క్రీడాభూమి

ధావన్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లేకల్, ఆగస్టు 12: ఓపెనర్ శిఖర్ ధావన్ శతకాన్ని, మరో ఓపెనర్ లోకేష్ రాహుల్ హాఫ్ సెంచరీ నమోదు చేయగా, మిడిల్ ఆర్డర్ విఫలం కావడంతో, శ్రీలంకతో శనివారం ఇక్కడ ప్రారంభమైన చివరి, మూడో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లకు 329 పరుగులు సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ధావన్, రాహుల్ చక్కటి ఆరంభాన్నిచ్చారు. లంక బౌలింగ్‌ను ఏమాత్రం లక్షపెట్టకుండా పరుగుల వేట కొనసాగించారు. ధావన్‌తో కలిసి మొదటి వికెట్‌కు 188 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించిన తర్వాత రాహుల్ అవుటయ్యాడు. అతను 135 బంతులు ఎదుర్కొని, 85 పరుగులు సాధించి, మలింద పుష్పకుమార బౌలింగ్‌లో దిముత్ కరుణరత్నేకు చిక్కాడు. జట్టు స్కోరు 200 పరుగులు మైలురాయి దాటిన తర్వాత ధావన్ కూడా వెనుదిరిగాడు. 123 బంతుల్లో 119 పరుగులు చేసిన అతను కూడా మలింద పుష్పకుమార బౌలింగ్‌లోనే దినేష్ చండీమల్ క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు. ధావన్ అవుటైన తర్వాత మిడిల్ ఆర్డర్ పతనం కొనసాగింది. చటేశ్వర్ పుజారా కేవలం 8 పరుగులకే చేతులెత్తేయగా, అజింక్య రహానే 17 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అవుటయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కొద్ది సేపు క్రీజ్‌లో నిలబడే ప్రయత్నం చేసి, 42 పరుగులు సాధించిన అనంతరం లక్షన్ సండాకన్ బౌలింగ్‌లో దిముత్ కరుణరత్నే చక్కటి క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. రవిచంద్రన్ అశ్విన్ 31 పరుగులు చేసి విశ్వ ఫెర్నాండో బౌలింగ్‌లో వికెట్‌కీపర్ నిరోషన్ డిక్‌విల్లాకు దొరికిపోయాడు. 90 బంతుల్లో టీమిండియా 6 వికెట్లకు 329 పరుగులు చేసింది. అప్పటికి వృద్ధిమాన్ సాహా 13, హార్దిక్ పాండ్య ఒక పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. లంక బౌలర్లలో మలింత పుష్పకుమార 40 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చాడు. లక్షన్ సండాకన్‌కు రెండు వికెట్లు లభించాయి.
ఒకే సిరీస్‌లో రెండు శతకాలు
భారత ఓపెనర్ శిఖర్ ధావన్ కెరీర్‌లో ఆరో సెంచరీ నమోదు చేశాడు. ఒక టెస్టు సిరీస్‌లో అతను రెండు సెంచరీలు సాధించడం ఇదే మొదటిసారి. గాలే టెస్టులో 190 పరుగులు చేసిన అతను చివరిదైన మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 119 పరుగులు సాధించాడు. అతని ఆరు సెంచరీల్లో ఐదు విదేశాల్లో చేసినవే కావడం విశేషం. టెస్టుల్లో శ్రీలంకపై మూడు సెంచరీలు సాధించిన రెండో భారత క్రికెటర్‌గా ధావన్ రికార్డు పుటల్లోకి ఎక్కాడు. ఇంతకు ముందు సెవాగ్ ఈ ఫీట్ సాధించాడు.
విరాట్ కోహ్లీ నాయకత్వంలో ధావన్ 1,000 పరుగులను పూర్తి చేయడం విశేషం. కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించిన 14 టెస్టుల్లో ఆడిన ధావన్ 49.19 సగటుతో ఇప్పటి వరకూ 1,033 పరుగులు చేశాడు. ఇందులో నాలుగస సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఈ టెస్టు సిరీస్‌లో ధావన్ ఇంత వరకూ నాలుగు ఇన్నింగ్స్ ఆడి, 89.50 సగటుతో 358 పరుగులు చేశాడు. శ్రీలంకలో లంక జట్టుపై ఇంతకంటే మెరుగైన సగటును ఎవరూ నమోదు చేయలేదు. సచిన్ తెండూల్కర్ 78 పరుగుల సగటుతో ఇంత వరకూ అగ్రస్థానంలో ఉండగా, అతనిని ధావన్ రెండో స్థానానికి నెట్టేశాడు.
రికార్డు భాగస్వామ్యం
శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్ మొదటి వికెట్‌కు 188 పరుగులు జోడించి సరికొత్త రికార్డు నెలకొల్పారు. పల్లేకల్‌లో జరిగిన టెస్టుల్లో ఇ ప్పటి వరకూ తొలి వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఇతర వికెట్లకు నమోదైన భాగస్వామ్యాలను కూడా పరిగణలోకి తీసుకుంటే, కేవలం రెండు మాత్రమే ఇంతకంటే మెరుగైన స్కోర్లు ఉన్నాయి. 2012లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు మైక్ హస్సీ, షాన్ మార్ష్ నాలుగో వికెట్‌కు 258, పాకిస్తాన్ క్రికెటర్లు షాన్ మసూద్, యూనిస్ ఖాన్ 2015లో మూడో వికెట్‌కు 242 పరుగులు సాధించారు. ఇలావుంటే, 2011 జనవరి నుంచి ఇప్పటి వరకూ టీమిండియా విదేశాల్లో 65 టెస్టు ఇన్నింగ్స్ ఆడింది. వాటిలో ధావన్, రాహుల్ సాధించిన 188 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం రెండో స్థానాన్ని ఆక్రమించింది. 2015లో ఫతుల్లా టెస్టులో బంగ్లాదేశ్‌పై ధావన్, మురళీ విజయ్ తొలి వికెట్‌కు 282 పరుగులు జోడించారు.
ద్రవిడ్ రికార్డును అధిగమించిన రాహుల్
లోకేష్ రాహుల్ కెరీర్‌లో తొమ్మిదో అర్ధ శతకాన్ని సాధించాడు. శ్రీలంకపై అతనికి ఇది రెండో హాఫ్ సెంచరీ. టెస్టుల్లో అతను వరుసగా ఏడో అర్ధ శతకాన్ని నమోదు చేసి, గుండప్ప విశ్వనాథ్, రాహుల్ ద్రవిడ్ రికార్డును అధిగమించాడు. విశ్వనాథ్, రాహుల్ ద్రవిడ్ చెరి ఆరు వరుస అర్ధ శతకాలను సాధించారు. కాగా, వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు చేసిన సర్ ఎవర్టన్ వీక్స్ (వెస్టిండీస్), శివనారైన్ చందర్‌పాల్ (వెస్టిండీస్), ఆండీ ఫ్లవర్ (జింబాబ్వే), కుమార సంగక్కర (శ్రీలంక), క్రిస్ రోజర్స్ (ఆస్ట్రేలియా) సరసన రాహుల్ చోటు దక్కించుకున్నాడు. ఏడు టెస్టుల్లో అతను 54.70 సగటుతో 547 పరుగులు చేయడం విశేషం.

