క్రీడాభూమి

కోహ్లీ సేన ఫ్లాప్ షో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే చేతిలో చావుదెబ్బతిన్న బెంగళూరు

పుణే, ఏప్రిల్ 29: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ఫ్లాప్‌ల మీద ఫ్లాప్‌లతో అభిమానులను నిరాశ పరుస్తున్నది. నిరుటి రన్నరప్‌గా ఈసారి బరిలోకి దిగిన కోహ్లీ సేన మొదటి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైంది. ఆతర్వాత మరో ఎనిమిది మ్యాచ్‌లు ఆడి, రెండింటిని మాత్రమే గెల్చుకొని, ఐదు పరాజయాలను ఎదుర్కొంది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. కాగా, శనివారం రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. మొత్తం మీద పది మ్యాచ్‌ల్లో బెంగళూరు ఏడింటిని చేజార్చుకొని, ప్లే ఆఫ్ దశకు చేరుకునే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పుణే నిర్దేశించిన 158 పరుగుల సాదాసీదా లక్ష్యాన్ని కూడా ఛేదించలేక, 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 96 పరుగులతో సరిపుచ్చుకొని, 61 పరుగుల తేడాతో చావుదెబ్బ తిన్నది. కోహ్లీ ఒంటరి పోరాటం జరిపి అర్ధ శతకం సాధించగా, మిగతా వారంతా సింగిల్ డిజిట్స్ పరిమితమై, బెంగళూరు ఓటమికి కారణమయ్యారు.
అదే తప్పు..
టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ కోహ్లీ పాత తప్పునే పునరావృతం చేశాడు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ, అందరూ ఏక మొత్తంగా విఫలమవుతున్నారన్న విషయం తెలిసికూడా, టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీనితో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పుణే 18 పరుగుల వద్ద ఓపెనర్, స్టార్ బ్యాట్స్‌మన్ అజింక్య రహానే వికెట్‌ను కోల్పోయింది. అతను ఎనిమిది బంతులు ఎదుర్కొని, ఆరు పరుగులు చేసి, శామ్యూల్ బద్రీ బౌలింగ్‌లో ఆడం మిల్నే క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. మరో ఓపెనర్ రాహుల్ త్రిపాఠీ 28 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 37 పరుగులు చేసి, పవన్ నేగీ బౌలింగ్‌లో కేదార్ జాదవ్‌కు చిక్కాడు. ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన మనోజ్ తివారీతో కలిసి కెప్టెన్ స్టీవెన్ స్మిత్ స్కోరుబోర్డును ముందుకు తీసుకెళ్లాడు. మూడో వికెట్‌కు 50 పరుగులు జత కలిసిన తర్వాత స్మిత్ వికెట్ కూలింది. అతను 32 బంతల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45 పరుగులు సాధించి, స్టువర్ట్ బిన్నీ బౌలింగ్‌లో ఆడం మిల్నే క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. మాజీ కెప్టెన్, వికెట్‌కీపర్ మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి మనోజ్ తివారీ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. వీరిద్దరూ చివరి వరకూ నాటౌట్‌గా నిలిచారు. పుణే 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 157 పరుగులు సాధించగా, మనోజ్ తివారీ 44 (35 బంతులు, నాలుగు ఫోర్లు, ఒక సిక్స్), ధోనీ 21 (17 బంతులు, ఒక ఫోర్, ఒక సిక్స్) చొప్పున పరుగులు చేశారు. శామ్యూల్ బద్రీ, పవన్ నేగీ, స్టువర్ట్ బిన్నీ తలా ఒక వికెట్ కూల్చారు.
పెవిలియన్‌కు క్యూ
పుణేను ఓడించి, ప్లే ఆఫ్ చేరే అవకాశాలను నిలబెట్టుకోవడానికి 158 పరుగులు సాధించాల్సిన బెంగళూరు బ్యాట్స్‌మెన్ ఏ దశలోనూ తమ బాధ్యతను సమర్థంగా పోషించలేకపోయారు. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేస్తున్నప్పటికీ, అతనికి అండగా నిలవకుండా పెవిలియన్‌కు క్యూ కట్టారు. రెండో ఓవర్ చివరి బంతికి ట్రావిస్ హెడ్ వికెట్‌తో బెంగళూరు పతనం మొదలైంది. అతను కేవలం రెండు పరుగులు చే, జయదేవ్ ఉనాద్కత్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. పరుగుల వరద సృష్టంచగల ఎబి డివిలియర్స్ మరోసారి విఫలమై మూడు పరుగులకే అవుటయ్యాడు. మనోజ్ తివారీ క్యాచ్ పట్టగా అతనిని లూకీ ఫెర్గూసన్ అవుట్ చేశాడు. జట్టును ఆదుకునే సత్తా ఉన్న మరో వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్ 12 బంతుల్లో 7 పరుగులు చేసి రనౌటయ్యాడు. సచిన్ బేబీ 2, స్టువర్ట్ బిన్నీ 1, పవన్ నేగీ 3, ఆడం మిల్నే 5, శామ్యూల్ బద్రీ 2 పరుగులు చేసి వెనుదిరిగారు. చివరిలో శ్రీనాథ్ అరవింద్ 8, యుజువేంద్ర చాహల్ 4 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, బెంగళూరు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 96 పరుగులతో సరిపుచ్చి, 61 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. కనీసం వంద పరుగుల మైలురాయిని చేరలేకపోయినప్పటికీ, ఆలౌట్ కాకుండా నిలవడం, కోహ్లీ అర్ధ శతకం సాధించడం మినహా బెంగళూరు ఇన్నింగ్స్‌లో చెప్పుకోదగ్గ అంశాలేవీ లేవు. పుణే బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి, బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ప్రత్యేకించి లాకీ ఫెర్గూసన్ చూపిన విశేష ప్రతిభ పుణే విజయంలో కీలక పాత్ర పోషించింది. నాలుగు ఓవర్లు బౌల్ చేసిన అతను కేవలం ఏడు పరుగులిచ్చి, రెండు వికెట్లు కూల్చాడు. ఇమ్రాన్ తాహిర్ 18 పరుగులకు మూడు వికెట్లు సాధించాడు. జయదేవ్ ఉనాద్కత్, డానియల్ క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్ తలా ఒక వికెట్ తమతమ ఖాతాల్లో వేసుకున్నారు.

