క్రీడాభూమి

భారత్ పోరాటం వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లార్డ్స్, జూలై 23: మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో రెండోసారీ భారత్‌కు చేదు అనుభవమే మిగిలింది. 2005లో మొదటిసారి ఈ మెగా టోర్నీ ఫైనల్ చేరినప్పటికీ, టైటిల్ సాధించలేకపోయింది. ఇప్పుడు మిథాలీ రాజ్ నాయకత్వంలో ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. కానీ, ‘క్రికెట్ మక్కా’ లార్డ్స్ మైదానంలో ఆదివారం జరిగిన తుది పోరులో చివరి వరకూ పోరాడి ఓడింది. ఓపెనర్ పూనమ్ రావత్ (86), సెమీ ఫైనల్స్ సెంచరీ స్టార్ హర్మన్‌ప్రీత్ కౌర్ (51) అర్ధ శతకాలతో రాణించినా, చివరిలో లోయర్ మిడిల్ ఆర్డర్ పోరాడినా ఫలితం దక్కలేదు. అన్య షబ్‌స్రోల్ అద్భుత బౌలింగ్ భారత బ్యాటింగ్‌ను దారుణంగా దెబ్బతీసింది. ఆమె 6 వికెట్లు పడగొట్టి, ఇంగ్లాండ్‌కు 9 పరుగుల తేడాతో విజయాన్ని అందించింది.
ఆదుకున్న షివెర్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ ఆరంభంలో మెరుగ్గానే ఆడినట్టు కనిపించినప్పటికీ, సుమారు వంద పరుగుల తేడాతో ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, నతాలీ షివెర్ అర్ధ శతకంతో జట్టును ఆదుకుంది. కాథెరిన్ బ్రంట్, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ సారా టేలర్ కూడా ఇంగ్లాండ్ రెండు వందల పరుగుల మైలురాయిని అధిగమించడంలో తమ వంతు సాయం చేశారు. టామీ బ్యూవౌంట్‌తో కలిసి మొదటి వికెట్‌కు 47 పరుగులు జోడించిన తర్వాత లారెన్ విన్‌ఫీల్డ్ అవుటైంది. 24 పరుగులు చేసిన ఆమెను రాజేశ్వరి గైక్వాడ్ క్లీన్ బౌల్డ్ చేసింది. మరో 13 పరుగులకే టామీ బ్యూవౌంట్ కూడా పెవిలియన్ చేరింది. 37 బంతులు ఎదుర్కొని 23 పరుగులు చేసిన ఆమెను ఝూలన్ గోస్వామి క్యాచ్ అందుకోగా, పూనమ్ యాదవ్ అవుట్ చేసింది. ఆతర్వాత వికెట్ల పతనం కొనసాగింది. హీతర్ నైట్ కేవలం ఒక పరుగు చేసి, పూనమ్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయింది. వికెట్ల వద్ద పాతుకుపోయేందుకు విశేషంగా ప్రయత్నించిన సారా టేలర్ (62 బంతుల్లో 45 పరుగులు), ఫ్రాన్ విల్సన్ (0) వికెట్లను ఝూలన్ గోస్వామి ఒకే ఓవర్‌లో పడగొట్టింది. దీనితో సమస్యల్లో పడిన ఇంగ్లాండ్‌కు 68 బంతుల్లో, ఐదు ఫోర్లతో 51 పరుగులు అందించిన నతాలీ షివెర్ వికెట్ 164 పరుగుల వద్ద కూలింది. ఝూలన్ గోస్వామి ఎల్‌బిగా అవుట్ చేసింది. ఆరో డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన జెన్నీ గన్‌తో కలిసి కాథరిన్ బ్రంట్ జట్టు స్కోరును రెండు వందల పరుగులకు చేరువకు తెచ్చింది. 42 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లతో 34 పరుగులు చేసిన ఆమె దురదృష్టవశాత్తు రనౌటైంది. అనంతరం జెన్నీ గన్ (25 నాటౌట్), లారా మార్ష్ (14) మరో వికెట్ కూలకుండా జాగ్రత్తపడ్డారు. ఇంగ్లాండ్ ఏడు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగలిగింది. ఒకనొక దశలో 200 స్కోరు అసాధ్యంగా కనిపించినప్పటికీ, లోయర్ మిడిల్ ఆర్డర్ పోరాటంతో ఇంగ్లాండ్ కోలుకుంది.
