క్రీడాభూమి

ధోనీకి విషమ పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ: భారత పరిమిత ఓవర్ల జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విషమ పరీక్షను ఎదుర్కోనున్నాడు. శుక్రవారం శ్రీలంకతో జరిగే రెండో టి-20 మ్యాచ్‌లో గెలిస్తేనే టీమిండియా ఈ సిరీస్‌లో నిలబడుతుంది. లేకపోతే, పరువుతోపాటు సిరీస్‌ను కూడా కోల్పోతుంది. ఒకవైపు ఆసియా కప్, టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ టోర్నీలు వేగంగా సమీపిస్తున్నాయి. ఆ రెండు మెగా టోర్నీలకు సిద్ధమయ్యేందుకు వీలుగా శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఖరారు చేసింది. పలువురు కీలక ఆటగాళ్లు వివిధ కారణాలవల్ల అందుబాటులో లేకపోవడంతో, ఎక్కువ మంది యువ ఆటగాళ్లను లంక బరిలోకి దించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అంతగా అనుభవం లేని ఆటగాళ్లపై భారత జట్టు సులభంగా గెలుస్తుందని అందరూ ఊహించినప్పటికీ, మొదటి మ్యాచ్‌లో అందుకు పూర్తి భిన్నమైన ఫలితం వెలువడింది. పటిష్ఠమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియా 18.5 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలడం అందరినీ ఆందోళనకు గురి చేస్తున్న విషయం. టెయిలెండర్ రవిచంద్రన్ అశ్విన్ అజేయంగా 31 పరుగులు చేసి, టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతనితోపాటు సురేష్ రైనా (20), యువరాజ్ సింగ్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించగలిగారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్స్‌కే పరిమితమయ్యారు. శ్రీలంక పేసర్లు కసున్ రజిత, దసున్ శనక చెరి మూడు వికెట్లు కూల్చగా, దుష్మంత చమీరకు రెండు వికెట్లు లభించాయి. భారత బ్యాట్స్‌మెన్ విఫలమైనా, బౌలర్లు కొంత వరకైనా పోరాడతారని అనుకున్నా ఫలితం లేకపోయింది. మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే, ఐదు వికెట్లు కోల్పోయి లంక లక్ష్యాన్ని ఛేదించింది. బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఒకే రీతిలో విఫలం కావడం ధోనీని వేధిస్తున్న అంశం. టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినివ్వగా, అతను లేనికారణంగా భారత్ ఓడిందన్న వాదన కూడా బలపడుతున్నది. కెప్టెన్‌గా జట్టుకు స్ఫూర్తిదాయమైన నాయకత్వాన్ని అందించలేకపోతున్నాడన్న విమర్శలు ఎదుర్కొంటున్న ధోనీకి చాలా కాలంగా కోహ్లీ నుంచి గట్టిపోటీ ఎదురవుతున్నది. ఆసియా కప్, టి-20 వరల్డ్ కప్ తర్వాత ధోనీని కెప్టెన్సీ నుంచి ఉద్వాసన పలుకుతారన్న అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది. ధోనీ ఇప్పటికే చాలా ఎక్కువ కాలం కెప్టెన్‌గా కొనసాగాడని, అతనిని ఎంత త్వరగా తప్పిస్తే జట్టుకు అంత మంచిదని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఆసీస్ జట్టుపై టి-20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్ సాధించడం ద్వారా పెంచుకున్న ధోనీ ప్రతిష్ఠ ఇప్పుడు మరోసారి ప్రమాదంలో పడింది. యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్న శ్రీలంకతో స్వదేశంలో జరిగిన మ్యాచ్‌లోనే ఓడడం అతనిని సమస్యల ఊబిలోకి నెడుతున్నది. శుక్రవారం నాటి మ్యాచ్‌లో గెలిస్తే, సిరీస్‌ను సాధించే అవకాశాలు భారత్‌కు సజీవంగా నిలుస్తాయి. ఆ మ్యాచ్‌ని కూడా చేజార్చుకుంటే, సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోతుంది. చివరి మ్యాచ్ నామమాత్రమవుతుంది.
