క్రీడాభూమి

చాంపియన్స్ ట్రోఫీలో చావుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 18: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో టీమిండియా ఘోరంగా చతికిలబడింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా ఆదివారం ఇక్కడ పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సమష్టిగా విఫలమై టైటిల్‌ను చేజార్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టులో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్లంతా చక్కగా రాణించారు. ప్రత్యేకించి కొత్త ఆటగాడు ఫఖర్ జమన్ తొలి వనే్డలోనే సెంచరీతో సత్తా చాటుకున్నాడు. అతనికి తోడుగా ఓపెనర్ అజర్ అలీ (59), ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్ (46), మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మహమ్మద్ హఫీజ్ (57-నాటౌట్) చక్కగా రాణించడంతో పాక్ 50 ఓవర్లలో 338 పరుగుల భారీ స్కోరు సాధించింది. పాక్ బ్యాట్స్‌మన్లను కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమైన భారత ఆటగాళ్లు ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ పూర్తిగా చేతులెత్తేశారు. ఒక్క హార్దిక్ పాండ్య (76) మినహా మిగిలిన వారంతా అట్టర్ ఫ్లాప్ షోతో విఫలమయ్యారు. ఈ వైఫల్యాలను సమర్ధవంతంగా అందిపుచ్చుకుని 30.3 ఓవర్లలో 158 పరుగులకే టీమిండియాను ఆలౌట్ చేసిన పాకిస్తాన్ జట్టు 180 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్‌ను తన్నుకుపోయింది.
అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఓపెనర్ అజర్ అలీ, కొత్త ఆటగాడు ఫఖర్ జమన్ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినప్పటికీ ఆ తర్వాత వేగాన్ని పెంచారు. భారత బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటిస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపారు. జమన్ 4 పరుగులు సాధించిన తర్వాత జస్‌ప్రీత్ బుమ్రా వేసిన బంతిని ఎదుర్కోబోయి వికెట్ల వెనుక ధోనీ చేతికి చిక్కాడు. అయితే అది నోబాల్ కావడంతో ఊపిరిపీల్చుకున్న జమన్ ఆ అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుని భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఎడాపెడా షాట్లతో విజృంభిస్తూ ముందుకు సాగిన అతను అజర్ అలీ (71 బంతుల్లో 58 పరుగులు)తో కలసి తొలి వికెట్‌కు 128 పరుగుల భాగస్వామ్యంతో పాక్ ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశాడు. 23వ ఓవర్‌లో అజర్ అలీ రనౌట్‌గా నిష్క్రమించడంతో వీరి భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్ అందించిన సహకారాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని 92 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్న జమన్ పరుగుల వేగాన్ని మరింత పెంచాడు. ఆజమ్‌తో కలసి రెండో వికెట్‌కు 63 బంతుల్లో 72 పరుగులు జోడించిన జమన్ మొత్తం మీద 106 బంతుల్లో 114 పరుగులు సాధించిన తర్వాత 34వ ఓవర్‌లో హార్దిక్ పాండ్య వేసిన తొలి బంతిని ఎదుర్కోబోయి రవీంద్ర జడేజా చేతికి చిక్కాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో పాక్ 200 పరుగుల మైలురాయిని చేరుకుంది. జమన్ నిష్క్రమణ తర్వాత షోయబ్ మాలిక్ (16 బంతుల్లో 12 పరుగులు)తో కలసి మూడో వికెట్‌కు 47 పరుగులు జోడించిన ఆజమ్ 52 బంతుల్లో 46 పరుగులు సాధించి కేదార్ జాదవ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చాడు. అయినప్పటికీ పాక్ పరుగుల వేగం ఏమాత్రం తగ్గలేదు. చివర్లో ధాటిగా ఆడిన మహమ్మద్ హఫీజ్ (37 బంతుల్లో 57 పరుగులు), ఇమద్ వాసిమ్ (21 బంతుల్లో 25 పరుగులు) అజేయంగా 71 పరుగులు జోడించి సత్తా చాటుకున్నారు. ఈ నష్టం చాలదన్నట్లు భారత బౌలర్లు ఎక్స్‌ట్రాల (9 లెగ్‌బైస్, 13 వైడ్లు, 3 నోబాల్స్) రూపంలో ఏకంగా 25 పరుగులు సమర్పించుకోవడంతో పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 338 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ (10 ఓవర్లలో 70 పరుగులు), రవీంద్ర జడేజా (8 ఓవర్లలో 67 పరుగులు) ఘోరంగా విఫలమై పాక్ బ్యాట్స్‌మెన్ ముందు మోకరిల్లగా, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్య, కేదార్ జాదవ్ ఒక్కో వికెట్‌తో సరిపుచ్చుకున్నారు.
అనంతరం భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాను పాక్ బౌలర్లు సమర్ధవంతంగా కట్టడి చేశారు. వీరి జోరును ప్రతిఘటించలేక ఓపెనర్ రోహిత్ శర్మ పరుగుల ఖాతా ఆరంభించకుడా తొలి ఓవర్‌లోనే నిష్క్రమించగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ 5 పరుగులకే పెవిలియన్‌కు పరుగెత్తాడు. ఈ తరుణంలో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించిన శిఖర్ ధావన్ 21 పరుగులు సాధించి మహమ్మద్ అమీర్ బౌలింగ్‌లో వికెట్ల వెనుక సర్‌ఫ్రాజ్ అహ్మద్ చేతికి చిక్కగా, యువరాజ్ సింగ్ (22), మహేంద్ర సింగ్ ధోనీ (4), కేదార్ జాదవ్ (9) కూడా విఫలమయ్యారు. ఆ తర్వాత పాక్ బౌలర్లకు ఎదురొడ్డి క్రీజ్‌లో నిలదొక్కుకున్న హార్దిక్ పాండ్య కొద్దిసేపు ఒంటరి పోరాటం చేశాడు. 32 బంతుల్లో అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్న అతను ఏడో వికెట్‌కు 80 పరగులు జోడించాడు. 43 బంతుల్లో 76 పరుగులు సాధించిన తర్వాత పాండ్య రనౌట్‌గా నిష్క్రమించడంతో ఇక భారత్ కోలుకోలేకపోయింది. పాక్ బౌలర్లను ఎదుర్కోలేక రవీంద్ర జడేజా (15), రవిచంద్రన్ అశ్విన్ (1), జస్‌ప్రీత్ బుమ్రా (1) త్వరత్వరగా నిష్క్రమించగా, భువనేశ్వర్ కుమార్ 1 పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో 30.3 ఓవర్లలో 158 పరుగులకే చతికిలబడిన భారత జట్టు 180 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొని టైటిల్‌ను చేజార్చుకుంది. పాక్ బౌలర్లలో మహమ్మద్ అమీర్, హసన్ అలీ మూడేసి వికెట్లు కైవసం చేసుకోగా, షాదబ్ ఖాన్ రెండు వికెట్లు, జునైద్ ఖాన్ ఒక వికెట్ చొప్పున అందుకున్నారు.

చిత్రాలు.. లి మ్యాచ్‌లోనే శతకంతో సత్తా చాటుకున్న ఫఖర్ జమన్

*పాక్ శిబిరంలో మిన్నంటిన సంబరాలు