క్రీడాభూమి

శ్రేయాస్ చేజారిన సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, మే 10: పదో ఐపిఎల్ ఎలాంటి ప్రాధాన్యత లేని మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్‌పై ఢిల్లీ డేర్‌డెవిల్స్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. శేయాస్ అయ్యర్ నాలుగు పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయినప్పటికీ, డేర్‌డెవిల్స్ విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. డేర్‌డెవిల్స్‌కు ఇది 12వ మ్యాచ్‌కాగా, ఐదో విజయం. దీనితో ఆ జట్టు పాయింట్లు పదికి చేరుకున్నాయి. ఇంకా రెండు గ్రూప్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఒకవేళ ఆ రెంటినీ గెల్చుకున్నప్పటికీ ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లు చేరుతాయి. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 15 పాయింట్లు ఉన్న కారణంగా, డేర్‌డెవిల్స్‌కు ప్లే ఆఫ్ చేరే అవకాశం లేదు. కాగా, 13వ మ్యాచ్ ఆడిన గుజరాత్ లయన్స్‌కు ఇది తొమ్మిదో ఓటమి. ఈ జట్టు నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లు మాత్రమే సంపాదించింది. మొత్తం మీద ఈ టోర్నీ నుంచి నిష్క్రమించడం ఇప్పటికే ఖాయమైన గుజరాత్, డేర్‌డెవిల్స్ మ్యాచ్ ఏమాత్రం ఆసక్తిని కలిగించలేకపోయింది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు గుజరాత్ 12 మ్యాచ్‌ల్లో 8, డేర్ డెవిల్స్ 11 మ్యాచ్‌ల్లో 8 చొప్పు పాయింట్లు సంపాదించి, వరుసగా ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నాయి.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న డేర్‌డెవిల్స్ తన ప్రత్యర్థి గుజరాత్‌ను సమర్థంగా కట్టడి చేయలేకపోయింది. 21 పరుగుల స్కోరువద్ద ఓపెనర్ డ్వెయిన్ స్మిత్ (8), మరో 25 తరుగుల అనంతరం కెప్టెన్ సురేష్ రైనా (6), 46 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ (34) వికెట్లు కూలినప్పటికీ, ఆ అవకాశాన్ని డేర్‌డెవిల్స్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ దినేష్ కార్తీక్, హార్డ్ హిట్టర్ అరోన్ ఫించ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 92 పరుగుల జోడించడంతో గుజరాత్ మెరుగైన స్థితికి చేరుకుంది. 28 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 40 పరుగులు చేసిన కార్తీక్‌ను కొరీ ఆండర్సన్ క్యాచ్ పట్టగా కార్లొస్ బ్రాడ్‌వెయిట్ అవుట్ చేశాడు. అప్పటికి గుజరాత్ స్కోరు 148 పరుగులు. టాప్ స్కోరర్ ఫించ్ 180 పరుగుల వద్ద అవుటయ్యాడు. అతను 39 బంతల్లోనే, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 69 పరుగులు సాధించి, మహమ్మద్ షమీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 195 పరుగులు సాధించగా, అప్పటికి రవీంద్ర జడేజా (13), జేమ్స్ ఫాల్క్‌నెర్ (14) క్రీజ్‌లో ఉన్నారు. డేర్‌డెవిల్స్ బౌలర్లలో మహమ్మద్ షమీ, పాట్ కమిన్స్, అమిత్ మిశ్రా, కార్లొస్ బ్రాత్‌వెయిట్ తలా ఒక్కో వికెట్ కూల్చారు.
పరువు దక్కించుకోవడంతోపాటు, అదృష్టం కలిసొస్తే మిగతా రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలను సాధించడం ద్వారా పరువు నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఇన్నింగ్స్ ఆరంభించిన డేర్‌డెవిల్స్ 15 పరుగుల స్కోరువద్ద సంజూ శాంసన్ వికెట్‌ను కోల్పోయింది. అతను 10 పరుగులు చేసి ప్రదీప్ సంగ్వాన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. యువ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ కేవలం నాలుగు పరుగులు చేసి రనౌట్‌కాగా, కరుణ్ నాయర్ 30 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద గేమ్స్ ఫాల్క్‌నెర్ బౌలింగ్‌లో డ్వెయిన్ స్మిత్‌కు దొరికాడు. శ్రేయాస్ అయ్యర్ క్రీజ్‌లో నిలదొక్కుకోగా, మార్లొన్ శామ్యూల్స్ (1), కొరీ ఆండర్సన్ (6) రనౌటయ్యారు. కార్లొస్ బ్రాత్‌వెయిట్ 11 పరుగులు చేసిన తర్వాత ధవళ్ కులకర్ణి బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఏడో వికెట్‌కు శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి 61 పరుగులు జోడించిన పాట్ కమిన్స్ 182 పరుగుల వద్ద జేమ్స్ ఫాల్క్‌నెర్ బౌలింగ్‌లో డ్వెయిన్ స్మిత్ క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. ఏడో వికెట్ కూలిన తర్వాత మహమ్మద్ షమీ క్రీజ్‌లోకి దిగాడు. బాధ్యతాయుతంగా ఆడిన శ్రేయాస్ అయ్యర్ జట్టును చివరి ఓవర్‌లో విజయానికి తొమ్మిది పరుగుల దూరంలో నిలిపాడు. అయితే, బాసిల్ థంపి వేసిన చివరి ఓవర్ రెండో బంతికి అతని వికెట్ కూలింది. 57 బంతులు ఎదుర్కొని, 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 96 పరుగులు చేసిన అతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికి డేర్‌డెవిల్స్‌కు నాలుగు బంతుల్లో ఏడు పరుగుల అవసరం ఏర్పడింది. బ్యాటింగ్‌కు వచ్చిన అమిత్ మిశ్రా తాను ఎదుర్కొన్న మొదటి బంతిని బౌండరీకి తరలించాడు. ఆ వెంటనే మరో ఫోర్ కొట్టి డేర్‌డెవిల్స్‌ను గెలిపించాడు.
సంక్షిప్త స్కోర్లు
గుజరాత్ లయన్స్: 20 ఓవర్లలో 5 వికెట్లకు 195 (ఇషాన్ కిషన్ 34, దినేష్ కార్తీక్ 40, ఆరోన్ ఫించ్ 69).
ఢిల్లీ డేర్‌డెవిల్స్: 19.4 ఓవర్లలో 8 వికెట్లకు 197 (శ్రేయాస్ అయ్యర్ 96, కరుణ్ నాయర్ 30).

