క్రీడాభూమి

క్లీన్ స్వీప్‌పైనే టీమిండియా గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లేకల్, ఆగస్టు 11: శ్రీలంకపై మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఇప్పటికే 2-0 ఆధిక్యంతో సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా శనివారం నుంచి ఇక్కడ మొదలుకానున్న చివరి, మూడో టెస్టును కూడా గెల్చుకొని, క్లీన్ స్వీప్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నది. పలువురు కీలక ఆటగాళ్లు గాయపడిన కారణంగా దినేష్ చండీమల్ నేతృత్వం వహిస్తున్న శ్రీలంక జట్టు బలహీనపడింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రత్యర్థికి వైట్‌వాష్ వేయాలన్న పట్టుదల భారత జట్టులో కనిపిస్తున్నది. మొదటి టెస్టును 304 పరుగుల తేడాతో సాధించిన జట్టులో ఒక మార్పుతో కోహ్లీ రెండో టెస్టు ఆడాడు. అభినవ్ ముకుంద్ స్థానంలో లోకేష్ రాహుల్‌ను బరిలోకి దించాడు. ఆ మ్యాచ్‌ని టీమిండియా ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్ లైనప్ బలంగా ఉన్న భారత్ మొదటి రెండు టెస్టుల్లోనూ 600 పరుగుల మైలురాయిని చేరడం విశేషం. అదే ఒరవడిని చివరి టెస్టులోనూ కొనసాగించే అవకాశాలు లేకపోలేదు. బౌలింగ్‌లోనూ భారత్ పటిష్టంగానే ఉంది. అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యాన్ని కనబరుస్తున్న కోహ్లీ సేనను శ్రీలంక సమర్థంగా ఎదుర్కొంటుందా అన్నది అనుమానమే. పలువురు సీనియర్ ఆటగాళ్లు గాయాలతో బాధపడుతూ, ప్రస్తుత సిరీస్‌కు దూరమయ్యారు. దీనికితోడు, ఇటీవల కాలంలో నిలకడలేని ఆటతో అల్లాడుతున్న ఆ జట్టు ప్రస్తుతం భారీ మార్పులు, ప్రక్షాళన దిశగా వెళుతున్నది. ఈ పరిస్థితుల్లో భారత్ దూకుడుకు అడ్డుకట్టవేయడం లంకకు సులభసాధ్యం కాదన్నది వాస్తవం. అయితే, స్వదేశంలో ‘క్లీన్ స్వీప్’ అవమానాన్ని తప్పించుకోవడానికి లంక ఆటగాళ్లు శక్తివంచన లేకుండా కృషి చేస్తారనడంలో సందేహం లేదు. ఫలితం వారికి అనుకూలంగా ఉంటుందా? లేదా? అన్నది చెప్పలేకపోయినా, మ్యాచ్ చివరి వరకూ ఆసక్తికరంగా సాగడం ఖాయం.
వర్షం బెడద: చివరి టెస్టుకు వర్షం బెడద తప్పకపోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది. శుక్రవారం ఉదయం భారత జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనాల్సి ఉండగా, భారీ వర్షం కారణంగా నెట్స్‌కు వెళ్లలేదు. దీనితో ప్రాక్టీస్‌ను రద్దు చేసుకుంటున్నట్టు టీమిండియా ప్రకటించింది. ఈ అధికారిక ప్రకటన వెలువడిన కొన్ని నిమిషాలకే సూర్యుడు దర్శనమిచ్చాడు. అంతకు ముందు వర్షం కురిసిన జాడ కూడా లేకుండా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వాన దోబూచులాడుతున్న నేపథ్యంలో, చివరి టెస్టు సజావుగా సాగడం కష్టమేనని అంటున్నారు. అయితే, మొదటి రెండు టెస్టులు నాలుగు రోజుల్లోపే ముగిశాయి. చివరి మ్యాచ్‌లో ఒకటిరెండు రోజుల ఆటను కోల్పోయినప్పటికీ, భారత్ సులభంగానే లంకను ఓడిస్తుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది.
ప్రాక్టీస్ లేకపోయినా: ఏదైనా ఒక టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు అన్ని జట్లూ నెట్ ప్రాక్టీస్ చేస్తాయి. అయితే, రెండో టెస్టు ముగిసిన తర్వాత టీమిండియా కేవలం ఒకే ఒక రోజు నెట్స్‌కు హాజరైంది. శుక్రవారం పూర్తి సెషన్ ప్రాక్టీస్ చేయాలని అనుకుంది. కానీ, వర్షం కారణంగా ఆ నిర్ణయాన్ని రద్దు చేసుకుంది. అయితే, ప్రాక్టీస్ లేకపోయినా, లంకతో మూడో టెస్టును ఆడడంలో టీమిండియాకు ఎలాంటి ఇబ్బంది ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అన్ని విభాగాల్లోనూ కోహ్లీ బృందం పటిష్టంగా ఉందని, కాబట్టి ప్రాక్టీస్ లేకపోయినా నష్టం లేదని కొంత మంది వాదన.
తుది జట్టులో కుల్దీప్: శ్రీలంకతో శనివారం నుంచి ప్రారంభం కానున్న మూడవ, చివరి టెస్టులో ఆడే అవకాశం భారత యువ ఆటగాడు కుల్దీప్ యాదవ్‌కు లభించే అవకాశాలున్నాయి. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడిన కారణంగా ఒక మ్యాచ్ సస్పెన్షన్‌ను ఎదుర్కొంటున్న జడేజా చివరి టెస్టులో ఆడే అవకాశాన్ని కోల్పోయాడు. దీనితో అతని స్థానంలో అక్షర్ పటేల్‌ను పల్లేకల్‌కు బిసిసిఐ పంపింది. అతను జట్టుతో కలిసినప్పటికీ, ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కించుకోవడం అనుమానంగా ఉందని విశే్లషకుల అభిప్రాయం. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, కుల్దీప్‌ను తుది జట్టులోకి తీసుకుంటారన్న వాదన బలంగా వినిపిస్తున్నది.