క్రీడాభూమి

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై డేర్‌డెవిల్స్ పంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఐపిఎల్‌లో శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 51 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై విజయం సాధించింది. 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయన పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న డేర్‌డెవిల్స్‌కు ఓపెనర్లు సంజూ శాంసన్, శామ్ బిల్లింగ్స్ సంతృప్తికరమైన ఆంరంభాన్నిచ్చారు. వీరు మొదటి వికెట్‌కు 6.5 ఓవర్లలో 53 పరుగులు జోడించారు. 18 బంతుల్లో 19 పరుగులు చేసిన శాంసన్‌ను ఇయాన్ మోర్గాన్ క్యాచ్ అందుకోగా కరియప్ప పెవిలియన్‌కు పంపాడు. జట్టు స్కోరుకు మరో రెండు పరుగులు జత కలవగా, కరుణ్ నాయర్ వికెట్ కూలింది. అతను పరుగుల ఖాతా తెరవకుండానే వరుణ్ ఆరోన్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహాకు దొరికాడు. శ్రేయాస్ అయ్యర్ 17 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్ల సాయంతో 22 పరుగులు చేశాడు. అతని వికెట్ మోహిత్ శర్మకు లభించింది. ఇయాన్ మోర్గాన్ క్యాచ్ అందుకోవడంతో శ్రేయార్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. కాగా, బాధ్యతాయుతంగా ఆడుతూ, 40 బంతుల్లో, తొమ్మిది ఫోర్లతో 55 పరుగులు చేసిన బిల్లింగ్స్‌ను అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. డేవిడ్ మిల్లర్ అద్భుతమైన క్యాచ్ పట్టగా బిల్లింగ్స్ వెనుదిరిగాడు. చివరిలో కొరీ ఆండర్సన్ వేగంగా పరుగులు రాబట్టేందుకు కృషి చేశాడు. రిషభ్ పంత్ 15, క్రిస్ మోరిస్ 16 పరుగులు చేసి అవుటయ్యారు. డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 188 పరుగులు చేసింది. ఆండర్సన్ 39 (22 బంతులు, 3 ఫోర్లు, 3 సిక్సర్లు), పాట్ కమిన్స్ 12 (6 బంతులు, 2 ఫోర్లు) నాటౌట్‌గా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో గ్లేన్ మాక్స్‌వెల్ తప్ప మిగతా వారంతా కనీసం ఒక వికెట్ కూల్చారు. వరుణ్ ఆరోన్ రెండు వికెట్లు సాధించగా, సందీప్ శర్మ, మోహిత్ శర్మ, అక్షర్ పటేల్, కరియప్ప తలా ఒక వికెట్ పడగొట్టారు.
విజయానికి 189 పరుగులు సాధించాల్సిన పంజాబ్ కేవలం ఐదు పరుగుల వద్ద మొదటి వికెట్‌ను మానన్ వోహ్రా రూపంలో చేజార్చుకుంది. అతను మూడు పరుగులు చేసి, షాబాజ్ నదీం బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహాను కూడా నదీం పెవిలియన్ పంపాడు. 21 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. జట్టును ఆదుకుంటాడనుకున్న దక్షిణాఫ్రికా సీనియర్ ఆటగాడు, ఓపెనర్ హషీం ఆమ్లా 19 పరుగులు చేసి, క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో శామ్ బిల్లింగ్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 31 పరుగులకే మూడు వికెట్లు కూలడంతో పంజాబ్ సమస్యల్లో పడింది. డేవిడ్ మిల్లర్‌తో కలిసి జట్టును ఆదుకోవడానికి కొంత సేపు ప్రయత్నించిన ఇయాన్ మోర్గాన్ 22 పరుగులు చేసి, పాట్ కమిన్స్ బౌలింగ్‌లో కరుణ్ నాయర్‌కు దొరికాడు. 10 ఓవర్లలో పంజాబ్ 4 వికెట్లకు 64 పరుగులు చేయగలిగింది. రన్‌రేట్‌ను అమాంతంగా పెంచగల సామర్థ్యం ఉన్న గ్లేన్ మాక్స్‌వెల్ పరుగుల ఖాతా తెరవకుండానే, అమిత్ మిశ్రా బౌలింగ్‌లో శామ్ బిల్లింగ్స్‌కు చిక్కాడు. డేవిడ్ మిల్లర్ 24 పరుగులు చేసి కొరీ ఆండర్సన్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. స్టార్ ఆటగాళ్ల కంటే మోహిత్ శర్మ, అక్షర్ పటేల్ వీరోచిత పోరటాన్ని కొనసాగించినా ఫలితం దక్కలేదు. ఏడో వికెట్‌కు 45 పరుగులు జత కలిసిన తర్వాత పాక్ కమిన్స్ బౌలింగ్‌లో మోహిత్ శర్మ (13) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రిస్ మోరిస్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ మొదటి బంతికి కరియప్ప (1) అవుటయ్యాడు. అదే ఓవర్ చివరి బంతిలో బౌల్డ్ అయిన అక్షర్ పటేల్ 29 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లతో 44 పరుగులు చేశాడు. పంజాబ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. ఈ టోర్నమెంట్‌లో డేర్‌డెవిల్స్‌కు ఇది రెండో విజయం.
సంక్షిప్త స్కోర్లు
ఢిల్లీ డేర్‌డెవిల్స్: 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 (శామ్ బిల్లింగ్స్ 55, శ్రేయాస్ అయ్యర్ 22, కొరీ ఆండర్సన్ 39 నాటౌట్, వరుణ్ ఆరోన్ 2/45).
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్: 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 (అక్షర్ పటేల్ 44, డేవిడ్ మిల్లర్ 24, ఇయాన్ మోర్గాన్ 22, క్రిస్ మోరిస్ 3/23, షాబాజ్ నదీం 2/13, పాట్ కమిన్స్ 2/23).