క్రీడాభూమి

ఎక్కడైనా ఆడగలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీర్పూర్: ప్రస్తుత భారత జట్టు సమతూకంతో కూడుకుని ఉందని, ప్రపంచంలో ఎక్కడైనా, ఏ జట్టునైనా ఓడించే సత్తా కలిగి ఉందని టీమిండియా కెప్టెన్ అభిప్రాయ పడుతున్నాడు. ‘ఈ ఏడాది టి-20 మ్యాచ్‌లలో తాము ఆడుతున్న ఈ జట్టును చూసినట్లయితే ప్రపంచంలో ఎక్కడైనా ఈ ఫార్మెట్‌లో ఆడగల జట్టుగా ఎవరికైనా కనిపిస్తుంది. 50 ఓవర్ల ఫార్మెట్ గురించి నేను మాట్లాడడం లేదు. టి-20 ఫార్మెట్‌లో ఈ జట్టుతో ఎక్కడైనా ఆడగలం’ అని గురువారం రాత్రి ఆసియా కప్‌లో యుఏఇ జట్టును 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ధోనీ అన్నాడు. ‘ఇప్పుడు జట్టులో ముగ్గురు సరయిన సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లు, అవసరమైతే పార్ట్‌టైమర్లు ఉన్నారు. ఇది సరయిన కూర్పని నేను అనుకుంటున్నాను.ఒక వేళ అదనంగా కొన్ని పరుగులిచ్చినా ఇప్పుడున్న బ్యాటింగ్ సామర్థ్యాన్ని బట్టి ఆ అదనపు పరుగులను సునాయాసంగా రాబట్టగలం. అందుకే భారత్‌లో కానీ, బైటకానీ ఎక్కడ ఆడినా, ఎలాంటి పరిస్థితుల్లో నైనా ఆడగలమని నేను అనుకుంటున్నా. ఇది చక్కటి సమతూకంతో కూడిన జట్టుగా కనిపిస్తోంది’ అని ధోనీ అన్నాడు. కాగా, ఇప్పుడు మీరు ఆడుతున్న టోర్నమెంటే బంగ్లాదేశ్‌లో చివరి టోర్నమెంటా అని బంగ్లాదేశ్‌కు చెందిన ఓ విలేఖరి సుదీర్ఘంగా ప్రశ్నించగా, ధోనీ నవ్వుతూ, ‘నేను అంత త్వరగా అలసిపోను, బంగ్లాదేశ్ నన్ను చాలా సార్లు ఎదుర్కోవలసి ఉంటుంది. సమాధానంకన్నా పొడుగ్గా ఉన్న ప్రశ్న అడిగిన సందర్భాల్లో ఇదొకటి’ అని అన్నప్పుడు మీడియా సమావేశంలో పాల్గొన్న వారంతా గొల్లున నవ్వేశారు. కాగా, బంగ్లాదేశ్‌కు పరిస్థితుల గురించి బాగా తెలుసుగనుక ఆదివారం జరగబోయే ఫైనల్ మ్యాచ్ క్లిష్టంగా ఉండవచ్చని ధోనీ అభిప్రాయ పడ్డాడు.
ప్రపంచ టిటి చాంపియన్‌షిప్స్‌లో
ఫైనల్స్‌కు చేరిన భారతీయులు
కౌలాలంపూర్, మార్చి 4: కౌలాలంపూర్‌లో జరుగుతున్న ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్ రెండో డివిజన్‌లో భారత్ అటు పురుషుల విభాగంతో పాటు ఇటు మహిళల విభాగంలో ఫైనల్స్‌కు దూసుకెళ్లి సత్తా చాటుకుంది. ఆచంట శరత్ కమల్ నేతృత్వంలోని పురుషుల జట్టు శుక్రవారం సాయంత్రం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో 3-2 తేడాతో నైజీరియాను ఓడించడంతో పాటు ఆ తర్వాత 3-1 తేడాతో ఈజిప్టు జట్టును మట్టికరిపించి టైటిల్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. తొలి మ్యాచ్‌లో సౌమ్యజిత్ ఘోష్ 5-11, 7-11, 4-11 తేడాతో ఒమర్ అసర్ చేతిలో ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ ఆ తర్వాత శరత్ కమల్ 11-7, 11-5, 11-9 తేడాతో మొహమ్మద్ ఎల్-బెయాలీని, హర్మీత్ దేశాయ్ 12-14, 11-6, 14-12, 11-5 తేడాతో ఎల్-సరుూద్ లషిన్‌ను ఓడించగా, చివరి మ్యాచ్‌లో శరత్ కమల్ 11-3, 12-10, 11-5 తేడాతో ఒమర్ అసర్‌ను చిత్తుచేశాడు. దీంతో భారత జట్టు టైటిల్ కోసం బ్రెజిల్ జట్టుతో తలపడనుంది. మరో సెమీఫైనల్‌లో బ్రెజిల్ 3-1 తేడాతో సెర్బియా జట్టును ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.
