క్రీడాభూమి

భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా: ఆసియా కప్ టి-20 క్రికెట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను భారత్ ఐదు వికెట్ల తేడాతో చిత్తుచేసింది. పాక్‌ను కేవలం 83 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా తర్వాత ఇన్నింగ్స్ ఆరంభంలో తడబడినప్పటికీ, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ బాధ్యతాయుమైన ఆటతో కోలుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్‌ను ఎంచుకొని పాక్‌ను ఇరకాటంలో పెట్టాడు. పిచ్ తీరు ఎలా ఉంటుందో తెలియని పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ పరుగుల కోసం నానా తంటాలు పడ్డారు. 25 పరుగులు చేసిన సర్ఫ్‌రాజ్ అహ్మద్ టాప్ స్కోరర్‌గా నిలిచాడంటే పాక్ బ్యాటింగ్ పతనాన్ని ఊహించుకోవచ్చు. భారత యువ బౌలర్ హార్దిక్ పాండ్య ఎనిమిది పరుగులకే మూడు వికెట్లు కూల్చడం విశేషం. కాగా, విజయ లక్ష్యమైన 84 పరుగులను భారత్ 15.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి అందుకుంది. ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించి, ఆసియా కప్‌లో ఫైనల్ చేరే అవకాశాన్ని మెరుగుపరచుకుంది.
పేకలా? వికెట్లా?
పాకిస్తాన్ వికెట్లు పేక ముక్కలా కూలాయి. కేవలం నాలుగు పరుగుల స్కోరు వద్ద మహమ్మద్ హఫీజ్ (4) వికెట్‌ను కోల్పోయిన పాకిస్తాన్ ఆతర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. ధోనీ క్యాచ్ అందుకోగా హఫీజ్‌ను అవుట్ చేసిన ఆశిష్ నెహ్రా ఆరంభించిన దాడులను మిగతా బౌలర్లు కూడా కొనసాగించారు. షర్జీల్ ఖాన్ ఏడు పరుగులు చేసి జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఆజింక్య రహానేకు దొరికిపోయాడు. భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్నట్టు కనిపించిన ఖుర్రం మంజూర్ 10 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద రనౌట్ కావడంతో పాకిస్తాన్ చిక్కుల్లో పడింది. క్రీజ్‌లో పాతుకుపోయేందుకు ప్రయత్నించిన షోయబ్ మాలిక్ నాలుగు పరుగులు చేసి హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 35 పరుగుల వద్ద నాలుగో వికెట్ కూలింది. అదే స్కోరువద్ద ఉమర్ అక్మల్ కూడా పెవిలియన్ చేరాడు. 3 పరుగులు చేసిన అతనిని యువరాజ్ సింగ్ ఎల్‌బిగా వెనక్కు పంపాడు. ఈ దశలో హార్డ్ హిట్టర్‌గా పేరు పొందిన షహీద్ అఫ్రిదీపైనే పాకిస్తాన్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ, అతను కేవలం రెండుపరుగులు చేసి రనౌటయ్యాడు. లేని పరుగు కోసం అతను విఫలయత్నం చేసి, పాకిస్తాన్‌ను నిలువునా ముంచేశాడు. వాహబ్ రియాజ్ (2)ను జడేజా ఎల్‌బిగా అవుట్ చేయగా, టాప్ స్కోరర్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ 25 పరుగులు సాధించి జడేజా బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మహమ్మద్ సమీ (8), మహమ్మద్ అమీర్ (1) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరగా, పాకిస్తాన్ 17.3 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య 3.3 ఓవర్లలో కేవలం 8 పరుగులిచ్చి 3 వికెట్లు కూల్చాడు. జడేజాకు రెండు వికెట్లు లభించాయి.
తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు
భారత ఇన్నింగ్స్ కూడా ఏమాత్రం ఆశాజనకంగా ప్రారంభం కాలేదు. మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మహమ్మద్ అమీర్ వేసిన రెంతో బంతికే రోహిత్ శర్మ (0) ఎల్‌బిగా అవుటయ్యాడు. అదే ఓవర్‌లో ఆజింక్య రహానే (0)ను కూడా అతను అదే విధంగా పెవిలియన్‌కు పంపాడు. ఒక టి-20 ఇంటర్నేషనల్‌లో భారత ఓపెనర్లు ఇద్దరూ డకౌట్ కావడం ఇదే తొలిసారి. కాగా, ప్రత్యర్థి జట్టుకు చెందిన ఓపెనర్లు ఇద్దరినీ పాకిస్తాన్ డకౌట్ చేయడం ఇది రెండోసారి. మొదటి ఓవర్‌లో రెండు వికెట్లు కూల్చిన అమీర్ తన రెండో ఓవర్‌లో సురేష్ రైనాను అవుట్ చేశాడు. రైనా ఒక పరుగు చేసి వాహెబ్ రియాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఎనిమిది పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియాను విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ ఆదుకున్నారు. వీరు ఏమాత్రం తొందర పడకుండా వ్యూహాత్మకంగా స్కోరును ముందుకు తీసుకెళ్లాడు.
లక్ష్యం చాలా చిన్నదే కావడంతో వేగవంతమైన స్కోరుబోర్డు వెంట పరుగులు తీయాల్సిన అవసరం లేకపోయింది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. 51 బంతులు ఎదుర్కొని, 9 ఫోర్లతో 49 పరుగులు చేసిన కోహ్లీని మహమ్మద్ సమీ ఎల్‌బిగా అవుట్ చేయడంతో 76 పరుగుల స్కోరు వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. హార్డ్ హిట్టర్‌గా పేరు సంపాదించిన హార్దిక్ పాండ్యను అదే ఓవర్ మూడో బంతికి మహమ్మద్ సమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ ధోనీతో కలిసి యువీ మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడ్డాడు. వాహెబ్ రియాజ్ బౌలింగ్‌లో బంతిని ధోనీ బౌండరీకి తరలించడంతో, మరో 27 బంతులు మిగిలి ఉండగానే, భారత్ 5 వికెట్లకు 85 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో మహమ్మద్ అమీర్ 18 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చాడు. మహమ్మద్ సమీకి రెండు వికెట్లు లభించాయి.

