క్రీడాభూమి

టి-20 వరల్డ్ కప్ మ్యాచ్‌కి భద్రత కల్పించలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల: భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య టి-20 వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా ఈనెల 19న ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్‌పై సందేహాలు ముసురుకున్నాయి. సహజంగానే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ తీవ్రమైన ఉద్రిక్తతల మధ్య జరుగుతుంది. దీనికితోడు టి-20 వరల్డ్ కప్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీ కావడంతో అంచనాలు మరింత భారీగా ఉంటాయి. ఈ మ్యాచ్‌కి భద్రతను కల్పించలేమని హిమాచల్ ప్రదేశ్ (హెచ్‌పి) ప్రభుత్వం చేతులెత్తేయడంతో ఏం చేయాలో అర్థంగాక భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) మల్లగుల్లాలు పడుతున్నది. భారత్, పాక్ మ్యాచ్‌కి భద్రత కల్పించడం సాధ్యం కాదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు హెచ్‌పి ముఖ్యమంత్రి వీర్‌భద్ర సింగ్ లేఖ రాయడంతో, అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పోరు ధర్మశాలలో జరుగుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
రాజకీయ కుట్ర: అనురాగ్ ఠాకూర్
భారత్, పాక్ మ్యాచ్‌కి భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం కష్టసాధ్యమని వీర్‌భద్ర సింగ్ రాసిన లేఖపై బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తీవ్రంగా స్పందించాడు. వీర్‌భద్ర సింగ్ రాసిన లేఖను రాజకీయ కుట్రగా అభివర్ణించాడు. ఇటీవల దక్షిణ ఆసియా గేమ్స్ (శాగ్)కు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన అస్సాం, మేఘాలయ రాష్ట్రాలు పోటీలో పాల్గొన్న వందలాది మంది పాక్ అథ్లెట్లకు భద్రత కల్పించలేదా? అని ఠాకూర్ ప్రశ్నించాడు. ఈ రెండు రాష్ట్రాలు సమర్థంగా భద్రతా ఏర్పాట్లు చేసినప్పుడు హిమాచల్ ప్రదేశ్‌కు ఎందుకు సాధ్యం కాదని నిలదీశాడు. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం కుటిల నీతితో, రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నదని లోక్‌సభలో బిజెపి సభ్యుడిగా ఉన్న ఠాకూర్ ఆరోపించాడు. భారత్‌లో తమ క్రికెటర్లకు సరైన భద్రత ఉండదేమోనని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, వాటిని బలపరిచే విధంగా వీర్‌భద్ర సింగ్ చర్యలు ఉన్నాయని వ్యాఖ్యానించాడు. భారత్‌లో భద్రతపై పాక్ చేస్తున్న వ్యాఖ్యలను నిరూపించేందుకే హెచ్‌పి సర్కారు ప్రయత్నిస్తున్నదని అన్నాడు. టి-20 వరల్డ్ కప్ షెడ్యూలు ఏడాది క్రితమే ఖరారైందని, ఆరు నెలల క్రితం వేదికలను ప్రకటించామని ఠాకూర్ గుర్తుచేశాడు. అప్పుడు ఏమీ మాట్లాడకుండా, అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా వౌనం వహించిన వీర్‌భద్ర సింగ్ తీరా మ్యాచ్ సమీపించిన తర్వాత, చివరి క్షణాల్లో భద్రత కల్పించలేమంటూ లేఖ రాయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించాడు. ఇలాంటి కుటిల రాజకీయాలకు స్వస్తి చెప్పాలని కాంగ్రెస్ పార్టీకి హితవు పలికాడు.

చిత్రం... ధర్మశాలలోని హెచ్‌పిసిఎ స్టేడియం. (ఇన్‌సెట్‌లో) హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్‌భద్ర సింగ్ (ఎడమ),
భారత క్రికెట్ నియంత్రణ బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్