క్రీడాభూమి

హాకీలో ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 18: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ ఫైనల్లో దాయాది పాక్ చేతిలో ఘోరంగా ఓడినప్పటికీ హాకీలో మాత్రం మనవాళ్లు పాక్‌ను చిత్తు చేసి అభిమానులకు కాస్త ఊరట కలిగించారు. హాకీ వరల్డ్ లీగ్ (డబ్ల్యుహెచ్‌ఎల్) సెమీఫైనల్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం ఇక్కడి లీ వ్యాలీ హాకీ, టెన్నిస్ సెంటర్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7-1 గోలుల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాక్‌ను చిత్తుచేసి క్వార్టర్ ఫైనల్‌లో స్థానాన్ని ఖరారు చేసుకొంది. డ్రాగ్ ఫ్లిక్ స్పెషలిస్టు హర్మన్‌ప్రీత్ సింగ్, తల్వీందర్ సింగ్, ఆకాశ్ దీప్ సింగ్‌లు తలా రెండు గోల్స్ సాధించగా, ప్రదీప్ మోర్ ఒక గోల్ సాధించారు. కాగా, పాక్‌కు లభించిన ఏకైక గోల్‌ను ముహమ్మద్ ఉమర్ బుట్టా సాధించాడు. కాగా, ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలోను విజయం సాధించిన భారత్ పూల్ -బి అగ్రస్థానంలో నిలవగా, నెదర్లాండ్స్ రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు పాకిస్తాన్ తాను ఆడిన మూడు మ్యాచ్‌లలోను ఓడిపోయి ఈ గ్రూపులో అట్టడుగున నిలిచింది. భారత్ మంగళవారం నెదర్లాండ్స్‌ను ఢీకొననుండగా, పాకిస్తాన్ సోమవారం స్కాట్లాండ్‌తో తలపడుతుంది.
స్కోరును చూసినట్లయితే మ్యాచ్ పూర్తి ఏకపక్షంగా సాగినట్లు కనిపించినప్పటికీ వాస్తవం మాత్రం అలా లేదు. మ్యాచ్ ప్రారంభంలో పాకిస్తాన్ ఆధిపత్యం అడుగడుగునా కనిపించింది. అయితే అది కేవలం పది నిమిషాలు మాత్రమే ఉండింది. ఆ తర్వాత భారత్ క్రమంగా మ్యాచ్‌పై పట్టు సాధించింది. 13వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి భారత్‌కు తొలి గోలును సాధించి పెట్టాడు. రెండో క్వార్టర్ నాలుగో నిమిషంలో భారత్‌కు మరో పెనాల్టీ కార్నర్ లభించింది కానీ హర్మన్ ప్రీత్ కొట్టిన బంతిని పాక్ గోల్‌కీపర్ అమ్జాద్ అలీ అద్భుతంగా అడ్డుకొన్నాడు. అయితే ఆ వెంటనే 21వ నిమిషంలో తల్వీందర్ సింగ్ అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో భారత్ ఆధిక్యతను రెట్టింపు చేశాడు. మరో మూడు నిమిషాల తర్వాత తల్వీందర్ మరో గోలు చేయడంతో విరామ సమయానికి భారత్ 3-0 ఆధిక్యతతో తిరుగులేని స్థితిలో నిలిచింది.
విరామం తర్వాత కూడా భారత్ అదే ఊపును కొనసాగించింది. ద్వితీయార్ధం మూడో నిమిషంలో హర్మన్‌ప్రీత్ మరో గోల్ చేయడంతో భారత్ ఆధిక్యత 4-0 కు పెరిగింది. ఈ మధ్యలో పాకిస్తాన్‌కు గోలు చేసే అవకాశాలు ఒకటి రెండు లభించినప్పటికీ భారత గోల్ కీపర్ ఆకాష్ చిక్టే వాటిని వమ్ము చేశాడు. 47వ నిమిషంలో ఆకాశ్ దీప్ అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో భారత్ ఆధిక్యతను 5-0కు పెంచాడు. మరో రెండు నిమిషాలకే ప్రదీప్ మోర్ మరో గోల్ చేశాడు. 57వ నిమిషంలో ముహమ్మద్ ఉమర్ బుట్టా పాక్‌కు లభించిన ఏకైక గోల్ చేశాడు. అయితే ఆట ముగియడానికి ఒక నిమిషం ముందు అకాశ్ దీప్ మరో అద్భుత గోలు సాధించి భారత్ విజయాన్ని సంపూర్ణం చేశాడు.
నల్లబ్యాడ్జీలు ధరించిన భారత్ ఆటగాళ్లు
కాగా, ఇటీవల కాశ్మీర్‌లో భారత సైన్యంపై జరిగిన దాడుల్లో మృతి చెందిన జవాన్లకు సంతాప సూచకంగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత క్రీడాకారులు నల్ల బ్యాడ్జీలు ధరించారు. ఆటగాళ్లే కాకుండా భారత బృందంలోని మిగతా సిబ్బంది కూడా నల్లబ్యాడ్జీలు ధరించారు. సైనికుల మరణాలకు సంతాప సూచకంగా నల్లబ్యాడ్జీలను ధరించాలన్నది జట్టు ఏకగ్రీవ నిర్ణయమని, జమ్మూ, కాశ్మీర్‌లో శాంతి నెలకొనాలనేది వారి ఆకాంక్ష అని హాకీ ఇండియా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ముస్తాక్ అహ్మద్ చెప్పారు.

చిత్రం.. భారత్-పాక్ మ్యాచ్‌లో రసవత్తర ఘట్టం