క్రీడాభూమి

శ్రీనివాసన్ రాకతో గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి అతను హాజరుకావడంతో, ఇది చట్టబద్ధమైందా? కాదా? అన్న విషయాన్ని తేల్చుకోలేకపోయిన పాలక మండలి ఏకంగా సమావేశానే్న వాయిదా వేసింది. కాగా, సమావేశాలకు హాజరయ్యేందుకు శ్రీని అర్హుడా? కాదా? అన్న విషయంపై స్పష్టత ఇవ్వాల్సిందిగా బోర్డు పాలనాధికారుల బృందం (సిఒఎ) సుప్రీం కోర్టును కోరింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) సమావేశానికి బోర్డు తరఫున ఎవరు హాజరుకావాలనే విషయంపై సోమవారం సుప్రీం కోర్టు తీర్పునివ్వనున్న నేపథ్యంలో, ప్రత్యేక సమావేశాన్ని బుధవారానికి వాయిదా వేసింది. ఆదివారం నాటి సమావేశానికి శ్రీనివాసన్‌సహా నిరంజన్ షా, టిసి మాథ్యూ, రణ్‌జిబ్ బిస్వాల్, గంగరాజు తదితరులు హాజరయ్యారు. వీరంతా 70 ఏళ్లకు పైబడిన వారే. లోధా సిఫార్సులను అనసరించి, ఏడు పదుల వయసును పూర్తి చేసుకున్న వారు బిసిసిఐ లేదా దాని అనుబంధ సంఘాల పాలక మండలి సభ్యులుగా కొనసాగేందుకు అనర్హులు. అయితే, లోధా ప్రతిపాదనలు ఇంకా సంపూర్ణంగా అమలు జరగడం లేదని, కాబట్టి, తామంతా సమావేశానికి హాజరుకావడంలో తప్పులేదని శ్రీని బృందం వాదిస్తున్నది. ఈ పరిస్థితుల్లో చేసేది ఏమీ లేక, సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు బిసిసిఐ పాలక మండలి ప్రకటించింది.
అర్హతపై అయోమయం
బిసిసిఐ సర్వసభ్య లేదా పాలక మండలి సమావేశాలకు తమిళనాడు క్రికెట్ సంఘం (టిఎన్‌సిఎ) అధ్యక్షుడి హోదాలో శ్రీనివాసన్ హాజరుకావచ్చా? లేదా? అన్న విషయంపై అమోయ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయంలో స్పష్టతనివ్వాలంటూ బిసిసిఐ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇది వరకు సుప్రీం కోర్టు కొట్టేసింది. అప్పట్లో, పరస్పర ప్రయోజనాలపై ఇచ్చిన తీర్పులో ఎలాంటి మార్పు లేదని, దానిని మరోసారి సమీక్షించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. మిగతా అంశాలు బోర్డు అంతర్గత వ్యవహారాలని, వాటిలో జోక్యం చేసుకోబోమని తెలిపింది. ఆతర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో బోర్డు అధ్యక్ష పదవి నుంచి శ్రీని వైదొలగ్గా, ఆ స్థానానికి జగ్మోహన్ దాల్మియా ఎన్నికయ్యాడు. అతని హఠాన్మరణంతో అనురాగ్ ఠాకూర్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. కానీ, వరుసగా రెండు, మొత్తం మీద మూడు పర్యాయాల కంటే ఎక్కువ కాలం బోర్డు లేదా దాని అనుబంధ సంఘాల వర్కింగ్ కమిటీల్లో సభ్యులుగా కొనసాగేందుకు వీల్లేదని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఠాకూర్ తన పదవిని కోల్పోయాడు. ప్రస్తుతం బోర్డుకు అధ్యక్షుడు లేడు. ఇలావుంటే, సుప్రీం కోర్టు ఎన్నిరకాలుగా చీవాట్లు పెట్టినా, భారత క్రికెట్‌పై ఆధిపత్యం కోసం శ్రీని, అతని మద్దతుదారులు ప్రయత్నాలను మానుకోవడం లేదు. తాజాగా ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి వారు హాజరుకావడమే ఇందుకు ఉదాహరణ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసుపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు పరస్పర ప్రయోజనాలు ఉండే రెండు వేర్వేరు పదవుల్లో కొనసాగేందుకు వీల్లేదని శ్రీనివాసన్‌కు ఇది వరకే తేల్చిచెప్పింది. ఐపిఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్‌ను కొనుగోలు చేసిన ఇండియా సిమెంట్స్‌కు శ్రీని అధిపతి. బోర్డు అధ్యక్షుడిగా, ఫ్రాంచైజీ యజమానిగా రెండు పదవుల్లో కొనసాగితే, పరస్పర ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి, రెంటిలో ఏదో ఒకటి నిర్ణయించుకోవాలని శ్రీనికి స్పష్టం చేసింది. చెన్నై ఫ్రాంచైని వదులుకోవడానికి ఇష్టపడని అతను బోర్డు అధ్యక్ష పదవికి పోటీ చేయలేదు. కానీ, బోర్డుపై పట్టును వదులుకోవడానికి ఏమాత్రం సుముఖంగా లేడు. అందుకే ఏదో ఒక రకంగా బోర్డును ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తునే ఉన్నాడు.
శ్రీని బృందం వ్యూహాన్ని కనిపెట్టిన సిఒఎ సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేసింది. ఐసిసి సమావేశానికి హాజరయ్యే అర్హత ఎవరికి ఉంటుందనే అంశంపై సోమవారం సుప్రీం కోర్టు కీలక నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో, సమావేశం బుధవారం జరుగుతుందని స్పష్టం చేసింది. ఆ సమావేశానికి మరోసారి శ్రీని తదితరుల వృద్ధ నేతలు హాజరవుతారా? లేదా అన్నది సుప్రీం కోర్టు ఇవ్వబోయే మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుంది.

చిత్రం..సరికొత్త వ్యూహాలతో ముందుకొస్తున్న బిసిసిఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్