క్రీడాభూమి

నిన్న విజయ్ హజారే.. నేడు దేవధర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), మార్చి 29: కీలకమైన ఫైనల్ పోటీలో దినేష్ కార్తీక్ చెలరేగిపోయాడు. అతను సెంచరీ చేయడంతో, ఇండియా ‘బి’పై తన జట్టు విజయం సాధించడంలో కీలక భూమిక పోషించాడు. ఈ విజయంతో తమిళనాడు దేవధర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇటీవలే విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకుని ఈ పోటీలకు తమిళనాడు అర్హత సంపాదించింది. అది ఆషామాషిగా లభించిన విజయం కాదని నిరూపిస్తూ, పటిష్టమైన ఇండియా ‘ఎ’, ఇండియా ‘బి’ జట్లను ఓడించి ఈ ట్రోఫీని గెల్చుకుంది. బుధవారం నాటి మ్యాచ్‌లో తమిళనాడు జట్టు 42 పరుగుల తేడాతో ఇండియా ‘బి’ జట్టును ఓడించి, లీగ్ దశలో అదే జట్టు చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. అంతకు ముందు, ఇండియా ‘ఎ’ జట్టుపై 93 పరుగులు చేసి ఫాంలోకి వచ్చిన దినేష్‌కార్తీక్ ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయి, ఇండియా ‘బి’ బౌలర్లను ఉతికి ఆరేశాడు. అన్ని లీగ్ మ్యాచుల్లో బ్యాటింగులో అద్వితీయమైన ప్రతిభ కనబరిచిన ఇండియా ‘బి’ జట్టు ఈ మ్యాచ్‌లో మాత్రం వెలవెలబోవడం గమనార్హం. జట్టులో గురుకీరత్‌మాన్ అర్ధసెంచరీతో ఒంటరి పోరాటం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో తమిళనాడు ఆద్యంతం ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తమిళనాడు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 303 పరుగులు చేసింది. ఆట ప్రారంభంలో ధవళ్ కులకర్ణి బౌలింగులో 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును జగదీషన్, దినేష్ కార్తీక్ ఆదుకున్నారు. వీళ్లిద్దరూ నాలుగో వికెట్‌కు 133 పరుగులు జత చేశారు. జగదీషన్ 4 బౌండరీలు, ఒక సిక్సర్‌తో 55 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన విజయశంకర్ (21), ఇంద్రజిత్ (31) కార్తీక్‌కు అండగా నిలబడడంతో స్కోరు బోర్డును పరుగులు తీయించారు. దినేష్ కార్తీక్ 125 నిముషాల పాటు క్రీజులో నిలిచి 14 బౌండరీలు, 3 సిక్సర్లతో 126 పరుగులు చేశాడు. ఇండియా ‘బి’ జట్టు బౌలర్లలో ధవళ్ కులకర్ణి 39 పరుగులకు 5 వికెట్లు పడగొట్టగా, అశోక్ దిండా, చామా మిలింద్, అక్షర్ పటేల్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా తలా ఒక్కో వికెట్ తీసుకున్నారు. అనంతరం 304 పరుగుల భారీ స్కోరు లక్ష్యంతో బ్యాటింగుకు దిగిన ఇండియా ‘బి’ 46.1 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటయింది. జట్టులో గుర్‌కీరత్ మాన్ 64, శిఖర్ ధావన్ 45, మనీష్ పాండే 32, హర్‌ప్రీత్ సింగ్ భాటియా 36, కార్నెవార్ 29 తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ ప్రత్యిర్థి బౌలర్లకు ఎదురు నిలవలేకపోయారు. తమిళనాడు బౌలర్లలో రాహిల్‌షా 3, మహ్మద్, సాయి కిశోర్ చెరో 2 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

చిత్రం... దేవధర్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ ‘బి’ని ఓడించి, గెల్చుకున్న షీల్డ్‌తో తమిళనాడు జట్టు

ఇండియన్ ఓపెన్ బాడ్మింటన్
సైనా, సింధు ముందంజ
న్యూఢిల్లీ, మార్చి 29: భారత బాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పివి సింధు బుధవారం ఇక్కడ ప్రారంభమైన ఇండియన్ సూపర్ లీగ్‌లో ముందంజ వేశారు. సైనా తన మొదటి రౌండ్‌లో చైనీస్ తైపీకి చెందిన చియా సిన్ లీను 21-10, 21-17 తేడాతో ఓడించింది. రియో ఒలింపిక్స్ రజత పతక విజేత సింధు 21-17, 21-6 ఆధిక్యంతో అరుంధతి పత్వానేపై గెలిచింది. ఇటీవలే సయ్యద్ మోదీ జాతీయ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న సమీర్ వర్మ 21-17, 21-10 తేడాతో సోన్ వాన్‌పై గెలిచాడు. సాయి ప్రణీత్ 16-21, 21-12, 21-19 స్కోరుతో కెన్టా నిషిమొతోను ఓడించాడు.

