క్రీడాభూమి

వారి వైఖరితోనే నష్టం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దంబుల్లా, ఆగస్టు 21: జట్టు వ్యవహారాల్లో బయటి వ్యక్తుల జోక్యం విపరీతంగా ఉందని, భారత్‌తో ఆదివారం జరిగిన మొదటి వనే్డలో తొమ్మిది వికెట్ల తేడాతో పరాజయాన్ని ఎదుర్కోవడానికి ఇదే ప్రధాన కారణమని శ్రీలంక తాత్కాలిక కోచ్ నిక్ పోథాస్ అన్నాడు. జట్టుతో ఏమాత్రం సంబంధాలు లేకపోయినా, విమర్శలు గురిపిస్తూ, ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘కొన్నాళ్లు ఆటగాళ్లను విడిచిపెట్టండి. వారిని ఆటపై శ్రద్ధ పెట్టే పరిస్థితులు కల్పించండి. ఆరు నెలల కాలంలో నిలకడగా రాణించే జట్టు తయారవుతుంది’ అని సుమారు రెండు నెలల క్రితం గ్రాహం ఫోర్డ్ నుంచి శ్రీలంక కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న దక్షిణాఫ్రికా మాజీ వికెట్‌కీపర్ పోథాస్ అన్నాడు. జట్టులో ప్రతిభావంతులు ఉన్నారని, ప్రమాణాల విషయంలో వారు ఎవరికీ తీసిపోరని స్పష్టం చేశాడు. ‘వారికి కొంత సమయం ఇవ్వడం. కొంత ప్రేమను పంచండి. వారి పట్ల కొంత శ్రద్ధ వహించండి. వారిలో ఆత్మవిశ్వాసం నింపండి. అతి తక్కువ సమయంలోనే అద్భుతమైన ఫలితాలను చూడవచ్చు’ అని లంక క్రికెట్ అధికారులు, అనధికారులు, మాజీ క్రికెటర్లు తదితరులను కోరాడు. పోథాస్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత శ్రీలంక స్వదేశంలో, జింబాబ్వే వంటి అత్యంత సాధారణ జట్టు చేతిలో వనే్డ సిరీస్‌ను 0-3 తేడాతో చేజార్చుకుంది. ఆతర్వాత భారత్‌ను మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఢీకొని, 0-3 తేడాతో వైట్‌వాష్ వేయించుకుంది. విరాట్ కోహ్లీ సేనతో ఆదివారం జరిగిన మొదటి వనే్డ ఇంటర్నేషనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసి 216 పరుగులకే కుప్పకూలింది. బౌలింగ్‌లోనూ విఫలం కావడంతో, భారత్ 9 వికెట్ల ఆధిక్యంతో విజయభేరి మోగించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో శ్రీలంక 0-1 తేడాతో వెనుకబడింది. వరుస పరాజయాలతో అల్లాడుతున్న శ్రీలంక జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగడంతో పోథాస్ స్పందించక తప్పలేదు. అయితే, పరాజయానికి ఆటగాళ్ల వైఫల్యాల కంటే, జట్టు వ్యవహారాల్లో బయటి శక్తుల జోక్యమే ప్రధాన కారణమని అతను స్పష్టం చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సంయమనం కోల్పోతారని, ఆత్మవిశ్వాసం లోపించడంతో నిలకడగా ఆడలేరని అన్నాడు. అత్యుత్తమ సేవలు అందించడానికి క్రికెటర్లంతా శ్రమిస్తున్నారని, అయితే, వారికి సరైన ప్రోత్సాహం లభించడం లేదని పోథాస్ అన్నాడు. ఆటగాళ్లను మానసికంగా కుంగతీసే రీతిలో కొంత మంది వ్యవహరిస్తున్నారని, ఆ విధానం మారితే లంక జట్టుకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నాడు.

చిత్రం..నిక్ పోథాస్