క్రీడాభూమి

ఫెదరర్ ది గ్రేట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 16: ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్విట్జర్లాండ్ వీరుడు, మాజీ ప్రపంచ నంబర్ వన్ రోజర్ ఫెదరర్ కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా ఓపెన్‌లో విజయ కేతనం ఎగరవేడం ద్వారా కెరీర్‌లో 18వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సాధించిన అతను వింబుల్డన్‌లోనూ అదే స్థాయిలో రాణించాడు. ఫైనల్‌లో మారిన్ సిలిక్‌ను 6-3, 6-1, 6-4 తేడాతో ఓడించి, గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను 19కి పెంచుకున్నాడు. రాఫెల్ నాదల్ 15, పీట్ సంప్రాస్ 14 టైటిళ్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. వచ్చేనెల 36వ ఏట అడుగుపెట్టనున్న ఫెదరర్ టెన్నిస్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. నిరుటి విజేత ఆండీ ముర్రే, ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ రాఫెల్ నాదల్, ప్రపంచ మాజీ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ అంతకు ముందే పరాజయాలను చవిచూడడంతో, ఈసారి వింబుల్డన్ టైటిల్ ఫెదరర్‌కే దక్కుతుందని క్రీడా పండితులు అంచనా వేశారు. వారు అనుకున్న విధంగానే ఫైనల్‌లో సిలిక్‌పై అతను తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. ప్రత్యర్థికి ఏ దశలోనూ కోలుకునే అవకాశం ఇవ్వకుండా విరుచుకుపడ్డాడు. గెలవాలన్న ఉత్సాహం, పట్టుదల ఉంటే వయసు ఏమాత్రం అడ్డంకి కాదని నిరూపించాడు. అతని ధాటికి సిలిక్ ప్రేక్షక పాత్ర పోషించడం మినహా ఏమీ చేయలేకపోయాడు. చివరి సెట్‌లో తన ఉనికిని కాపాడుకోవడానికి అతను చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాగా, సిలిక్‌ను చిత్తుచేసిన ఫెదరర్‌కు ప్రేక్షకులు హర్షధ్వానాలతో అభినందనలు తెలిపారు. అతను స్టేడియం నలువైపులా చూస్తూ, ప్రేక్షకులకు అభివాదం చేస్తూ ట్రోఫీని స్వీకరించాడు. రికార్డు విజయం సాధించిన సంతృప్తి అతని ముఖంలో చాలా స్పష్టంగా కనిపించింది.
ఉన్నత శిఖరాలు
ఫెదరర్ టెన్నిస్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు. అతను కెరీర్‌లో 19 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను అందుకుంటే, అతని చిరకాల ప్రత్యర్థి రాఫెల్ నాదల్ 15 గ్రాండ్ శ్లామ్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. పీట్ సంప్రాస్ 14 టైటిళ్లు అందుకొని, మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇలావుంటే, గ్రాండ్ శ్లామ్స్‌లో ఫెదరర్ ఇంత వరకూ 29 పర్యాయాలు ఫైనల్ చేరాడు. నాదల్ 22, నొవాక్ జొకోవిచ్ 21సార్లు ఫైనల్స్ వరకు వెళ్లారు. గ్రాండ్ శ్లామ్స్ మాత్రమేకాకుండా, కెరీర్‌లో తాను ఆడిన అన్ని మ్యాచ్‌లను పరిగణలోకి తీసుకుంటే, ఫెదరర్ 25 శాతం మ్యాచ్‌లను గెల్చుకున్నాడు. ఈసారి వింబుల్డన్‌కు ముందు వరకూ అతను 334 టోర్నీల్లో ఆడి, 86 టైటిళ్లు సాధించాడు.
అషే రికార్డు బద్దలు
వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విభాగంలో అత్యధికంగా ఎనిమిది పర్యాయాలు విజేతగా నిలిచిన ఫెదరర్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. గతంలో విలియమ్ రెన్షా నెలకొల్పిన రికార్డును ఫెదరర్ బద్దలు చేశాడు. అంతేగాక, వింబుల్డన్ టైటిల్ అందుకున్న వారిలో ఎక్కువ వయసున్న ఆటగాడిగానూ అతని పేరు రికార్డు పుస్తకాల్లోకి చేరింది. 1976 ఆర్థర్ అషే తన 32వ ఏట వింబుల్డన్‌లో టైటిల్ సాధించాడు. ఇప్పుడు ఫెదరర్ 35వ ఏట ఈ టైటిల్‌ను అందుకొని, అషే రికార్డును అధిగమించాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరి ట నమోదు చేసుకున్న అతను వేసే ప్రతి అడుగు, సాధించే ప్రతి విజయం ఒక కొత్త రికార్డుగానే రూపాంతరం చెందుతున్నది.

చిత్రం.. వింబుల్డన్ టైటిల్ సాధించిన స్విస్ స్టార్ ట్రోఫీతో ఫెదరర్