క్రీడాభూమి

కోచ్ రేసులో జయవర్ధనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 26: భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి శ్రీలంక మాజీ కెప్టెన్, సూపర్ స్టార్ బ్యాట్స్‌మన్ మహేల జయవర్ధనే కూడా పోటీపడనున్నట్టు సమాచారం. వీరేందర్ సెవాగ్, టామ్ మూడీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా, జయవర్ధనే కూడా ఫేవరిట్స్ జాబితాలో చేరాడు. అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన తర్వాత కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే గడువును జూలై 9వ తేదీ వరకు బిసిసిఐ పెంచిన విషయం తెలిసిందే. సచిన్ తెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్‌తో కూడిన క్రికెట్ సలహా మండలి (సిఎసి) దరఖాస్తులను పరిశీలించి, జాబితాను కుదిస్తుంది. ఆతర్వాత పోటీలో ఉన్న వారికి ఇంటర్వ్యూలో నిర్వహించి, కోచ్ పదవికి ఎవరికి కట్టబెట్టవచ్చన్న విషయంలో బిసిసిఐకి సూచనలు చేస్తుంది. దొడ్డా గణేష్, రిచర్డ్ పీబస్, సెవాగ్, టామ్ మూడీ పేర్లు సిఎసి పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే, సెవాగ్, మూడీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్నట్టు నిన్నమొన్నటి వరకూ బిసిసిఐ వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా జయవర్ధనే పేరు తెరపైకి రావడంతో, త్రిముఖ పోటీ తప్పదని అంటున్నారు. కెరీర్‌లో అన్ని అంతర్జాతీయ ఫార్మాట్స్‌తో కలిపి 652 మ్యాచ్‌లు ఆడిన 40 ఏళ్ల జయవర్ధనే 25,957 పరుగులు సాధించాడు. ఇందులో 54 సెంచరీలు, 136 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా పేరుప్రఖ్యాతులు ఆర్జించిన అతను అంతర్జాతీయ కెరీర్‌ను ముగించిన తర్వాత ఇంగ్లాండ్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా సేవలు అందించాడు. ఈ ఏడాది మొదటిసారిగా ఐపిఎల్‌లోకి అడుగుపెట్టాడు. ముంబయి ఇండియన్స్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించి, మొదటి ప్రయత్నంలోనే ఆ జట్టుకు టైటిల్‌ను సాధించిపెట్టాడు. భారత ఉపఖండంలో వాతావరణ పరిస్థితులు, పిచ్ తీరుతెన్నులు ఒకే రీతిలో ఉండడం జయవర్ధనేకు అనుకూలించే అంశాలు. పైగా, భారత్‌తో అతనికి సాన్నిహిత్యం ఉంది. విదేశీ కోచ్‌ని ఎంపిక చేయాలని అనుకుంటే, మూడీ కంటే ముందుగా జయవర్ధనేకు అవకాశం దక్కుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

చిత్రం.. జయవర్ధనే