క్రీడాభూమి

ఐపిఎల్ పండగ వచ్చేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ పండుగ మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. హైదరాబాద్ (ఉప్పల్)లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బుధవారం జరుగనున్న ఐపిఎల్-10 ఆరంభ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) జట్టు డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా తమ స్టార్ ఆటగాళ్లలో కొంత మంది గాయలతో ఇబ్బందులు పడుతుండటం రాయల్ చాలెంజర్స్‌ను తీవ్రంగా కుంగదీస్తోంది. భుజానికి తగిలిన గాయంతో ఇబ్బందులు పడుతున్న కోహ్లీతో పాటు వెన్ను నొప్పితో సతమతమవుతున్న మరో సీనియర్ స్టార్ బ్యాట్స్‌మన్ ఎబి.డివిలియర్స్ బుధవారం సన్‌రైజర్స్‌తో జరిగే పోరుకు అందుబాటులో లేరు. అలాగే గాయంతో బాధపడుతున్న రాయల్ చాలెంజర్స్ యువ స్టార్ బ్యాట్స్‌మన్ లోకేష్ రాహుల్‌తో పాటు మరో యువ బ్యాట్స్‌మన్ సర్‌ఫ్రాజ్ ఖాన్ కూడా ఐపిఎల్-10 టోర్నమెంట్‌కు పూర్తిగా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌తో కలసి ఆర్‌సిబి ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడని భావించిన సర్‌ఫ్రాజ్ ఖాన్ బెంగళూరులో ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. ఐపిఎల్-10 ఆరంభ మ్యాచ్‌కే కాకుండా ఆ తర్వాత మరికొన్ని మ్యాచ్‌లకు కూడా కోహ్లీ దూరమయ్యే అవకాశాలు ఉండటంతో అతని స్థానంలో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు షేన్ వాట్సన్‌ను రాయల్ చాలెంజర్స్ జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా నియమించారు. దీంతో ఆ జట్టు ప్రస్తుతానికి క్రిస్ గేల్, వాట్సన్‌లపైనే ఎక్కువగా ఆధారపడింది. అలాగే లోకేష్ రాహుల్ లేకపోవడం వలన ఏర్పడిన వెలితిని రైజింగ్ ఇండియన్ స్టార్ కేదార్ జాదవ్ భర్తీ చేస్తాడని ఆర్‌సిబి ఆశలు పెట్టుకుంది. ఇంతకుముందు ఐపిఎల్‌లో ఆడిన అనుభవమున్న ఆస్ట్రేలియన్ టి-20 స్టార్ ట్రవిస్ హెడ్, ఇండియన్ ప్లేయర్లు సచిన్ బాబీ, మన్‌దీప్ సింగ్ కూడా రాయల్ చాలెంజర్స్ బ్యాటింగ్ విభాగంలో ముఖ్యమైనవారే. అలాగే ఇంగ్లండ్ పేసర్ టైమల్ మిల్స్, యుజువేంద్ర చాహాల్, విండీస్ లెగ్ స్పిన్నర్ శామ్యూల్ బద్రి, కివీస్ పేసర్ ఆడమ్ మిల్నే, ఎడమచేతి వాటం సీమర్ అంకిత్ చౌదరి లాంటి ఆటగాళ్లతో ఆర్‌సిబి బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. వీరికి తోడు శ్రీనాథ్ అరవింద్, స్టూవర్ట్ బిన్నీ, ఆల్‌రౌండర్ పవన్ నేగీ లాంటి భారత ఆటగాళ్లు ఆర్‌సిబి పోరాటానికి ఎంతో కొంత ఊతమివ్వగలరని భావిస్తున్నారు.
ఇదిలావుంటే, గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా విజేతగా నిలిచి టైటిల్‌ను నిలబెట్టుకోవాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కృతనిశ్చయంతో ఉంది. గత సీజన్‌లో జట్టును ముందుండి నడిపిన కెప్టెన్ డేవిడ్ వార్నర్ సహా మరికొందరు ఆటగాళ్లతో ఆ జట్టు బ్యాటింగ్ విభాగం ఎంతో పటిష్టంగా ఉంది. ఇటీవల భారత పర్యటనను పేలవంగా ముగించుకున్న ఆస్ట్రేలియా జట్టులో వార్నర్ సరిగా రాణించలేకపోయినప్పటికీ ధర్మశాలలో జరిగిన నిర్ణాయక చివరి టెస్టు మ్యాచ్‌లో అతను మంచి స్కోరు సాధించిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ జట్టులో కీలక ఆటగాడిగా పరిగణిస్తున్న డేవిడ్ వార్నర్ టీమిండియాలో మళ్లీ చోటు కోసం ఎదురు చూస్తున్న శిఖర్ ధావన్‌తో కలసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. ఇటీవల ముగిసిన దేవధర్ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో చక్కగా రాణించి అందరినీ ఆకట్టుకున్న ధావన్ ఇప్పుడు ఐపిఎల్‌లోనూ అదే జోరు కొనసాగించాలని ఆశిస్తున్నాడు. వార్నర్, ధావన్‌తో పాటు ఆల్‌రౌండర్లు యువరాజ్ సింగ్, మోజెస్ హెన్రిక్స్, కాన్ విలియమ్‌సన్, నమన్ ఓజా, దీపక్ హుడా, విజయ్ శంకర్ లాంటి ఆటగాళ్లతో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌ను కలిగివున్న సన్‌రైజర్స్ జట్టులో బెన్ కటింగ్, మొహమ్మద్ నబీ, క్రిస్ జోర్డాన్ కూడా కీలకమైన ఆటగాళ్లే కావడం గమనార్హం.

చిత్రాలు..రాయల్ చాలెంజర్స్ తాత్కాలిక కెప్టెన్ షేన్ వాట్సన్
*సన్‌రైజర్స్ సారథి డేవిడ్ వార్నర్