బ్యాట్స్‌మెన్‌కు అనుకూలం!
మొట్టమొదటిసారి టి-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తున్న జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (జెఎస్‌సిఎ) మైదానం బ్యాట్స్‌మెన్‌కు అనుకూలించే అవకాశాలున్నాయి. ఇప్పటివరకూ ఈ మైదానంలో మూడు వనే్డ ఇంటర్నేషనల్స్ జరిగాయి. దాదాపుగా అన్ని మ్యాచ్‌ల్లోనూ మూడు వందలకు పైగా పరుగులు నమోదయ్యాయి. శుక్రవారం నాటి మ్యాచ్‌లో బౌలర్లపై బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం కనబడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కాగా, మొదటిసారి టి-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌కి వేదికైన జెఎస్‌సిఎ మైదానంలో ఇంకా చాలాచోట్ల పచ్చికలేని ఖాళీ ప్రాంతాలు కనిపిస్తున్నాయి. తగినంత సమయం లేకపోవడంవల్లే పిచ్‌ని పూర్తిగా సన్నద్ధం చేయలేకపోయామని అధికారులు అంటున్నారు. తగినంతంగా పచ్చిక లేకపోవడం వల్ల అవుట్‌ఫీల్డ్‌లో బంతి వేగాన్ని కోల్పోయే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. తగినంత గడ్డిలేకపోవడంతో ఎదురయ్యే సమస్యలను పరిగణలోకి తీసుకుంటే మాత్రం పరుగుల కోసం బ్యాట్స్‌మెన్ విపరీతంగా శ్రమించాల్సి ఉంటుంది.
నిలకడలేమితో కష్టాలు
నిలకడలేని ఆటతో భారత జట్టు కష్టాలను కొనితెచ్చుకుంటున్నది. గతంలో అనేక పర్యాయాలు ఇదే అంశం తెరపైకి వచ్చింది. ప్రతిసారీ ఒకరిద్దరు మాత్రమే రాణించడం, మిగతా వారంతా మూకుమ్మడిగా విఫలం కావడం టీమిండియాకు ఆనవాయితీగా మారింది. కాగితంపై చూస్తే శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, ఆజింక్య రహానే, సురేష్ రైనా, యువరాజ్ సింగ్ వంటి మేటి బ్యాట్స్‌మెన్ అండ జట్టుకు ఉంది. కెప్టెన్ ధోనీ కూడా బ్యాటింగ్‌లో సమర్థుడే. కానీ, లంకతో జరిగిన మొదటి టి-20లో టాప్‌క్లాస్ బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమయ్యారు. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ టీమిండియా నీరుగారిపోయింది. టాప్ ఆర్డర్ ఈ విధంగా పతనం కావడం, వారితో పోటీపడుతూ బౌలర్లు పసలేని బంతులతో తేలిపోవడం భారత ఆటగాళ్లలో నిలకడలేమి అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. ఈ సమస్య నుంచి బయటపడితేగానీ భారత జట్టు పరాజయాల ఊబిలో నుంచి బయటపడదు.
లంకకు నష్టం లేదు!
భారత్‌తో శుక్రవారం జరిగే టి-20 మ్యాచ్‌లో గెలిస్తే దినేష్ చండీమల్ నాయకత్వంలోని శ్రీలంక మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంటుంది. ఒకవేళ ఓడినా ఆ జట్టుకు వచ్చే నష్టమేమీ ఉండదు. ఇరు జట్లు సమవుజ్జీగా నిలుస్తాయి. సిరీస్ ఫలితం తేలడానికి చివరి మ్యాచ్ కీలకమవుతుంది. లసిత్ మలింగ, ఏంజెలో మాథ్యూస్ వంటి సీనియర్లు లేని కారణంగా ఎక్కువ మంది యువ ఆటగాళ్లతో భారత్‌లోకి అడుగుపెట్టిన చండీమల్ సేన నుంచి ఎవరూ అద్భుతాలను ఆశించడం లేదు. సిరీస్‌ను కోల్పోయినా ఎవరూ తప్పుపట్టరు. ఆ జట్టు ఒక మ్యాచ్‌ని గెలవడమే గొప్ప.