క్రీడాభూమి

క్రీడల్లోనూ రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూలై 20: చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని యువతకు భారత మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ పిలుపునిచ్చాడు. ప్రో కబడ్డీలో చెన్నై తలైవాస్ ఫ్రాంచైజీ కొత్త జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అతను మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరక పటుత్వంతోపాటు మానసిక అభివృద్ధి కూడా సాధ్యమవుతుందని అన్నాడు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని అన్నాడు. 2020 నాటికి మన దేశం ఎక్కువ మంది యువత గల దేశంగా గుర్తింపు సంపాదిస్తుందని అంటూ, యువత అనారోగ్యంతో అల్లాడడం దారుణ పతనానికి కారణమవుతుందని చెప్పాడు. అందుకే, ఆరోగ్యం పట్ల చైతన్యవంతులు కావాలని, క్రీడలతోనే అది సాధ్యమని సచిన్ అన్నాడు. తాను కేవలం కబడ్డీని ప్రోత్సహించడానికి మాత్రమే చెన్నైకి రాలేదని, అన్ని క్రీడలూ అభివృద్ధి చెందాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నాడు.
ధోనీ డిఫెండర్!
డ్రీమ్ టీంను ఎంపిక చేసుకుంటే, అందులో ఎవరెవరు ఉంటారన్న ప్రశ్నకు సచిన్ సరదాగా సమాధానమిచ్చాడు. క్రికెట్‌లో వికెట్‌కీపింగ్ చేసే మహేంద్ర సింగ్ ధోనీ కబడ్డీలో డిఫెండర్‌గా బాగా పనికొస్తాడని చెప్పాడు. అదే విధంగా, గుక్కతిప్పుకోకుండా పాటలు పాడే శంకర్ మహాదేవన్ రైడర్‌గా రాణిస్తాడని చమత్కరించాడు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు కమల్ హసన్, చెన్నై తలైవాస్ భాగస్వాములు అల్లు అర వింద్, అల్లు అర్జున్ తదితరులు కూడా పాల్గొన్నారు.
తిరుమలకు మాస్టర్ బ్లాస్టర్
తిరుపతి: తాను ఎంత పెద్దవాడినైనా అభిమానానికి దూరం కానని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తిరుమల వెంకన్న సాక్షిగా మరోమారు నిరూపించిన సంఘటన గురువారం తిరుమలలో చోటు చేసుకుంది. తన సతీమణి అంజలితో కలసి సచిన్ గురువారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయన ఆలయం వెలుపలికి వచ్చే సమయంలో పోలీసులు ఆయనకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈక్రమంలో సచిన్ తన సతీమణి అంజలి, చాముండేశ్వరనాథ్, జెఇఓలతో కలసి కారు వద్దకు వస్తున్న సమయంలో ఓ అభిమాని భద్రతావలయాన్ని ఛేదించుకుని తిరుమల శ్రీవేంటేశ్వరస్వామి దశావతారాలున్న అతి పెద్ద చిత్రపటాన్ని తీసుకుని ఒక్కసారిగా సచిన్ ముందుకు వచ్చాడు. ఆయనతో కరచాలనం చేసి పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న చాముండేశ్వర్‌నాథ్ ఆ అభిమానిని పట్టుకోబోయాడు. అక్కడే ఉన్న జె ఇ ఓ శ్రీనివాసరాజు ఒక్కసారిగా ఆయువకుడి వద్దకు వెళ్ళి ఇక్కడకు ఎలా వచ్చావంటూ పక్కకు పంపాడు. దీంతో నిరాశకు గురైన ఆ యువకుడు మరి కొంత దూరం వెళ్ళి సచిన్ వైపే దీనంగా చూస్తూ నిలబడ్డాడు. అయితే ఇదంతా గమనిస్తున్న సచిన్ తన పక్కనే ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌తో చెప్పి ఆ యువకుడిని రమ్మనమని సూచించాడు. దీంతో అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందే ఆ యువకుడిని సచిన్ వద్దకు పంపారు. ఆ యువకుడు అక్కడకు చేరుకుని తాను తెచ్చిన చిత్రపటాన్ని సచిన్‌కు బహూకరించాడు. సచిన్ ఎంతో ఆప్యాయతగా ఆ పటాన్ని స్వీకరించారు. ఈక్రమంలో యువకుడు సచిన్‌కు కరచాలనం చేసి, నమస్కరించుకుని వెళ్ళాడు. అటు తరువాత ఆ యువకుడి ఆనందానికి అవధుల్లేవు. ఏదేమైనా అభిమానానికి తాను ఎన్నడూ దూరం కాదని మరోమారు నిరూపించుకున్నాడు. ఇదిలావుండగా ఆలయం వెలుపల సచిన్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో భారత మహిళా జట్టు అద్భుత ప్రదర్శన చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తోందన్నాడు. ముఖ్యంగా మహిళా జట్టు క్యాప్టెన్ మిథాలీరాజ్ అత్యుత్తమ ప్రతిభ కనబరచి ప్రపంచ రికార్డు సాధిస్తోందన్నాడు. ఇందుకు తాను అభినందిస్తున్నానన్నాడు. ఇక ఆస్ట్రేలియాతో తలపడుతున్న మహిళా జట్టు విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నానన్నాడు.

చిత్రం.. చెన్నై తలైవాస్ ఫ్రాంచైజీ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ క్రికెటర్ సచిన్, నటుడు కమల్ హసన్