క్రీడాభూమి

సెమీ ఫైనల్‌కు భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నెగ్గిన భారత్ సెమీ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను ఢీకొననుంది. గ్రూప్ టాపర్‌గా ఉన్న టీమిండియా ఫైనల్‌లో స్థానం కోసం, మరో గ్రూప్‌లోని రెండో స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్‌తో తలపడాలి.

కెన్నింగ్టన్ ఓవల్ (లండన్), జూన్ 11: చాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం జరిగిన అత్యంత కీలక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఢీకొన్న టీమిండియా ఇంకా 72 బంతులు మిగిలి ఉండగానే, ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసి, సెమీస్‌కు దూసుకెళ్లింది. ప్రత్యర్థిని 191 పరుగులకే ఆలౌట్ చేసిన విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత్ ఆతర్వాత బ్యాటింగ్‌లో తిరుగులేని ఆధిక్యాన్ని కనబరచింది. 38 ఓవర్లలో రెండు వికెట్లకు 193 పరుగులు సాధించింది. శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ అర్ధ శతకాలతో రాణించి, టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు.
టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉందన్న ధీమా ఒకవైపు, పిచ్ తీరు ఏ విధంగా ఉంటుందో అంచనా వేయడానికి అవకాశం కలుగుతుందన్న ఆలోచన మరోవైపు కోహ్లీని ఛేజింగ్ వైపు మొగ్గు చూపేలా చేశాయి. కాగా, ప్రత్యర్థి ఆహ్వానంతో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు క్వింటన్ డి కాక్, హషీం ఆమ్లా చక్కటి ఆరంభాన్నిచ్చారు. భారత బౌలింగ్‌ను ఎంతో జాగ్రత్తగా ఆడుతూ స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. మొదటి వికెట్‌కు 76 పరుగులు జత కలిసిన తర్వాత ఈ భాగస్వామ్యానికి అశ్విన్ తెరదించాడు. 54 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 35 పరుగులు చేసిన ఆమ్లాను అతను వికెట్‌కీపర్ ధోనీ క్యాచ్ పట్టగా అవుట్ చేశాడు. ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఫఫ్ డు ప్లెసిస్‌తో కలిసి రెండో వికెట్‌కు 40 పరుగులు జోడించిన డికాక్ తన అర్ధ శతకం పూర్తయిన వెంటనే పెవిలియన్ చేరాడు. పిచ్ తీరును అర్థం చేసుకొని, ఎలాంటి తొందరపాటును ప్రదర్శించకుండా ఆడిన అతను 72 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లతో 53 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. కెప్టెన్ ఎబి డివిలియర్స్ 12 బంతుల్లో 16 పరుగులు చేసి దురదృష్ట వశాత్తు రనౌటయ్యాడు. హార్డ్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ (1) కూడా రనౌటై దక్షిణాఫ్రికా కష్టాలను పెంచాడు. బాధ్యతాయుతంగా ఆడుతూ 50 బంతుల్లో 36 పరుగులు చేసిన ఫఫ్ డు ప్లెసిస్‌ను హార్దిక్ పాండ్య క్లీన్ బౌల్డ్ చేయడంతో దక్షిణాఫ్రికా ప్రతిఘటన దాదాపుగా ముగిసింది. లోయర్ మిడిల్ ఆర్డర్‌లో జీన్ పాల్ డుమినీ (20 నాటౌట్) ఒంటరి పోరాటం సాగించగా, క్రిస్ మోరిస్ (4), ఆండిల్ ఫ్లెహ్లూక్వాయో (4), కాగిసో రబదా (5), మోర్న్ మోర్కెల్ (0), ఇమ్రాన్ తాహిర్ (1) సింగిల్ డిజిట్స్‌కే పరిమితమయ్యారు. దీనితో దక్షిణాఫ్రికా 44.3 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌటైంది. భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా చెరి రెండు వికెట్లు పడగొట్టగా, అశ్విన్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజాలకు తలా ఒక వికెట్ లభించింది.
అలవోకగా..
దక్షిణాఫ్రికాను ఓడించి, సెమీ ఫైనల్ చేరేందుకు 192 సాధించాల్సిన టీమిండియా ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఆడింది. 23 పరుగుల స్కోరువద్ద రోహిత్ శర్మ (12) వికెట్‌ను కోల్పోయినప్పటికీ, ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన విరాట్ కోహ్లీతో కలిసి శిఖర్ ధావన్ స్కోరు బోర్డును పరుగులు తీయించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 128 పరుగులు జోడించి, భారత్ విజయాన్ని ఖాయం చేశారు. ధావన్ 83 బంతులు ఎదుర్కొని, 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 78 పరుగులు సాధించి, ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌లో ఫఫ్ డు ప్లెసిస్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన యువరాజ్ సింగ్‌తో కలిసి కోహ్లీ అలవోకగా టీమిండియాకు విజయాన్ని అందించాడు. 