క్రీడాభూమి

లోస్కోరింగ్ మ్యాచ్‌లో పుణేపై పంజాబ్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, ఏప్రిల్ 8: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో భాగంగా శనివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌పై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ విజయం సాధించింది. లోస్కోరింగ్ నమోదైన ఈ పోరులో పుణే సూపర్‌జెయింట్స్ ఆరు వికెట్లకు 163 పరుగులు మాత్రమే చేస్తే, ఈ సాధారణమైన లక్ష్యాన్ని ఛేదించడానికి పంజాబ్ 19 ఓవర్లు తీసుకుంది. నాలుగు వికెట్లకు 164 పరుగులు చేసి, ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.
పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. పుణే సూపర్‌జెయింట్స్ మొదటి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. ఒక్క పరుగు కూడా చేయకుండానే, సందీప్ శర్మ బౌలింగ్‌లో మాయాంక్ అగర్వాల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అజింక్య రహానే 15 బంతుల్లో 19 పరుగులు చేసి, తంగరసు నటరాజన్ బౌలింగ్‌లో మార్కస్ స్టొయినిస్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మార్కస్ స్టొయినిస్ బౌలింగ్‌లో మానన్ వోరాకు దొరికాడు. మహేంద్ర సింగ్ ధోనీ (5) కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. ఈసారి ఐపిఎల్‌లో అత్యధిక మొత్తానికి అమ్ముడైన బెన్ స్టోక్స్ (50), మనోజ్ తివారీ (40 నాటౌట్) ఆదుకోవడంతో పుణే సూపర్‌జెయింట్స్ కొంత వరకు కోలుకుంది. చివరిలో డానియల్ క్రిస్టియన్ 17 పరుగులు చేశాడు. పుణే సూపర్‌జెయింట్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 163 పరుగులు అత్యంత సాదాసీదా స్కోరుకు పరిమితమైంది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ పరుగుల కోసం తంటాలు పడింది. ఓపెనర్లు హషీం ఆమ్లా (28), మానన్ వోరా (14) మొదటి వికెట్‌కు 27 పరుగులు జోడించారు. వృద్ధిమాన్ సాహా (14) కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. రన్‌రేట్‌ను పెంచుతాడన్న నమ్మకంతో అక్షర్ పటేల్ (24)కు ప్రమోషన్ ఇచ్చిన కెప్టెన్ గ్లేన్ మాక్స్‌వెల్ వ్యూహం కొంత వరకు ఫలించింది. జట్టును గెలిపించే బాధ్యతను తానే స్వయంగా తీసుకున్న మాక్స్‌వెల్ 20 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అజేయంగా 44 పరుగులు సాధించి, తన ప్రయత్నంలో సఫలమయ్యాడు. డేవిడ్ మిల్లర్ తన స్వతఃసిద్ధమైన ఆటకు భిన్నంగా ఆడి, 20 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే, ఇబ్బంది లేకుండా పంజాబ్ గెలిచింది.
సంక్షిప్త స్కోర్లు
రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్: 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 (అజింక్య రహానే 19, స్టీవెన్ స్మిత్ 26, బెన్ స్టోక్స్ 50, మనోజ్ తివారీ 40, సందీప్ శర్మ 2/33, అక్షర్ పటేల్ 1/27, నటరాజన్ 1/26, మార్కస్ స్టొయినిస్ 1/28, స్వాప్నిల్ సింగ్ 1/14).
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్: 19 ఓవర్లలో 4 వికెట్లకు 164 (హషీం ఆమ్లా 28, వృద్ధిమాన్ సాహా 24, గ్లేన్ మాక్స్‌వెల్ 44 నాటౌట్, డేవిడ్ మిల్లర్ 30 నాటౌట్, ఇమ్రాన్ తాహిర్ 2/29, అశోక్ దిండా 1/26, రాహుల్ చాహర్ 1/32).

చిత్రం..సూపర్ ఇన్నింగ్స్..
గ్లేన్ మాక్స్‌వెల్
(44 నాటౌట్)
**

నేటి మ్యాచ్‌లు
*
సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ లయన్స్
(హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో
సాయంత్రం 4 గంటలకు మొదలు)

ముంబయి ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్
(ముంబయిలో రాత్రి 8 గంటలకు ప్రారంభం)