క్రీడాభూమి

పరుగుల వేటలో సన్‌రైజర్స్ విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 15: ఈడెన్ గార్డెన్స్ మైదానంలో శనివారం జరిగిన పదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్ 14వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 17 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. హోం గ్రౌండ్‌లో ఆడిన కోల్‌కతా నైట్ రైడర్స్ తొలుత బ్యాటింగ్‌లో, ఆతర్వాత బౌలింగ్‌లో ఆధిపత్యాన్ని కొనసాగించింది. బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్నదన్న ధీమాతో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ వ్యూహం బెడిసికొట్టింది. పరుగుల వేటలో విఫలమైన ఈ జట్టు 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక, 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 155 పరుగులు చేయగలిగింది.
ప్రత్యర్థి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేపట్టిన నైట్ రైడర్స్ 10 పరుగుల స్కోరువద్ద మొదటి వికెట్‌ను సునీల్ నారైన్ రూపంలో కోల్పోయింది. తొమ్మిది బంతులు ఎదుర్కొని, ఆరు పరుగులు చేసిన అతనిని భువనేశ్వర్ కుమార్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎవరి ఊహకు అందని రీతిలో నారైన్‌ను తనకు ఓపెనింగ్ పార్ట్‌నర్‌గా ఎంచుకొని నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అతని వ్యూహం సరైనదేనన్న రీతిలో నారైన్ రాణించాడు. 18 బంతుల్లోనే 37 పరుగులు చేసి, నైట్ రైడర్స్ ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశాడు. అయితే, స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ను కాదని, టెయిలెండర్‌ను ఓపెనర్‌గా దించితే ఎప్పుడూ ఒకే రకమైన ఫలితాలు రాబట్టలేమని శనివారం నాటి మ్యాచ్‌లో స్పష్టమైంది. నారైన్ ఎలాంటి ప్రత్యేకత లేని ఒక సాధారణ బంతికి బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ గంభీర్ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. 16 బంతులు ఎదుర్కొని 15 పరుగులు చేసిన అతనిని రషీద్ ఖాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 40 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన దశలో జట్టును ఆదుకునే బాధ్యతను వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ రాబిన్ ఉతప్ప, మనీష్ పాండే స్వీకరించారు. ఇద్దరూ సన్‌రైజర్స్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ, మూడో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. 35 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 46 పరుగులు చేసిన మనీష్ పాండేను డేవిడ్ వార్నర్ క్యాచ్ అందుకోగా భువనేశ్వర్ కుమార్ అవుట్ చేయడంతో నైట్ రైడర్స్ మూడో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో ఉన్నంత సేపు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన రాబిన్ ఉతప్ప 68 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద బెన్ కట్టింగ్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు చిక్కాడు. 39 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ (4), కొలిన్ డి గ్రాండ్‌హోమ్ (0) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు. నైట్ రైడర్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 172 పరుగులు చేయగా, యూసుఫ్ పఠాన్ (15 బంతుల్లో 21 పరుగులు), క్రిస్ వోక్స్ (ఒక బంతిలో ఒక పరుగు) నాటౌట్‌గా నిలిచారు. సన్‌రైజర్స్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మూడు ఓవర్లలో 20 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు. ఆశిష్ నెహ్రా, బెన్ కట్టింగ్, రషీద్ ఖాన్ తలా ఒక వికెట్ కూల్చారు.
నైట్ రైడర్స్‌ను ఓడించేందుకు 173 పరుగులు చేయాల్సిన సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ వ్యూహాత్మకంగా ఆడలేకపోయారు. పరుగుల వేటలో తడబడి, ఓటమిని కొనితెచ్చుకున్నారు. కెప్టెన్ డేవిడ్ వార్నర్, యువరాజ్ సింగ్ చెరి 26 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారంటే, ఆ జట్టు పరుగులను రాబట్టుకోవడంలో విఫలమైన తీరును ఊహించడం కష్టం కాదు. శిఖర్ ధావన్ 22 బంతులు ఎదుర్కొని, 23 పరుగులు చేసి, యూసుఫ్ పఠాన్ బౌలింగ్‌లో కొలిన్ డి గ్రాండ్‌హోమ్ క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. 46 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయిన సన్‌రైజర్స్‌కు మరో 13 పరుగుల తర్వాత రెండో దెబ్బ తగిలింది. వార్నర్ 30 బంతుల్లో 26 పరుగులు చేసి, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్రిస్ వోక్స్‌కు చిక్కాడు. జట్టును ఒంటి చేత్తో గెలిపించే సత్తావున్న హార్డ్ హిట్టర్ మోజెస్ హెన్రిక్స్ కూడా ఎక్కువ సేపు పోరాడకుండానే 13 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. యువరాజ్ సింగ్ (26) కూడా వోక్స్ బౌలింగ్‌లోనే సబ్‌స్టిట్యూట్ ఆటగాడు రిషీ ధావన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీపక్ హూడా 13, బెన్ కట్టింగ్ 15 పరుగులు చేసి అవుటయ్యారు. చివరిలో వికెట్‌కీపర్ నమన్ ఓఝా (11), బిపుల్ శర్మ (21) నాటౌట్‌గా నిలిచినప్పటికీ, సన్‌రైజర్స్‌ను ఓటమి నుంచి కాపాడలేకపోయారు. ఆ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేయగలిగింది.