మందానా డకౌట్
గత రెండు మ్యాచ్‌ల్లో అనుకున్న స్థాయిలో రాణించలేక, అభిమానులను నిరాశ పరచిన ఓపెనర్ స్మృతి మందాన మరోసారి విఫలమైంది. జట్టు స్కోరు ఐదు పరుగుల వద్ద ఆమె వికెట్ కూలింది. పరుగుల ఖాతాను తెరవలేకపోయిన ఆమెను అన్య షబ్‌స్రోల్ బౌల్డ్ చేసింది. రెండో వికెట్‌కు 38 పరుగులు జత కలిసిన తర్వాత కెప్టెన్ మిథాలీ రాజ్ వెనుదిరిగింది. లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటైన ఆమె 31 బంతుల్లో 17 పరుగులు చేసింది. పూనమ్ రావత్‌తో కలిసి బలమైన ఇన్నింగ్స్‌ను పునాది వేస్తున్న మిథాలీ అవుట్ కావడం భారత్‌ను ఆందోళనకు గురి చేసింది. సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన సెమీ ఫైనల్ సెంచరీ హీరోయిన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన సహజ సిద్ధమైన ఆటకు భిన్నంగా, క్రీజ్‌లో నిలబడాలన్న ఉద్దేశంతో డిఫెన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. వీరిద్దరూ నింపాదిగా ఆడినప్పటికీ, అర్ధ శతకాలు సాధించారు. మూడో వికెట్‌కు 95 పరుగులు జోడించిన హర్మన్‌ప్రీత్ 51 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అవుటైంది. ఆమెను టామీ బ్యూవౌంట్ క్యాచ్ అందుకోగా అలెక్స్ హార్ట్‌లీ పెవిలియన్‌కు పంపింది. భారత్ స్కోరు 138 పరుగుల వద్ద మూడో వికెట్ కూలింది. సెంచరీ దిశగా దూసుకెళుతున్న ఓపెనర్ పూనమ్ రావత్‌ను అన్య షబ్‌స్రోల్ ఎల్‌బిగా అవుట్ చేసింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన పూనమ్ రావత్ 115 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 86 పరుగులు సాధించింది. అప్పటికి భారత్ స్కోరు 191 పరుగులుకాగా, మరో ఐదు పరుగుల తర్వాత వికెట్‌కీపర్ సుష్మా వర్మ పెవిలియన్ చేరింది. పరుగులు సాధించడంలో విఫలమైన ఆమెను ఆలెక్స్ హార్ట్‌లీ క్లీన్ బౌల్డ్ చేసింది. భారత్ స్కోరు సరిగ్గా 200 పరుగుల వద్ద వేదా కృష్ణమూర్తి వికెట్ కూలింది. ఆమె 34 బంతుల్లో 35 పరుగులు చేసి, అన్య షబ్‌స్రోల్ బౌలింగ్‌లో నతాలీ షివెర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. అదే ఓవర్ చివరి బంతికి ఝూలన్ గోస్వామి (0) బౌల్డ్ అయింది. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కూలడంతో భారత్ విజయావకాశాలకు గండిపడింది. జట్టును గెలిపించే బాధ్యత టెయిలెండర్స్‌పై పడగా, శిఖా పాండే నాలుగు పరుగులు చేసి, జట్టు విజయానికి 11 పరుగుల దూరంలో ఉండగా రనౌటైంది. కొద్దిసేపు ఇంగ్లాండ్‌ను ప్రతిఘటించిన దీప్తి శర్మ 14 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అన్య షబ్‌స్రోల్ బౌలింగ్‌లో నతాలీ షివెర్‌కు దొరికిపోయింది. రాజేశ్వరి గైక్వాడ్ (0)ను అన్య షబ్‌స్రోల్ బౌల్డ్ చేయడంతో, 219 పరుగుల వద్ద భారత్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. రెండోసారి వరల్డ్ కప్ ఫైనల్ చేరినప్పటికీ, టైటిల్ సాధించలేక, రన్నరప్ ట్రోఫీతో సరిపుచ్చుకుంది.

చిత్రాలు.. ఇంగ్లాండ్ టాప్ స్కోరర్ నతాలీ షివెర్ (51)
*ఆరు వికెట్లు పడగొట్టి, భారత్ బ్యాటింగ్‌ను దెబ్బతీసిన ఇంగ్లాండ్ బౌలర్ అన్య షబ్‌స్రోల్ (ఎడమ నుంచి రెండు)కు సహచరుల అభినందన