క్రీడాభూమి

అందరి చూపూ లండన్‌వైపే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 17: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దాయాదుల భీకర సమరానికి మరికొద్ది గంటల్లో తెర లేవబోతోంది. చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కోసం ఆదివారం ఇక్కడ జరుగనున్న తుది పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ జట్లు సిద్ధమవడంతో ఇప్పుడు అభిమానుల దృష్టంతా ఈ మ్యాచ్‌పై కేంద్రీకృతమై ఉంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక పోటీల్లో ఆడేందుకు భారత ప్రభుత్వం నిరాకరిస్తుండటంతో ప్రస్తుతం ఇరు దేశాల పోటీలు కేవలం అంతర్జాతీయ ఈవెంట్లకు మాత్రమే పరిమితమైన విషయం విదితమే. ఇరుగు పొరుగు దేశాలైన భారత్, పాక్ మధ్య ఉద్రిక్తంగా మారిన రాజకీయ సంబంధాలు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరును మరింత భీకరంగా మార్చనున్నాయి. ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు లీగ్ దశలో ఇప్పటికే ఒకసారి దాయాదులను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సర్‌ఫ్రాజ్ అహ్మద్ నేతృత్వంలోని పాక్ జట్టు పుంజుకుని ఇతర జట్లపై వరుస విజయాతో ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ ఆరంభ మ్యాచ్‌లో మాదిరిగా పాక్‌ను మరోసారి ఓడించేందుకు తాము అదనంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే స్పష్టం చేశాడు. ఏది ఏమైనప్పటికీ భారత్-పాక్ మధ్య మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా అభిమానులు ఆద్యంతం నరాలు తెగిపోయేంత ఉత్కంఠతో వీక్షిస్తారన్నది ఎవరూ కాదనలేని వాస్తవం.
భారత్‌తో 80వ దశకంలో షార్జాలో జరిగిన మ్యాచ్‌లో చేతన్ శర్మ వేసిన చివరి బంతిని జావెద్ మియాందాద్ సిక్సర్‌గా మలచి పాకిస్తాన్‌ను గెలిపించడం భారత అభిమానులకు కొన్ని తరాల పాటు పీడకలగా మిగిలిపోవడమే ఇందుకు నిదర్శనం. ఆ తర్వాత సెంచూరియన్‌లో ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్ అద్భుతమైన ప్రదర్శనతో పరిస్థితిని భారత్‌కు అనువుగా మార్చే వరకూ ఆ పీడకలను ఎవరూ మర్చిపోలేదు. ఈ రెండు మ్యాచ్‌ల మధ్య కాలంలో అజయ్ జడేజా, వెంకటేష్ ప్రసాద్, హృషికేశ్ కనిత్కర్, జోగీందర్ శర్మ లాంటి ఆటగాళ్లు తమ వంతు పాత్ర పోషించి భారత్‌కు పెద్ద మ్యాచ్‌లలో విజయాలను అందించినప్పటికీ 80వ దశకం మధ్య కాలం నుంచి 90వ దశకం తొలి నాళ్ల వరకూ భారత జట్లపై ‘షార్జా సిండ్రోమ్’ ఎంతో ప్రభావాన్ని చూపింది. భారత్-పాక్ మధ్య మ్యాచ్ ఢిల్లీలో జరిగినా లేక ఇస్లామాబాద్‌లో జరిగినా, కరాచీలో జరిగినా లేక కోల్‌కతాలో జరిగినా ఓటమిపాలైన జట్టుకు తమ అభిమానుల నుంచి ఛీత్కారాలు తప్పవు.
ఇటువంటి హైఓల్టేజ్ మ్యాచ్‌లలో తలపడే ఇరు జట్లలోని 22 మంది ఆటగాళ్లకు ఇది కేవలం క్రికెట్ మాత్రమే కావచ్చు. కానీ ఇరుదేశాల్లోని కోట్లాది మంది అభిమానులు మాత్రం దీనిని క్రికెట్ కంటే ఎక్కువగా చూస్తుండటంతో పరిస్థితి నానాటికీ వేడెక్కుతోంది. వీరేందర్ సెవాగ్, రషీద్ లతీఫ్ లాంటి మాజీ క్రికెట్ స్టార్లు తమతమ వ్యాఖ్యలతో దీనికి మరింత ఆజ్యం పోస్తున్నారు. ఇప్పుడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం వీరి బాటలో నడుస్తున్నాడు. ప్రకటనలు చేసేందుకు తాము ఇక్కడికి రాలేదని, తమ చేవను చేతల్లో చూపించేందుకు వచ్చామని కోహ్లీ స్పష్టం చేశాడు.
వాస్తవం చెప్పాలంటే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అనుభవజ్ఞులైన నిపుణులతో కూడిన కోహ్లీ సేనకు పాక్ జట్టు ఏవిధంగానూ సరితూగడం లేదు. అంతమాత్రాన పాకిస్తాన్ జట్టును తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేకుండా పోతోంది. ప్రత్యర్థులు ఎవరైనప్పటికీ అదృష్టం కలసి వస్తే పాక్ జట్టు కూడా పెద్ద మ్యాచ్‌లలో విజయం సాధిస్తుండటమే ఇందుకు కారణం. అయితే భారత్-పాక్ మ్యాచ్‌లు నానాటికీ కళావిహీనంగా మారుతున్నాయని, పాక్ ఆటగాళ్లలో నాణ్యత తగ్గుతుండటమే ఇందుకు కారణమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. చాంపియన్స్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లో దాయాదుల మధ్య సమరం ఏకపక్షంగా ముగిసి భారత జట్టు 124 పరుగుల తేడాతో విజయభేరి మోగించడమే ఇందుకు తాజా నిదర్శనమని వారు పేర్కొంటున్నారు. కచ్చితంగా చెప్పాలంటే పాక్ జట్టు ఒకసారి అద్భుతంగానూ, మరోసారి చాలా పేలవంగానూ ఆడుతూ లోలకం మాదిరిగా ఊగిసలాడుతోంది. దీంతో ఆ జట్టు ప్రదర్శన ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు.

చిత్రాలు.. . చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో కోహ్లీసేన విజయాన్ని కాంక్షిస్తూ కోల్‌కతాలో శనివారం భారీ త్రివర్ణ పతకాన్ని ప్రదర్శిస్తున్న అభిమానులు