క్రీడాభూమి

ప్లే ఆఫ్‌కు ముంబయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయిలో ఎండలు తీవ్రంగా ఉండడంతో, టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇటీవల బ్యాటింగ్ వైఫల్యాలతో అల్లాడిన కారణంగా, ముందు జాగ్రత్త చర్యగా ఈ మ్యాచ్‌లో శామ్యూల్ బద్రీ, సచిన్ బేబీ, స్టువర్ట్ బిన్నీని తప్పించి, వారి స్థానంలో షేన్ వాట్సన్, మన్దీప్ సింగ్, అనికేత్ చౌదరిని తుది జట్టులో తీసుకున్నాడు. కానీ, అతని ప్రయోగం ఫలించలేదు. బెంగళూరు మరో పరాజయాన్ని చవిచూసింది. టోర్నీ నుంచి నిష్క్రమించడం ఖాయమైంది. నిరుడు రన్నరప్‌గా నిలిచిన బెంగళూరు ఈసారి ప్లే ఆఫ్‌కు చేరలేకపోవడం విచిత్రం.
ముంబయి ఇండియన్స్ ఈ విజయంతో, పదో ఐపిఎల్‌లో హాట్ ఫేవరిట్‌గా మారింది. మొత్తం ఎనిమిది విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. కనీసం 15 పాయింట్లు వస్తే, ప్లే ఆఫ్‌లో చోటు దాదాపుగా ఖాయం అవుతుంది. ఇప్పటికే 16 పాయింట్లు సంపాదించిన ముంబయి ప్లే ఆఫ్‌లో స్థానాన్ని అనధికారికంగా ఖాయం చేసుకుంది.
ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ 34 బంతుల్లో అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. అప్పటికి అతని స్కోరులో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అతని సమయోచిత బ్యాటింగ్ ముంబయని గెలిపించింది.