స్కోరుబోర్డు
పాకిస్తాన్ ఇన్నింగ్స్: మహమ్మద్ హఫీజ్ సి ధోనీ బి ఆశిష్ నెహ్రా 4, షోయబ్ మాలిక్ సి ధోనీ బి హార్దిక్ పాండ్య 4, ఖుర్రం మంజూర్ రనౌట్ 10, షర్జీల్ ఖాన్ సి ఆజింక్య రహానే బి జస్‌ప్రీత్ బుమ్రా 7, ఉమర్ అక్మల్ ఎల్‌బి యువరాజ్ సింగ్ 3, సర్ఫ్‌రాజ్ అహ్మద్ బి రవీంద్ర జడేజా 25, షహీద్ అఫ్రిదీ రనౌట్ 2, వాహెబ్ రియాజ్ ఎల్‌బి రవీంద్ర జడేజా 2, మహమ్మద్ సమీ సి సురేష్ రైనా బి హార్దిక్ పాండ్య 8, మహమ్మద్ అమీర్ బి హార్దిక్ పాండ్య 1, మహమ్మద్ ఇర్ఫాన్ 0, ఎక్‌స్ట్రాలు 15, మొత్తం (17.3 ఓవర్లలో ఆలౌట్) 83.
వికెట్ల పతనం: 1-4, 2-22, 3-32, 4-35, 5-35, 6-42, 7-52, 8-70, 9-83, 10-83.
బౌలింగ్: ఆశిష్ నెహ్రా 3-0-20-1, జస్‌ప్రీత్ బుమ్రా 3-2-8-1, హార్దిక్ పాండ్య 3.3-0-8-3, యువరాజ్ సింగ్ 2-0-11-1, రవీంద్ర జడేజా 3-0-11-2, రవిచంద్రన్ అశ్విన్ 3-0-21-0.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ ఎల్‌బి మహమ్మద్ అమీర్ 0, ఆజింక్య రహానే ఎల్‌బి మహమ్మద్ అమీర్ 0, సురేష్ రైనా సి వాహెబ్ రియాజ్ బి మహమ్మద్ అమీర్ 1, విరాట్ కోహ్లీ ఎల్‌బి మహమ్మద్ సమీ 49, యువరాజ్ సింగ్ నాటౌట్ 14, హార్దిక్ పాండ్య బి మహమ్మద్ సమీ 0, మహేంద్ర సింగ్ ధోనీ నాటౌట్ 7, ఎక్‌స్ట్రాలు 14, మొత్తం (15.3 ఓవర్లలో 5 వికెట్లకు) 85.
వికెట్ల పతనం: 1-0, 2-2, 3-8, 4-76, 5-76.
బౌలింగ్: మహమ్మద్ అమీర్ 4-0-18-3, మహమ్మద్ సమీ 4-0-16-2, మహమ్మద్ ఇర్ఫాన్ 4-0-16-0, వాహబ్ రియాజ్ 3.3-0-31-0.

నేడు శ్రీలంక, బంగ్లాదేశ్ ఢీ
ఆసియా కప్ టి-20 క్రికెట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు ఢీ కొంటాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ఫైనల్ చేరే అవకాశాలు మెరుగుపడతాయి. కాబట్టి, ఇరు జట్లూ విజయంపై కనే్నశాయి.

హార్దిక్ పాండ్య
(8 పరుగులకు
3 వికెట్లు)