అర్జెంటీనా ఫుట్‌బాలర్ మెస్సీపై వేటు!

బూనస్‌ఎయిర్స్, మార్చి 29: అర్జెంటీనా ఫుట్‌బాల్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీపై వేటు పడింది. అతనిని నాలుగు మ్యాచ్‌ల నుంచి సస్పెండ్ చేసినట్టు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ‘్ఫఫా’ ప్రకటించింది. దీనితో బొలీవియాతో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ బరిలోకి దిగలేదు. అతను మైదానంలో లేకపోవడంతో డీలాపడిన అర్జెంటీనా, ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా బొలీవియాతో జరిగిన మ్యాచ్‌లో 0-2 తేడాతో ఓటమిపాలైంది. చిలీతో ఇటీవల జరిగి మ్యాచ్‌లో లైన్స్‌మన్ వాన్ గెసీతో మెస్సీ గొడవ పడ్డాడు. అతనితో వాగ్వాదానికి దిగాడు. అతనిని దుర్భాషలాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సంఘటనపై తీవ్రంగా స్పందంచిన ఫిఫా అతనిని నాలుగు మ్యాచ్‌ల నుంచి సస్పెండ్ చేసింది. బొలీవియాతో ప్రారంభమైన అతని సస్పెన్షన్ మ్యాచ్‌లు, ఉరుగ్వే, వెనెజులా, పెరూ మ్యాచ్‌ల్లోనూ అమలవుతుంది. ఈక్వెడార్‌తో జరిగే మ్యాచ్‌కి అతను అందుబాటులో ఉంటాడు. అయితే, అర్జెంటీనాకు అదే చివరి క్వాలిఫయింగ్ మ్యాచ్. మెస్సీ లేకుండా ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓడిన అర్జెంటీనా మిగతా మూడు మ్యాచ్‌ల్లో ఏ విధంగా నెగ్గుకొస్తుందనేది అనుమానమే.

టాప్ సీడ్ వావ్రిన్కాకు
అలెగ్జాండర్ షాక్
మియామీ, మార్చి 29: మియామీ ఓపెన్ టెన్నిస్ నాలుగో రౌండ్‌లో టాప్ సీడ్ స్టానిస్లాస్ వావ్రిన్కా ఓటమిపాలయ్యాడు. యువ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ అతనిని 4-6, 6-2, 6-1 తేడాతో ఓడించి సంచలనం సృష్టించాడు. క్వార్టర్స్‌లో అతను 12వ ర్యాంక్ ఆటగాడు నిక్ కిర్గియోస్‌ను ఢీ కొంటాడు. మరో నాలుగో రౌండ్ మ్యాచ్‌లో కిర్గియోస్ 7-6, 6-3 స్కోరుతో డేవిడ్ గొఫిన్‌ను ఓడించాడు. ఇలావుంటే, రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్, కెయ్ నిషికొరి కూడా తమతమ ప్రత్యర్థులపై విజయాలు సాధించి క్వార్టర్స్ చేరారు. ఫెదరర్ 7-6, 7-6 తేడాతో రాబర్టో బటిస్టా అగుట్‌ను ఓడించి, క్వార్టర్స్‌లో తొమాస్ బెర్డిచ్‌తో పోరును ఖాయం చేసుకున్నాడు బెర్డిచ్ 6-3, 7-5 ఆధిక్యంతో ఆడ్రియన్ మనారినోపై గెలిచాడు. కాగా, నాదల్ 6-4, 7-6 తేడాతో నికోలస్ మాహుత్‌పై విజయం సాధించాడు. అతను తర్వాతి మ్యాచ్‌లో అమెరికా ఆటగాడు జాక్ సాక్‌తో తలపడతాడు. సాక్ 6-2, 6-1 స్కోరుతో జారెడ్ డొనాల్డ్‌సన్‌పై గెలిచి, క్వార్టర్స్ చేరాడు. రెండో సీడ్ కెయ్ నిషికొరి 6-3, 4-6, 6-3 తేడాతో ఫెడెరికో డెల్ బొనిస్‌పై గెలిచాడు. క్వార్టర్స్‌లో అతను ఫాబియో ఫోగ్నినీతో పోరాడతాడు. ఫోగ్నినీ 6-0, 6-4 స్కోరుతో డొనాల్డ్ యంగ్‌పై సులభంగా నెగ్గాడు.
సెమీస్ చేరిన ప్లిస్కోవా
మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ కరోలినా ప్లిస్కోవా సెమీ ఫైనల్ చేరింది. ఆమె క్వార్టర్ ఫైనల్స్‌లో మిర్జినా లూసిక్ బరోనీని 6-3, 6-4 తేడాతో ఓడించి, ఫైనల్‌లో స్థానం కోసం కరోలినా వొజ్నియాకితో పోరును ఖాయం చేసుకుంది. మరో క్వార్టర్ ఫైనల్‌లో వొజ్నియాకి 6-4, 6-3 ఆధిక్యంతో లూసీ సఫరోవాను ఓడించింది.