*
ముంబయి, మే 1: రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌కు ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించిపెట్టింది. పదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నీలో పదో మ్యాచ్ ఆడిన ముంబయికి ఇది ఎనిమిదో విజయం. దీనితో మొత్తం 16 పాయింట్లు సంపాదించిన ముంబయి అనధికారికంగా ప్లే ఆఫ్‌లోకి అడుగుపెట్టగా, కోహ్లీ నాయకత్వంలోని బెంగళూరు గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. 11వ మ్యాచ్ ఆడిన ఈ జట్టుకు ఇది ఎనిమిదో పరాజయం. రెండు విజయాలు, ఒక మ్యాచ్ రద్దు కారణంగా మొత్తం ఐదు పాయింట్లు సంపాదించిన కోహ్లీ సేనకు మిగతా మూడు మ్యాచ్‌లు నామమాత్రంగానే మారాయి. ఆ మూడింటిలో గెలిచినా, ప్రత్యర్థుల ప్లే ఆఫ్ అవకాశాలను దెబ్బతీస్తుందేమోగానీ బెంగళూరుకు వచ్చే లాభం ఏమీ లేదు. ఈసారి ఐపిఎల్‌లో గ్రూప్ దశ నుంచి నిష్క్రమించే మొదటి జట్టుగా కోహ్లీ బృందం అవమానకరమైన ముద్ర వేయించుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగలిగింది. అయితే, వ్యూహాత్మకంగా ఆడిన ముంబయి మరో బంతి మిగిలి ఉండగానే, ఐదు వికెట్ల తేడాతో లక్ష్యాన్ని చేరుకొని, ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మకు ప్లేయన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు కెప్టెన్ కోహ్లీ మరో ఓపెనర్ మన్దీప్ సింగ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. వీరిద్దరూ భారీ భాగస్వామ్యాన్ని అందిస్తారనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. జట్టు స్కోరు 31 పరుగుల వద్ద మన్దీప్ వెనుదిరిగాడు. 13 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లతో 17 పరుగులు చేసిన అతనిని హార్దిక్ పాండ్య క్యాచ్ అందుకోగా కర్న్ శర్మ అవుట్ చేశాడు. మరో తొమ్మిది పరుగులకే కోహ్లీ కూడా పెవిలియన్ చేరాడు. అతను 14 బంతుల్లో, రెండు సిక్సర్ల సాయంతో 20 పరుగులు సాధించి, మిచెల్ మెక్‌క్లీనగన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు చిక్కాడు. వరుసగా మూడు ఇన్నింగ్స్‌లో సింగిల్ డిజిట్స్‌కే పరిమితమైన ఎబి డివిలియర్స్ సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్ వచ్చి, ట్రావిస్ హెడ్‌తో కలిసి స్కోరును ముందుకు దూకించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 45 పరుగులు జోడించారు. 12 పరుగులు (27 బంతులు, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు) చేసిన ట్రావిస్ హెడ్‌ను హార్దిక్ పాండ్య క్యాచ్ పట్టగా అతని సోదరుడు కృణాల్ పాండ్య అవుట్ చేశాడు. జట్టు స్కోరు వంద పరుగుల మైలురాయి దాటిన తర్వాత డివిలియర్స్ వికెట్ కూడా కూలింది. అతను 27 బంతులు ఎదుర్కొని 43 పరుగులు చేసి, కృణాల్ పాండ్య బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రాకు దొరికిపోయాడు. అతని స్కోరులో మూడు ఫోర్లు, మరో మూడు సిక్సర్లు ఉన్నాయి. షేన్ వాట్నస్ కేవలం మూడు పరుగులకే జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో బౌల్డ్‌కాగా, ధాటిగా ఆడిన పవన్ నేగీ 23 బంతులు ఎదుర్కొని, ఒక ఫోర్, మూడు సిక్సర్లతో 35 పరుగులు సాధించి, మిచెల్ మెక్‌క్లీనగన్ బౌలింగ్‌లో కీరన్ పొలార్డ్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 22 బంతుల్లో 28 పరుగులు చేసిన కేదార్ జాదవ్ కూడా నేగీ మాదిరిగానే మిచెల్ మెక్‌క్లీనగన్ బౌలింగ్‌లో కీరన్ పొలార్డ్ క్యాచ్ అందుకోవడంతో వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ చివరి బంతిని శ్రీనాథ్ అరవింద్ రనౌటయ్యాడు. బెంగళూరు ఆరు వికెట్లుక 162 పరుగులు చేయగా, ఆడం మిల్నే పరుగుల ఖాతా తెరవకుండా క్రీజ్‌లో ఉన్నాడు. ముంబయి బౌలర్ మిచెల్ మెక్‌క్లీనగన్ నాలుగు ఓవర్లలో 34 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కృణాల్ పాండ్య 34 పరుగులకు రెండు వికెట్లు సాధించాడు. జస్‌ప్రీత్ బుమ్రా, కర్న్ శర్మ చెరొక వికెట్ పంచుకున్నారు.
తొలి బంతికే వికెట్
హోం గ్రౌండ్‌లో బెంగళూరను ఓడించి, ప్లే ఆఫ్‌లో స్థానం సంపాదించేందుకు 163 పరుగులు సాధించాల్సి ఉండగా, ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్ తొలి బంతికే పార్థీవ్ పటేల్ వికెట్ కోల్పోయింది. అనికేత్ చౌదరి బౌలింగ్‌లో అతను యుజువేంద్ర చాహల్ క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. అనంతరం జొస్ బట్లర్, నితీష్ రాణా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. బెంగళూరు బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న వీరు రెండో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. 21 బంతులు ఎదుర్కొన్న బట్లర్ నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 33 పరుగులు సాధించి, పవన్ నేగీ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. మరో తొమ్మిది పరుగుల తర్వాత నితీష్ రాణా వికెట్ కూడా కూలింది. అతను 28 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లతో 27 పరుగులు చేసి, పవన్ నేగీ బౌలింగ్‌లోనే, ట్రావిస్ హెడ్‌కే క్యాచ్ అందించి వెనుదిరిగాడు. కెప్టెన్ రోహిత్ శర్మ క్రీజ్‌లో నిలదొక్కుకోగా, కీరన్ పొలార్డ్ 13 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లతో 17 పరుగులు చేసి, యుజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. అంతకు ముందు ఫీల్డింగ్ చేస్తూ వెన్నునొప్పితో కిందపడి అల్లాడిన కృణాల్ పాండ్య బ్యాటింగ్‌కు దిగినప్పటికీ, రెండు పరుగులు చేసిన తర్వాత రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. కర్న్ శర్మ ఎనిమిది బంతుల్లో 9 పరుగులు చేసి, షేన్ వాట్సన్ బౌలింగ్‌లో ఆడం మిల్నేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఐదో వికెట్ కూలిన తర్వాత మైదానంలోకి వచ్చిన హార్దిక్ పాండ్యతో కలిసి రోహిత్ శర్మ వ్యూహాత్మకంగా ఆడుతూ జట్టును లక్ష్యం దిశగా నడిపాడు. చివరి రెండు ఓవర్లలో ముంబయి విజయానికి 18 పరుగుల దూరంలో నిలవడంతో కొంత సేపు ఉత్కంఠ చోటు చేసుకుంది. అయితే, శ్రీనాథ్ అరవింద్ వేసిన ఓవర్‌లో 11 పరుగులను రాబట్టడంతో, ముంబయికి చివరి ఓవర్‌లో 11 పరుగులు అవసరమయ్యాయి. ఆ ఓవర్‌ను షేన్ వాట్సన్ బౌల్ చేయగా, ఐదు బంతుల్లోనే ముంబయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ భారీ ఫోర్ కొట్టి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. 19.5 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ముంబయి 165 పరుగులు చేసి, విజయభేరి మోగించగా, రోహిత్ శర్మ 56 (37 బంతులు, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), హార్దిక్ పాండ్య 14 (9 బంతులు, ఒక సిక్సర్) క్రీజ్‌లో ఉన్నారు. పవన్ నేగీ రెండు వికెట్లు కూల్చాడు.
సంక్షిప్త స్కోర్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 (విరాట్ కోహ్లీ 20, ఎబి డివిలియర్స్ 43, కేదార్ జాదవ్ 28, పవన్ నేగీ 35, మిచెల్ మెక్‌క్లీనగన్ 3/34, కృణాల్ పాండ్య 2/34).
ముంబయి ఇండియన్స్: 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 165 (జొస్ బట్లర్ 33, నితీష్ రాణా 27, రోహిత్ శర్మ 56 నాటౌట్, పవన్ నేగీ 2/17).

చిత్రాలు..కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ముంబయని గెలిపించిన రోహిత్ శర్మ
*మూడు వరుస వైఫల్యాల తర్వాత మళ్లీ ఫామ్‌లోకి వచ్చి 43 పరుగులు సాధించిన బెంగళూరు బ్యాట్స్‌మన్ ఎబి డివిలియర్స్