క్రీడాభూమి

వనే్డల్లో భారత్ బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దంబుల్లా, ఆగస్టు 20: మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో శ్రీలంకపై 3-0 తేడాతో క్లీన్ స్వీప్ సాధించిన విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వనే్డ సిరీస్‌లో బోణీ చేసింది. ఆదివారం జరిగిన మొదటి వనే్డను మరో 127 బంతులు మిగిలి ఉండగానే, తొమ్మిది వికెట్ల తేడాతో సొంతం చేసుకుంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో, తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 43.2 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. అనంతరం టీమిండియా లక్ష్యాన్ని 28.5 ఓవర్లలో, కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది.
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆహ్వానంపై ఇన్నింగ్స్‌ను ఆరంభించిన శ్రీలంకకు ఓపెనర్లు నిరోషన్ డిక్‌విల్లా, దనుష్క గుణతిలక చక్కటి ఆరంభాన్నిచ్చే ప్రయత్నం చేశారు. మొదటి వికెట్‌కు 74 పరుగులు జత కలిసిన తర్వాత గుణతిలక వికెట్ కూలింది. 44 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లతో 35 పరుగులు చేసిన అతను లోకేష్ రాహుల్ క్యాచ్ అందుకోగా, యుజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. టాప్ స్కోరర్ డిక్‌విల్లా 74 బంతుల్లో 64 పరుగులు చేసి కేదార్ జాధవ్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. అతని స్కోరులో ఎనిమిది ఫోర్లు ఉన్నాయి. ఓపెనర్లు ఇద్దరూ అవుటైన తర్వాత, ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్ కుశాల్ మేండిస్ 936), మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (36 నాటౌట్) తప్ప మిగతా వారెవరూ జట్టుకు అండగా నిలవలేకపోయారు. ఫలితంగా 50 ఓవర్లు కూడా ఆడలేక, ఇంకా 40 బంతులు మిగిలివుండగానే 216 పరుగులకు శ్రీలంక ఆలౌటైంది. అక్షర్ పటేల్ 34 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. జస్‌ప్రీత్ బుమ్రా, కేదార్ జాధవ్, యుజువేంద్ర చాహల్ తలా రెండేసి వికెట్లు కూల్చారు.
పసలేని లంక బౌలింగ్
పటిష్టమైన భారత బ్యాటింగ్ లైనప్ ముందు శ్రీలంక పసలేని బౌలింగ్ వెలవెలబోయింది. రోహిత్ శర్మ నాలుగు పరుగులు చేసి రనౌటయ్యాడు. అప్పడు భారత్ స్కోరు 23 పరుగులు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనర్ శిఖర్ ధావన్ మరో వికెట్ కూలకుండా, 28.5 ఓవర్లలో జట్టును గెలిపించాడు. 90 బంతులు ఎదుర్కొన్న అతను 20 ఫోర్లు, మూడు సిక్సర్లతో 132 పరుగులు సాధించగా, విరాట్ కోహ్లీ 70 బంతుల్లో, 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ధావన్‌కు కెరీర్‌లో ఇది 87వ వనే్డకాగా, 11వ శతకం. 190వ వనే్డ ఆడిన కోహ్లీ 44వ అర్ధ శతకాన్ని నమోదు చేశాడు.

స్కోరుబోర్డు
శ్రీలంక ఇన్నింగ్స్: నిరోషన్ డిక్‌విల్లా ఎల్‌బి కేదార్ జాధవ్ 64, దనుష్క గుణతిలక సి లోకేష్ రాహుల్ బి యుజువేంద్ర చాహల్ 35, కుశాల్ మేండిస్ బి అక్షర్ పటేల్ 36, ఉపుల్ తరంగ సి శిఖర్ ధావన్ బి కేదార్ జాధవ్ 13, ఏంజెలో మాథ్యూస్ 36 నాటౌట్, చామర కపుగడేర రనౌట్ 1, వనిదు హసరంగ సి కేదార్ జాధవ్ బి అక్షర్ పటేల్ 2, తిసర పెరెరా బి జస్‌ప్రీత్ బుమ్రా 0, లక్షన్ సండాకన్ ఎల్‌బి అక్షర్ పటేల్ 5, లసిత్ మలింగ స్టంప్డ్ మహేంద్ర సింగ్ ధోనీ బి యుజువేంద్ర చాహల్ 8, విశ్వ ఫెర్నాండో బి జస్‌ప్రీత్ బుమ్రా 0, ఎక్‌స్ట్రాలు 16, మొత్తం (43.2 ఓవర్లలో ఆలౌట్) 216.
వికెట్ల పతనం: 1-74, 2-139, 3-150, 4-166, 5-169, 6-176, 7-178, 8-187, 9-209, 10-216.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 6-0-33-0, హార్దిక్ పాండ్య 6-0-35-0, జస్‌ప్రీత్ బుమ్రా 6.2-0-22-2, యుజువేంద్ర చాహల్ 10-0-60-2, కేదార్ జాధవ్ 5-0-26-2, అక్షర్ పటేల్ 10-0-34-3.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ రనౌట్ 4, శిఖర్ ధావన్ 132 నాటౌట్, విరాట్ కోహ్లీ 82 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 2, మొత్తం (28.5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 220.
వికెట్ల పతనం: 1-23, బౌలింగ్: లసిత్ మలింగ 8-0-52-0, విశ్వ ఫెర్నాండో 6-0-43-0, ఏంజెలో మాథ్యూస్ 2-0-9-0, తిసర పెరెరా 2-0-18-0, లక్షన్ సండాకన్ 6-0-63-0, వనిదు హసరంగ 4.5-0-35-0.

చిత్రాలు.. రెండో వికెట్‌కు అజేయంగా 197 పరుగులు జోడించి భారత్‌కు తిరుగులేని విజయాన్ని అందించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, సెంచరీ హీరో శిఖర్ ధావన్. (కుడి)* మూడు వికెట్లు పడగొట్టిన అక్షర్ పటేల్