ఢిల్లీ డేర్‌డెవిల్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రేయాస్ అయ్యర్ సెంచరీని పూర్తి చేయలేకపోయనప్పటికీ, తన టి-20 ఫార్మాట్ కెరీర్‌లో అత్యధిక స్కోరు నమోదు చేశాడు. ముస్తాక్ సయ్యద్ అలీ టోర్నమెంట్‌లో ముంబయ తరఫున అతను విదర్భపై 86 పరుగులు చేయగా, ఈ మ్యాచ్‌లో 96 పరుగులు సాధించాడు.
పదో ఐపిఎల్‌లో గుజరాత్ లయన్స్ మొదట బ్యాటింగ్ చేసినప్పుడు కేవలం ఒక మ్యాచ్‌ని మాత్రమే గెల్చుకుంది. మొత్తం మీద రెండు ఐపిఎల్ సీజన్స్‌లో ఈ జట్టు 12 పర్యాయాలు మొదట బ్యాటింగ్‌కు దిగి, ఒకసారి మాత్రమే గెలవగలిగింది. ఈ మ్యాచ్‌లో డేర్‌డెవిల్స్ టాస్ గెలవడంతో గుజరాత్ మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. గొప్పగా ఆడినప్పటికీ ఫలితం లేకపోయంది.

చిత్రం.. శ్రేయాస్ అయ్యర్