38 ఓవర్లలో భారత్ రెండు వికెట్లకు 193 పరుగులు సాధించగా, అప్పటికి కోహ్లీ 76 (101 బంతులు, 7 ఫోర్లు, ఒక సిక్సర్), యువీ 23 (25 బంతులు, ఒక ఫోర్, ఒక సిక్స్) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. 8 ఓవర్లలో 28 పరుగులకే రెండు కీలక వికెట్లు పడగొట్టిన భారత మీడియం పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్ స్కోరుబోర్డు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: క్విండన్ డి కాక్ బి రవీంద్ర జడేజా 5, హషీం ఆమ్లా సి ధోనీ బి అశ్విన్ 35, ఫఫ్ డు ప్లెసిస్ బి హార్దిక్ పాండ్య 36, ఎబి డివిలియర్స్ రనౌట్ 16, డేవిడ్ మిల్లర్ రనౌట్ 1, జీన్ పాల్ డుమినీ నాటౌట్ 20, క్రిస్ మోరిస్ సి భువనేశ్వర్ కుమార్ బి జస్‌ప్రీత్ బుమ్రా 4, ఆండిల్ ఫెహ్లూక్వాయో ఎల్‌బి జస్‌ప్రీత్ బుమ్రా 4, కాగిసో రబదా సి ధోనీ బి భువనేశ్వర్ కుమార్ 5, మోర్న్ మోర్కెల్ సి విరాట్ కోహ్లీ బి భువనేశ్వర్ కుమార్ 0, ఇమ్రాన్ తాహిర్ రనౌట్ 1, ఎక్‌స్ట్రాలు 16, మొత్తం (44.3 ఓవర్లలో) 191.
వికెట్ల పతనం: 1-76, 2-116, 3-140, 4-142, 5-157, 6-167, 7-178, 8-184, 9-184, 10-191.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 7.3-0-23-2, జస్‌ప్రీత్ బుమ్రా 8-0-28-2, అశ్విన్ 9-0-43-1, హార్దిక్ పాండ్య 10-0-52-1, రవీంద్ర జడేజా 10-0-39-1.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ సి క్వింటన్ డి కాక్ బి మోర్న్ మోర్కెల్ 12, శిఖర్ ధావన్ సి ఫప్ డు ప్లెసిస్ బి ఇమ్రాన్ తాహిర్ 78, విరాట్ కోహ్లీ 76 నాటౌట్, యువరాజ్ సింగ్ 23 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 4, మొత్తం (38 ఓవర్లలో 2 వికెట్లకు) 193.
వికెట్ల పతనం: 1-23, 2-151.
బౌలింగ్: కాగిసో రబదా 9-2-34-0, మోర్న్ మోర్కెల్ 7-1-38-1, ఆండిల్ ఫెహ్లూక్వాయో 5-0-25-0, క్రిస్ మోరిస్ 8-0-40-0, ఇమ్రాన్ తాహిర్ 6-0-37-1, జెపి డుమినీ 3-0-17-0.
*
61 పరుగులు..
8 వికెట్లు..
కెన్నింగ్టన్ ఓవల్: దక్షిణాఫ్రికా 29 ఓవర్లు ముగిసే సమయానికి రెండు వికెట్లకు 140 పరుగులు చేసింది. కానీ, అదే ఆధిక్యతను కొనసాగించలేక, చివరి ఎనిమిది వికెట్లను కేవలం 61 పరుగుల తేడాతో కోల్పోయింది. అంతేగాక, ఈ మ్యాచ్ మొదటి 15 ఓవర్లలో అత్యంత తక్కువగా, సగటున 3.97 పరుగులు చేయగలిగింది. మొదటి 15 ఓవర్లలో మరే ఇతర జట్టూ ఇంత తక్కువ పరుగులు చేయలేదు.
* ఎబి డివిలియర్స్ ఈ సిరీస్‌లో సగటున 6.66 పరుగులు మాత్రమే చేశాడు. కెరీర్‌లో, కనీసం మూడు ఇన్నింగ్స్ ఆడిన సిరీస్‌ల్లో ఎన్నడూ అతను ఇంత తక్కువ సగటును నమోదు చేయలేదు.
* దక్షిణాఫ్రికా సీనియర్ ఓపెనర్ హషీం ఆమ్లా స్పిన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేడని మరోసారి రుజువైంది. ఈ మ్యాచ్‌లో అశ్విన్ స్పిన్‌కు దాసోహమన్న అతను మొత్తం మీద స్పిన్నర్లపై సగటున 20.50 పరుగులు చేశాడు. ఫాస్ట్ బౌలర్లపై అతని సగటు 113 పరుగులు కావడం గమనార్హం. ఈ తేడానే స్పిన్నర్లకు అతను ఎంతగా భయపడుతున్నాడనేది స్పష్టం చేస్తుంది.
* క్వింటన్ డికాక్ భారత్‌పై వనే్డల్లో సగటున 74.11 పరుగులు చేశాడు. కనీసం 500 పరుగులను ప్రామాణికంగా తీసుకుంటే, మరే ఇతర బ్యాట్స్‌మన్ వనే్డల్లో భారత్‌పై ఇంత గొప్ప సగటును నమోదు చేయలేదు. డికాక్ భారత్‌పై తొమ్మిది ఇన్నింగ్స్‌లో ఐదు సెంచరీలు సాధించడం గమనార్హం.
* చాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా మొదటిసారి 2000లో భారత్‌ను ఢీకొంది. 2002లో తిరిగి 2013లో తలపడింది. ఈ మూడు సందర్భాల్లోనూ పరాజయాలను చవిచూసింది. కాగా, ఐసిసి టోర్నీల్లో గత నాలుగు మ్యాచ్‌ల్లో టీమిండియా అన్నింటినీ తన ఖాతాలో వేసుకుంది.

చిత్రాలు.. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ (76 నాటౌట్)
*భారత టాప్ స్కోరర్ శిఖర్ ధావన్ (78)