అర్ధ శతకం సాధించినా, బెంగళూరును ఓటమి నుంచి తప్పించలేక
పోయన విరాట్ కోహ్లీ

* ఎబి డివిలియర్స్ ఈ మ్యాచ్‌లో కేవలం మూడు పరుగులు చేశాడు. దీని కంటే ముందు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 8, 5 పరుగులకు ఆవుటయ్యాడు. అతను ఐపిఎల్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్ దాటలేకపోవడం ఇదే మొదటిసారి.

ప్లే ఆఫ్ చేజారింది!
ఈసారి ఐపిఎల్‌లో ప్లే ఆఫ్ దశకు చేరే అవకాశాన్ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దాదాపుగా కోల్పోయింది. ఈ జట్టు ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ముంబయి ఇండియన్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్లతో తలపడే బెంగళూ ఈ నాలుగింటినీ గెల్చుకుంటే ఎనిమిది పాయింట్లు సంపాదిస్తుంది. ఇప్పటికే బెంగళూరుకు రెండు విజయాలతో నాలుగు పాయింట్లు వచ్చాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ వర్షం వల్ల రద్దుకావడంతో ఒక పాయింట్ లభించింది. అంటే, ఈ జట్టు ఖాతాలో మొత్తం ఐదు పాయింట్లు ఉన్నాయి. చివరి నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచినా, బెంగళూరు పాయింట్లు 13కు చేరుతాయి. కనీసం 15 పాయింట్లు సాధించిన జట్లే ప్లే ఆఫ్‌లోకి వెళతాయి. దీనిని బట్టి చూస్తే, బెంగళూరు అనధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

సంక్షిప్త స్కోర్లు
రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్: 20 ఓవర్లలో 3 వికెట్లకు 157 (రాహుల్ త్రిపాఠీ 37, స్టీవెన్ స్మిత్ 45, మనోజ్ తివారీ 44 నాటౌట్, మహేంద్ర సింగ్ ధోనీ 21 నాటౌట్, శామ్యూల్ బద్రీ 1/31, పవన్ నేగీ 1/18, స్టువర్ట్ బిన్నీ 1/17).
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: 20 ఓవర్లలో 9 వికెట్లకు 96 (విరాట్ కోహ్లీ 55, ఇమ్రాన్ తాహిర్ 3/18, లాకీ ఫెర్గూసన్ 2/7, జయదేవ్ ఉనాద్కత్ 1/19, డానియల్ క్రిస్టియన్ 1/25, వాషింగ్టన్ సుందర్ 1/7).

నేటి మ్యాచ్‌లు
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఒ ఢిల్లీ డేర్‌డెవిల్స్
మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో మ్యాచ్ ఆదివారం సాయంత్రం 4 గంటలకు మొదలవుతుంది.
(పంజాబ్ ఇంత వరకూ 8 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించింది. ఐదు పరాజయాలను ఎదుర్కొంది. డేర్‌డెవిల్స్ ఏడు మ్యాచ్‌ల్లో రెండు గెల్చుకొని, ఐదింటిని ఓడింది).
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒ కోల్‌కతా నైట్ రైడర్స్
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ప్రారంభం.
(సన్‌రైజర్స్ 8 మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి, మూడింటిని కోల్పోగా, ఒక మ్యాచ్ రద్దయంది. నైట్ రైడర్స్ 9 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలను నమోదు చేసింది. కేవలం రెండు పరాజయాలను ఎదుర్కొంది. ఈసారి టైటిల్‌ను అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్న నైట్ రైడర్స్ ఆదివారం నాటి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్‌తో తలపడడం ఆసక్తిని రేపుతున్నది. హైదరాబాద్‌లో జరుగుతున్న మ్యాచ్ కాబట్టి సన్‌రైజర్స్‌ను ఫేవరిట్‌గా పేర్కొంటున్నారు).