స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: శిఖర్ ధావన్ సి దినేష్ చండీమల్ బి మలింద పుష్పకుమార 119, లోకేష్ రాహుల్ సి దిముత్ కరుణరత్నే బి మలింద పుష్పకుమార 85, చటేశ్వర్ పుజారా సి ఏంజెలో మాథ్యూస్ బి లక్షన్ సండాకన్ 8, విరాట్ కోహ్లీ సి దిముత్ కరుణరత్నే బి లక్షన్ సండాకన్ 42, అజింక్య రహానే బి మలింద పుష్పకుమార 17, రవిచంద్రన్ అశ్విన్ సి నిరోషన్ డిక్‌విల్లా బి విశ్వ ఫెర్నాండో 31, వృద్ధిమాన్ సాహా 13 నాటౌట్, హార్దిక్ పాండ్య 1 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 13, మొత్తం (90 ఓవర్లలో 6 వికెట్లకు) 329.
వికెట్ల పతనం: 1-188, 2-219, 3-229, 4-264, 5-296, 6-322.
బౌలింగ్: విశ్వ ఫెర్నాండో 19-2-68-1, లాహిరు కుమార 15-1-67-0, దిముత్ కరుణరత్నే 5-0-23-0, దిల్‌రువాన్ పెరెరా 8-1-36-0, లక్షన్ సండాకన్ 25-2-84-2, మలింద పుష్పకుమార 18-2-40-3.

చిత్రాలు.. లోకేష్ రాహుల్
*కెరీర్‌లో ఆరో టెస్టు శతకం సాధించిన భారత ఓపెనర్ శిఖర్ ధావన్