క్రీడాభూమి

టైటిల్‌కు చేరువైన భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీర్పూర్: ఐసిసి అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో మూడుసార్లు చాంపియన్‌షిప్ సాధించిన భారత జట్టు మరోసారి టైటిల్‌కు చేరువైంది. మీర్పూర్ (బంగ్లాదేశ్)లోని షేర్ ఎ బంగ్లా స్టేడియంలో మంగళవారం జరిగిన సెమీఫైనల్‌లో అన్మోల్‌ప్రీత్ సింగ్, సర్‌ఫ్రాజ్ ఖాన్ అర్థ శతకాలతో రాణించడంతో భారత అండర్-19 జట్టు 97 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించి ఈ టోర్నీలో ఐదోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 267 పరుగులు సాధించిన భారత జట్టు ఆ తర్వాత శ్రీలంక అండర్-19 జట్టును 42.4 ఓవర్లలో 170 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచి భారత జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించిన అన్మోల్‌ప్రీత్ సింగ్ (72) ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. టైటిల్ కోసం భారత జట్టు ఈ నెల 14వ తేదీన జరిగే ఫైనల్‌లో వెస్టిండీస్‌తో గానీ లేక ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టుతో గానీ తలపడుతుంది.
అంతకుముందు టాస్ గెలిచిన శ్రీలంక అండర్-19 జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు ఆరంభంలో తడబడింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (7)తో పాటు ఓపెనర్ రిషబ్ పంత్ (14) స్వల్పస్కోర్లకే నిష్క్రమించడంతో భారత జట్టు 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ తరుణంలో అన్మోల్‌ప్రీత్ సింగ్, సర్‌ఫ్రాజ్ ఖాన్ క్రీజ్‌లో నిలదొక్కుకుని స్థిమితంగా ఆడారు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థవంతంగా ప్రతిఘటించిన వీరు చూడముచ్చటైన షాట్లతో అలరిస్తూ చెరొక అర్థ శతకాన్ని నమోదు చేసుకోవడంతో పాటు మూడో వికెట్‌కు 96 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అనంతరం సర్‌ఫ్రాజ్ ఖాన్ (59) 31వ ఓవర్‌లో ఎఎం.ఫెర్నాండో వేసిన బంతిని ఎదుర్కోబోయి అషన్‌కు క్యాచ్ ఇవ్వడంతో వీరి భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్‌తో కలసి నాలుగో వికెట్‌కు మరో 70 పరుగులు జోడించిన అన్మోల్‌ప్రీత్ సింగ్ 72 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిమేష్ బౌలింగ్‌లో వికెట్ల వెనుక పివిఆర్.డిసిల్వాకు దొరికిపోయాడు. కొద్దిసేపటికి వాషింగ్టన్ సుందర్ (43), అర్మాన్ జాఫర్ (29), ఎంకె.లోమ్రర్ (11), ఆర్‌ఆర్.బాథమ్ (1), ఎంజె.దాగర్ (17) త్వరత్వరగా పెవిలియన్‌క చేరగా, ఆవేశ్ ఖాన్ (1), ఖలీల్ అహ్మద్ (0) అజేయంగా నిలిచారు. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 267 పరుగులు సాధించింది. శ్రీలంక అండర్-19 బౌలర్లలో అసితా ఫెర్నాండో నాలుగు వికెట్లు కైవసం చేసుకోగా, లహిరు కుమార, తిలన్ నిమేష్ చెరో రెండు వికెట్లు రాబట్టారు.
అనంతరం 268 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక జట్టును భారత బౌలర్లు గడగడలాడించారు. వీరి జోరును ప్రతిఘటించడంతో లంకేయులు ఘోరంగా విఫలమయ్యారు. ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ కమిందు మెండిస్ (39), షమ్ము అషన్ (38), వికెట్ కీపర్ విశద్ రాండిక డిసిల్వా (28), ధమ్మిక సిల్వా (24) మినహా మిగిలిన వారెవరూ రెండంకెల స్కోర్లు సాధించకుండానే పెవిలియన్‌కు పరుగు తీశారు. దీంతో 42.4 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైన శ్రీలంక జట్టు 97 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలై ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత బౌలర్లలో మయాంక్ దాగర్ మూడు వికెట్లు, ఆవేశ్ ఖాన్ రెండు వికెట్లు, కైవసం చేసుకోగా, ఖలీల్ అహ్మద్, రాహుల్ బాథమ్, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ సాధించారు.
సంక్షిప్తంగా స్కోర్లు
భారత అండర్-19 ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 267/9 (అన్మోల్‌ప్రీత్ సింగ్ 72, సర్‌ఫ్రాజ్ ఖాన్ 59, వాషింగ్టన్ సుందర్ 43, అర్మాన్ జాఫర్ 29, మయాంక్ దాగర్ 17).
వికెట్ల పతనం: 1-23, 2-27, 3-123, 4-193, 5-218, 6-241, 7-254, 8-260, 9-264.
బౌలింగ్: అసితా ఫెర్నాండో 4/43, లహిరు కుమార 2/50, థిలన్ నిమేష్ 2/50.
శ్రీలంక అండర్-19 ఇన్నింగ్స్: 42.4 ఓవర్లలో 170 ఆలౌట్ (కమిందు మెండిస్ 39, షమ్ము అషన్ 38, విశద్ రాండిక డిసిల్వా 28, ధమ్మిక సిల్వా 24).
వికెట్ల పతనం: 1-5, 2-13, 3-42, 4-91, 5-108, 6-133, 7-149, 8-170, 9-170, 10-170.
బౌలింగ్: మయాంక్ దాగర్ 3/21, ఆవేశ్ ఖాన్ 2/41, రాహుల్ బాథమ్ 1/19, వాషింగ్టన్ సుందర్ 1/27, ఖలీల్ అహ్మద్ 1/34.

‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అన్మోల్‌ప్రీత్ సింగ్ (72)