క్రీడాభూమి

హార్దిక్ పాండ్య సూపర్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లేకల్, ఆగస్టు 13: శ్రీలంకతో జరుగుతున్న చివరి, మూడో టెస్టులోనూ విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా పట్టు బిగించింది. రెండో టెస్టులో ఆరు వందలకుపైగా పరుగులు చేసి, ఆతర్వాత శ్రీలంకను ఫాలో ఆన్‌కు దింపిన భారత్, ఈ టెస్టులోనూ సత్తా చాటింది. దీనితో శ్రీలంకకు వరసగా రెండోసారి ఫాలో ఆన్ తప్పలేదు. ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుతున్న హార్దిక్ పాండ్య కెరీర్‌లో మొదటిసారి టెస్టుల్లో సెంచరీ నమోదు చేయడంతో, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులు సాధించగలిగింది. ఆతర్వాత లంకను మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 135 పరుగులకే ఆలౌట్ చేసి, 352 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఫాలో ఆన్‌లోనూ లంకను దెబ్బతీసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి లంక తన రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కోల్పోయి 19 పరుగులు చేయగలిగింది.
మొదటి రోజు ఆటలో ఆరు వికెట్లకు 329 పరుగులు సాధించిన భారత్ అదే ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు, ఆదివారం ఉదయం ఆటను కొనసాగించింది. అయితే, 339 పరుగుల వద్ద వృద్ధిమాన్ సాహా వికెట్‌ను కోల్పోయింది. అతను 43 బంతుల్లో 16 పరుగులు చేసి, విశ్వ ఫెర్నాండో బౌలింగ్‌లో దిల్‌రువాన్ పెరెరా క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. టెయిలెండర్లు మిగిలినప్పటికీ, హార్దిక్ విజృంభించి ఆడాడు. వనే్డ ఆటను తలపిస్తూ, లంచ్ విరామం లోపే సెంచరీ పూర్తి చేశాడు. అతనికి చక్కటి సహకారాన్ని అందించిన యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 73 బంతుల్లో 26 పరుగులు చేసి, లక్షన్ సండాకన్ బౌలింగ్‌లో నిరోషన్ డిక్‌విల్లా క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. మహమ్మద్ షమీ ఎనిమిది పరుగులు చేసి సండాకన్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 96 బంతులు ఎదుర్కొని, 108 పరుగులు సాధించిన హార్దిక్‌ను దిల్‌రువాన్ పెరెరా క్యాచ్ పట్టగా సండాకన్ అవుట్ చేయడంతో 112.3 ఓవర్లలో 487 పరుగుల వద్ద భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. అప్పటికి ఉమేష్ యాదవ్ మూడు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. లంక బౌలర్లలో సండాకన్ ఐదు వికెట్లు పడగొట్టగా, మలింద పుష్పకుమార మూడు, విశ్వ ఫెర్నాండో రెండు చొప్పున వికెట్లు సాధించారు.
ఓపెనర్లు విఫలం
భారత్ భారీ స్కోరుకు సమాధానం చెప్పడానికి తొలి ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన శ్రీలంకకు మొదట్లోనే ఎదురుదెబ్బ తిగిలింది. ఓపెనర్లు దిముత్ కరుణరత్నే (4), ఉపుల్ తరంగ (5) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో కంగుతిన్న లంకకు కుశాల్ మేండిస్, కెప్టెన్ దినేష్ చండీమల్ అండగా నిలిచే ప్రయత్నం చేవారు. కానీ, 18 పరుగులు చేసిన కుశాల్ మేండిస్ రనౌట్ కావడంతో లంక పీకల్లోతు కష్టాల్లో పడింది. మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్, దిల్‌రువాన్ పెరెరా విశ్వ ఫెర్నాండో పరుగుల ఖాతాలను తెరవకుండానే అవుటయ్యారు. చండీమల్ 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, డిక్‌విల్లా 29 పరుగులు సాధించాడు. మిగతా వారు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 37.4 ఓవర్లలో 135 పరుగులతో లంక తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 13 ఓవర్లలో 40 పరుగులిచ్చి, నాలుగు వికెట్లు కూల్చాడు. మహమ్మద్ షమీ, రవిచంద్ర అశ్విన్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు.
మొదటి ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైన శ్రీలంక ఫాలో ఆన్‌లో రెండో ఇన్నింగ్స్ ఆడుతూ 15 పరుగుల వద్ద ఉపుల్ తరంగ రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. ఏడు పరుగులు చేసిన అతనిని ఉమేష్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి లంక రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. దిముత్ కరుణరత్నే (12), మలింద పుష్పకుమార (0) క్రీజ్‌లో ఉన్నారు.

* ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో ఒక్క సెంచరీ కూడా చేయకుండా, కెరీర్‌లో తొలి శతకాన్ని టెస్టు మ్యాచ్‌లో సాధించిన ఐదో భారత బ్యాట్స్‌మన్‌గా హార్దిక్ పాండ్య రికార్డు నెలకొల్పాడు. గతంలో విజయ్ మంజ్రేకర్, కపిల్ దేవ్, అజయ్ రత్రా, హర్భజన్ సింగ్ కూడా ఇదే విధంగా ఫస్ట్‌క్లాస్ శతకాన్ని మొదట టెస్టు మ్యాచ్‌లోనే చేశారు.
* గాలేలో జరిగిన మ్యాచ్‌తో టెస్టు కెరీర్‌ను ప్రారంభించిన హార్దిక్ ఆ మ్యాచ్‌లో 50 పరుగులు చేశాడు. ఈ టెస్టులో 108 పరుగులు సాధించాడు. కెరీర్‌లో తొలి ఫస్ట్ క్లాస్ సెంచరీని అతను 96 బంతుల్లోనే చేయడం విశేషం. ఈ స్కోరులో ఏడు సిక్సర్లు ఉన్నాయి. ఒక టెస్టులో ఎనిమిది లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి, అత్యధిక సిక్సర్లు సాధించిన భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. అంతేగాక, భోజన విరామ సమయానికి ముందే అతను సెంచరీ పూర్త చేశాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో లంచ్ విరామంలోపే శతకాన్ని నమోదు చేసిన మొదటి భారత క్రికెటర్‌గా మరో రికార్డు సృష్టించాడు.
* మలింద పుష్పకుమార వేసిన ఒక ఓవర్‌లో హార్దిక్ 26 పరుగులు రాబట్టాడు. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో, ఒకే ఓవర్‌లో ఎక్కువ పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా మరో రికార్డు హార్దిక్ ఖాతాలో చేరింది. మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌పై సందీప్ పాటిల్ 1982లో, అదే జట్టుపై లార్డ్స్ మైదానంలో కపిల్ దేవ్ 1990లో ఒక ఓవర్‌లో 24 చొప్పున పరుగులు సాధించగా, ఆ రికార్డును హార్దిక్ అధిగమించాడు.

స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 6 వికెట్లకు 329): శిఖర్ ధావన్ సి దినేష్ చండీమల్ బి మలింద పుష్పకుమార 119, లోకేష్ రాహుల్ సి దిముత్ కరుణరత్నే బి మలింద పుష్పకుమార 85, చటేశ్వర్ పుజారా సి ఏంజెలో మాథ్యూస్ బి లక్షన్ సండాకన్ 8, విరాట్ కోహ్లీ సి దిముత్ కరుణరత్నే బి లక్షన్ సండాకన్ 42, అజింక్య రహానే బి మలింద పుష్పకుమార 17, రవిచంద్రన్ అశ్విన్ సి నిరోషన్ డిక్‌విల్లా బి విశ్వ ఫెర్నాండో 31, వృద్ధిమాన్ సాహా సి దిల్‌రువాన్ పెరెరా బి విశ్వ ఫెర్నాండో 16, హార్దిక్ పాండ్య సి దిల్‌రువాన్ పెరెరా బి లక్షన్ సండాకన్ 108, కుల్దీప్ యాదవ్ సి నిరోషన్ డిక్‌విల్లా బి లక్షన్ సండాకన్ 26, మహమ్మద్ షమీ సి అండ్ బి లక్షన్ సండాకన్ 8, ఉమేష్ యాదవ్ 3 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 24, మొత్తం (122.3 ఓవర్లలో ఆలౌట్) 487.
వికెట్ల పతనం: 1-188, 2-219, 3-229, 4-264, 5-296, 6-322, 7-339, 8-401, 9-421, 10-487.
బౌలింగ్: విశ్వ ఫెర్నాండో 26-3-87-2, లాహిరు కుమార 23-1-104-0, దిముత్ కరుణరత్నే 7-0-30-0, దిల్‌రువాన్ పెరెరా 8-1-36-0, లక్షన్ సండాకన్ 35.3-4-132-5, మలింద పుష్పకుమార 23-2-82-3.
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: దిముత్ కరుణరత్నే సి వృద్ధిమాన్ సాహా బి మహమ్మద్ షమీ 4, ఉపుల్ తరంగ సి వృద్ధిమాన్ సాహా బి మహమ్మద్ షమీ 5, కుశాల్ మేండిస్ రనౌట్ 18, దినేష్ చండీమల్ సి లోకేష్ రాహుల్ బి అశ్విన్ 48, ఏంజెలో మాథ్యూస్ ఎల్‌బి హార్దిక్ పాండ్య 0, నిరోషన్ డిక్‌విల్లా స్టంప్డ్ వృద్ధిమాన్ సాహా బి కుల్దీప్ యాదవ్ 29, దిల్‌రువాన్ పెరెరా సి హార్దిక్ పాండ్య బి కుల్దీప్ యాదవ్ 0, మలింద పుష్పకుమార బి కుల్దీప్ యాదవ్ 10, లక్షన్ సండాకన్ సి శిఖర్ ధావన్ బి అశ్విన్ 10, విశ్వ ఫెర్నాండో బి కుల్దీప్ యాదవ్ 0, లాహిరు కుమార 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 11,
మొత్తం (37.4 ఓవర్లలో ఆలౌట్) 135. వికెట్ల పతనం: 1-14, 2-23, 3-38, 4-38, 5-101, 6-107, 7-125, 8-125, 9-135, 10-135.
బౌలింగ్: మహమ్మద్ షమీ 6.5-1-17-2, ఉమేష్ యాదవ్ 3.1-0-23-0, హార్దిక్ పాండ్య 6-1-28-1, కుల్దీప్ యాదవ్ 13-2-40-4, రవిచంద్రన్ అశ్విన్ 8.4-2-22-2.
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ (్ఫలో ఆన్): దిముత్ కరుణరత్నే 12 నాటౌట్, ఉపుల్ తరంగ బి ఉమేష్ యాదవ్ 7, మలింద పుష్పకుమార 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 0, మొత్తం (13 ఓవర్లలో వికెట్ నష్టానికి) 19.
వికెట్ల పతనం: 1-15.
బౌలింగ్: మహమ్మద్ షమీ 4-2-7-0, రవిచంద్రన్ అశ్విన్ 6-4-5-0, ఉమేష్ యాదవ్ 2-0-3-1, కుల్దీప్ యాదవ్ 1-0-4-0.

చిత్రం.. హార్దిక్ పాండ్య