క్రీడాభూమి

టాప్ సీడ్ కెర్బర్‌కు మకరోవా షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, మే 28: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మొదటి రోజే సంచలన ఫలితం నమోదైంది. మహిళల సింగిల్స్‌లో జర్మనీకి చెందిన టాప్ సీడ్ ఏంజెలిక్ కెర్బర్ మొదటి రౌండ్‌లోనే ఓటమిపాలై నిష్క్రమించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 45వ స్థానంలో ఉన్న రష్యా క్రీడాకారిణి ఎకతరీన మకరోవా 6-2, 6-2 తేడాతో విజయభేరి మోగించి, కెర్బర్‌కు షాకిచ్చింది. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకూ కెర్బర్ అన్యమనస్కంగా ఆడినట్టు కనిపించింది. ఏ దశలోనూ ఆమె మకరోవాకు గట్టిపోటీనివ్వలేదు. పదేపదే తప్పులు చేస్తూ పేలవమైన ఆటతో అభిమానులను నిరాశపరచింది. మరోవైపు, ఎలాంటి అంచనాలు లేని మకరోవా మొదటి రౌండ్‌లోనే ప్రపంచ నంబర్ వన్‌ను ఢీకొనాల్సి రావడంతో, అమీతుమీ తేల్చుకోవడమే లక్ష్యంగా పోరాడింది. సర్వశక్తులు ఒడ్డడంతో, ఆమె దూకుడుకును అడ్డుకోవడం కెర్బర్‌కు అసాధ్యంగా మారింది. ఎవరూ ఊహించని రీతిలో మకొరోవా గెలవడం, ఈసారి రోలాండ్ గారోస్‌లో మహిళల టైటిల్ ఎవరిని వరిస్తుందనే విషయంపై ఉత్కంఠను రెట్టింపు చేస్తున్నది. ప్రపంచ రెండో ర్యాంక్‌లో ఉన్న సెరెనా విలియమ్స్ గర్భవతి కావడంతో ఆమె ఈసారి ఫ్రెంచ్ ఓపెన్‌కు రాలేదు. మరో స్టార్ క్రీడాకారిణి మరియా షరపోవాకు వైల్డ్‌కార్డ్‌ను జారీ చేయడానికి నిర్వాహకులు నిరాకరించారు. ఇప్పుడు కెర్బర్ కూడా వెనుదిరగడంతో, టైటిల్ ఫేవరిట్ ఎవరన్నది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. కాగా, మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ స్వెత్లానా కుజ్నెత్సొవా 7-5, 6-4 తేడాతో క్రిస్టినా మెక్‌హాలేను ఓడించి రెండో రౌండ్ చేరింది.
పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో హరాసియో జెబలస్ 7-5, 6-3, 6-4 ఆధిక్యంతో ఆడ్రియన్ మనారియోను ఓడించి, ముందంజ వేశాడు. మరో మ్యాచ్‌లో అన్‌సెడెడ్ ఆటగాడు గులెర్మో గార్సియా లొపెజ్ 7-6, 6-7, 6-2, 6-2 ఆధిక్యంతో 26వ సీడ్ గిలెస్ ముల్లర్‌పై గెలిచాడు. మొదటి రెండు సెట్లు హోరాహోరీగా సాగినప్పటికీ, చివరి రెండు సెట్లు ఏక పక్షంగా ముగిశాయి. కారెనో బస్టా 6-4, 6-2, 6-2 ఆధిక్యంతో మేయర్‌పై గెలుపొందగా, గ్రిగర్ దిమిత్రోవ్ 6-2, 6-3, 6-4 స్కోరుతో స్ట్ఫోన్ రాబర్ట్‌ను ఓడించి ముందంజ వేశాడు.

ఫ్రెంచ్ ఓపెన్‌ను మినహాయిస్తే, ఎకతరీన మకరోవా మిగతా మూడు గ్రాండ్ శ్లామ్స్‌తోపాటు, దాదాపుగా అన్ని మేజర్ టోర్నీల్లోనూ కనీసం క్వార్టర్ ఫైనల్స్ చేరింది. అంతర్జాతీయ టెన్నిస్‌లో ఎంతో అనుభవం ఉన్న ఆమె ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ మొదటి రోజే సంచలనం సృష్టించింది.