్ హాజెల్‌వుడ్ 2 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 11, మొత్తం (88.3 ఓవర్లలో ఆలౌట్) 308.
వికెట్ల పతనం: 1-10, 2-144, 3-153, 4-168, 5-178, 6-208, 7-245, 8-269, 9-269, 10-300.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 12.3-2-41-1, ఉమేష్ యాదవ్ 15-1- 69-2, అశ్విన్ 23-5-54-1, రవీంద్ర జడేజా 15-1-57-1, కుల్దీప్ యాదవ్ 23-3-68-4.
భారత్ తొలి ఇన్నింగ్స్: లోకేష్ రాహుల్ 0 నాటౌట్, మురళీ విజయ్ 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 0, మొత్తం (ఒక ఓవర్‌లో వికెట్ నష్టం లేకుండా) 0.
బౌలింగ్: జొస్ హాజెల్‌వుడ్ 1-1-0-0.

33వ కెప్టెన్ రహానే
ధర్మశాల: విరాట్ కోహ్లీ భుజం గాయం కారణంగా, ఆస్ట్రేలియాతో శనివారం ప్రారంభమైన చివరి, నాలుగో టెస్టులో ఆడలేకపోవడంతో, అతని స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలను అజింక్య రహానే తీసుకున్నాడు. భారత జట్టుకు అతను 33వ కెప్టెన్. కెరీర్‌లో అతను 37వ టెస్టు ఆడుతున్నాడు.