క్రీడాభూమి

గంభీర్ కెప్టెన్ ఇన్నింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 28: ఈడెన్ గార్డెన్స్ మైదానంలో శుక్రవారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 గ్రూప్ మ్యాచ్‌లో గౌతం గంభీర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్‌కు సునాయాస విజయాన్ని సాధించిపెట్టాడు. ప్రత్యర్థిని 160 పరుగులకు కట్టడి చేసిన నైట్ రైడర్స్ ఆతర్వాత మరో 22 బంతులు మిగిలి ఉండగానే, మూడు వికెట్ల నష్టంతో లక్ష్యాన్ని ఛేదించింది. నైట్ రైడర్స్‌కు ఇది తొమ్మిదో మ్యాచ్‌కాగా ఏడో విజయం. పాయింట్ల పట్టికలో ఈ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతున్నది. డేర్‌డెవిల్స్ ఏడు మ్యాచ్‌ల్లో ఐదో పరాజయాన్ని మూటగట్టుకొని, పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. ఈ జట్టు ఆటగాళ్లు సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్‌లో, నాథన్ కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో రాణించినప్పటికీ నైట్ రైడర్స్ ప్రతిభ ముందు వారి శ్రమకు ఫలితం లేకపోయింది.
టాస్ గెలిచి ఫీల్డింగ్
నైట్ రైడర్స్ కెప్టెన్ గంభీర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీనితో మొదట బ్యాటింగ్‌కు దిగిన డేర్‌డెవిల్స్‌కు ఓపెనర్లు సంజూ శాంసన్, కరుణ్ నాయర్ 48 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 17 బంతులు ఎదుర్కొని 15 పరుగులు చేసిన నాయర్‌కు సునీల్ నారైన్ ఎల్‌బిగా అవుట్ చేయడంతో నైట్ రైడర్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఫస్ట్‌డౌన్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌తో కలిసి సంజూ శాంసన్ డేర్‌డెవిల్స్ స్కోరుబోర్డును వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. వీరిద్దరూ సంయమనంతో ఆడుతూ రెండో వికెట్‌కు అత్యంత కీలకమైన 75 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. జట్టు స్కోరు 123 పరుగుల వద్ద ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాన సంజూ శాంసన్ మొత్తం 38 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 60 పరుగులు సాధించాడు. ఆతర్వాత డేర్‌డెవిల్స్ ఆటపై పట్టు కోల్పోయింది. రిషభ్ పంత్ కేవలం ఆరు పరుగులు చేసి, నాథన్ కౌల్టన్ నైల్ బౌలింగ్‌లో ఎల్‌బికాగా, అర్ధ శతకానికి చేరువైన శ్రేయస్ అయ్యర్ (34 బంతుల్లో 47, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్)ను కూడా అతను అదే రీతిలో అవుట్ చేశాడు. కొరీ ఆండర్సన్ (2), క్రిస్ మోరిస్ (11) పరుగుల వేటలో విఫలమై, వికెట్లు పారేసుకున్నారు. డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసింది. అంకిత్ బావ్వే 12 బంతుల్లో 12 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. అతనితోపాటు నాటౌట్‌గా నిలిచిన పాట్ కమిన్స్‌కు ఒక్క బంతిని ఎదుర్కొనే అవకాశం కూడా రాలేదు. నైట్ రైడర్స్ పేసర్ కౌల్టన్ నైల్ 34 పరుగులకకు మూడు వికెట్లు సాధించాడు. ఉమేష్ యాదవ్, సునీల్ నారైన్ చెరొక వికెట్ పడగొట్టారు.
రెండో ఓవర్‌లోనే తొలి వికెట్
డేర్‌డెవిల్స్‌ను ఓడించేందుకు 161 పరుగులు సాధించాల్సిన నైట్ రైడర్స్ రెండో ఓవర్‌లోనే సునీల్ నారైన్ వికెట్ కోల్పోయింది. నాలుగు బంతుల్లో నాలుగు పరుగులు చేసిన అతనిని కాగిసో రబదా క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే, ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలినప్పటికీ వెనుకంజ వేయని నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్, ఫస్ట్‌డౌన్ ఆటగాడు రాబిన్ ఉతప్ప ప్రత్యర్థి బౌలింగ్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడుతూ పరుగులు రాబట్టారు. వీరు రెండో వికెట్‌కు 11 ఓవర్లలో 108 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 117 పరుగుల వద్ద ఉతప్ప రనౌటయ్యాడు. 33 బంతులు ఎదుర్కొని, 59 పరుగులు చేసిన అతని స్కోరులో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. మనీష్ పాండే కేవలం ఐదు పరుగులకే రబదా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. థర్డ్‌డౌన్ ఆటగాడు షెల్టన్ జాక్సన్‌తో కలిసి మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడిన గంభీర్ 16.2 ఓవర్లలోనే గెలిపించాడు. నైట్ రైడర్స్ మూడు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసే సమయానికి గంభీర్ 71 (52 బంతులు, 11 ఫోర్లు), షెల్డన్ జాక్సన్ 12 (5 బంతులు, రెండు ఫోర్లు) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కూలిన వికెట్లలో ఒకటి రనౌట్‌కాగా, మిగతా 2 వికెట్లు రబదాకు లభించాయి.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ ఈ టోర్నమెంట్‌లో ఇప్పటి వరకూ ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు. అతను ఇంత వరకూ తొమ్మిది మ్యాచ్‌లు ఆడి 376 పరుగులు సాధించాడు. ఇదే జట్టు వికెట్‌కీపర్ రాబిన్ ఉతప్ప 331 పరుగులతో రెండో స్థానంలో ఉండగా, గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేష్ రైనా 8 మ్యాచ్‌ల్లో 309 పరుగులు చేసి, మూడో స్థానాన్ని ఆక్రమించాడు.

సంక్షిప్త స్కోర్లు
ఢిల్లీ డేర్‌డెవిల్స్: 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 (సంజూ శాంసన్ 60, శ్రేయస్ అయ్యర్ 47, నాథన్ కౌల్టన్ నైల్ 3/34, సునీల్ నారైన్ 1/25).
కోల్‌కతా నైట్ రైడర్స్: 16.2 ఓవర్లలో 3 వికెట్లకు 161 (గంభీర్ 71, రాబిన్ ఉతప్ప 59, కాగిసో రబదా 2/20).

చిత్రాలు..డేర్‌డెవిల్స్ టాప్ స్కోరర్ సంజూ శాంసన్
*ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్‌కు తిరుగులేని విజయాన్ని సాధించిపెట్టి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న గౌతం గంభీర్