స్కోరుబోర్డు

కోల్‌కతా నైట్ రైడర్స్: సునీల్ నారైన్ బి భువనేశ్వర్ కుమార్ 6, గౌతం గంభీర్ బి రషీద్ ఖాన్ 15, రాబిన్ ఉతప్ప సి రషీద్ ఖాన్ బి బెన్ కట్టింగ్ 68, మనీష్ పాండే సి డేవిడ్ వార్నర్ బి భువనేశ్వర్ కుమార్ 46, యూసుఫ్ పఠాన్ 21 నాటౌట్, సూర్యకుమార్ యాదవ్ సి నమన్ ఓఝా బి ఆశిష్ నెహ్రా 4, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ బి భువనేశ్వర్ కుమార్ 0, క్రిస్ వోక్స్ 1 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 11, మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 172.
వికెట్ల పతనం: 1-10, 2-40, 3-117, 4-153, 5-163, 6-170.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 4-0-20-3, ఆశిష్ నెహ్రా 4-0-35-1, బెన్ కట్టింగ్ 4-0-41-1, రషీద్ ఖాన్ 4-0-29-1, మోజెస్ హెన్రిక్స్ 2-0-26-0, బిపుల్ శర్మ 2-0-20-0.
సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్ సి క్రిస్ వోక్స్ బి కుల్దీప్ యాదవ్ 26, శిఖర్ ధావన్ సి కొలిన్ డి గ్రాండ్‌హోమ్ బి యూసుఫ్ పఠాన్ 23, మోజెస్ హెన్రిక్స్ సి అండ్ బి క్రిస్ వోక్స్ 13, యువరాజ్ సింగ్ సి సబ్‌స్టిట్యూట్ (రిషీ ధావన్) బి క్రిస్ వోక్స్ 26, దీపక్ హూడా స్టంప్డ్ రాబిన్ ఉతప్ప బి సునీల్ నారైన్ 13, బెన్ కట్టింగ్ సి కొలిన్ డి గ్రాండ్‌హోమ్ బి ట్రెంట్ బౌల్ట్ 15, నమన్ ఓఝా 11 నాటౌట్, బిపుల్ శర్మ 21 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 7, మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 155.
వికెట్ల పతనం: 1-46, 2-59, 3-65, 4-96, 5-112, 6-129.
బౌలింగ్: ఉమేష్ యాదవ్ 3-0-27-0, ట్రెంట్ బౌల్ట్ 4-0-33-1, సునీల్ నారైన్ 4-0-18-1, కుల్దీప్ యాదవ్ 4-0-23-1, యూసుఫ్ పఠాన్ 1-0-2-1, క్రిస్ వోక్స్ 4-0-49-2.

నేటి మ్యాచ్‌లు
ముంబయ ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ లయన్స్
(ముంబయ వాంఖడే స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు మొదలు)

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రైజింగ్ పుణే సూపర్‌జెయంట్స్
(బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 8 గంటలకు ప్రారంభం)

చిత్రం... మూడు వికెట్లు పడగొట్టిన సన్‌రైజర్స్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను
అభినందిస్తున్న ఆ జట్టు వికెట్‌కీపర్ నమన్ ఓఝా