కాగా, మహిళల సెమీఫైనల్ పోరులో భారత జట్టు 3-2 తేడాతో సెర్బియాను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి మ్యాచ్‌లో వౌమా దాస్ 11-3, 4-11, 2-11, 1-11 తేడాతో అనమారియా ఎర్దెల్జీ చేతిలోనూ, రెండో మ్యాచ్‌లో మానికా బాత్రా 5-11, 10-12, 9-11 తేడాతో గాబ్రియెలా ఫెహర్ చేతిలోనూ ఓటమిపాలవగా, కె.షామినీ 11-6, 5-11, 11-5, 11-5 తేడాతో ఆండ్రియా టొడొరోవిచ్‌ను ఓడించి భారత్‌కు తొలి విజయాన్ని అందించింది. ఆ తర్వాత మానికా బాత్రా 11-8, 11-6, 9-11, 11-5 తేడాతో అనమారియా ఎర్దెల్జీని, వౌమా దాస్ 12-10, 11-8, 11-7 తేడాతో గాబ్రియెలా ఫెహర్‌ను మట్టికరిపించి భారత్‌ను ఫైనల్‌కు చేర్చారు. శనివారం జరిగే రెండో డివిజన్ ఫైనల్‌లో భారత మహిళా జట్టు లక్సెంబర్గ్ జట్టుతో తలపడనుంది.
ఆసియా కప్ టి-20లో
పాక్‌కు కంటితుడుపు విజయం
చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక చిత్తు
మీర్పూర్, మార్చి 4: ఆసియా కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్ నుంచి ఇప్పటికే నిష్క్రమించిన పాకిస్తాన్ జట్టు శుక్రవారం మీర్పూర్‌లోని షేర్ ఏ బంగ్లా స్టేడియంలో జరిగిన చివరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకను 6 వికెట్ల తేడాతో ఓడించి కంటితుడుపు విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టులో ఓపెనర్లు దినేష్ చండీమల్, తిలకరత్నె దిల్షాన్ చక్కగా రాణించారు. చూడముచ్చటైన షాట్లతో అలరిస్తూ చెరో అర్ధ శతకాన్ని నమోదు చేసుకున్న వీరు 110 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశారు. అనంతరం కెప్టెన్ చండీమల్ (58) వహాబ్ రియాజ్ బౌలింగ్‌లో షర్జీల్ ఖాన్‌కు దొరికిపోవడంతో వీరి భాగస్వామ్యం ముగిసింది. అనంతరం షెహన్ జయసూర్య (4), చమర కపుగెదర (2), దుసాన్ షనక (0) త్వరత్వరగా పెవిలియన్‌కు పరుగు తీసినప్పటికీ దిల్షాన్ (56 బంతుల్లో ఒక సిక్సర్, 10 ఫోర్లు సహా 75 పరుగులు), మిలిండా సిరివర్ధనే (4 బంతుల్లో 4 పరుగులు) అజేయంగా నిలవడంతో శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు సాధించింది. పాక్ బౌలర్లలో మొహమ్మద్ ఇర్ఫాన్ 2 వికెట్లు, వహాబ్ రియాజ్, షోయబ్ మాలిక్ చెరో వికెట్ రాబట్టారు.
అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ జట్టులో నాన్-స్ట్రైకింగ్ ఓపెనర్ మొహమ్మద్ హఫీజ్ (14) మినహా మిగిలిన వారంతా బాధ్యతాయుతంగా ఆడారు. ఓపెనర్ షర్జీల్ ఖాన్ 31 పరుగులు, వికెట్ కీపర్ సర్‌ఫ్రాజ్ ఖాన్ 38 పరుగులు, ఉమర్ అక్మల్ 48 పరుగులు సాధించి నిష్క్రమించగా, షోయబ్ మాలిక్ (13), ఇఫ్తికార్ అహ్మద్ (0) అజేయంగా నిలిచి మిగిలిన పని పూర్తి చేశారు. దీంతో 19.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 151 పరుగులు సాధించిన పాకిస్తాన్ జట్టు మరో 4 బంతులు మిగిలి ఉండగానే శ్రీలంకను ఓడించింది.

ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్‌లో జీతూకు పసిడి పతకం
బ్యాంకాక్, మార్చి 4: బ్యాంకాక్‌లో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్‌లో భారత షూటర్ జీతూ రాయ్ సత్తా చాటుకున్నాడు. గత కొద్ది నెలల నుంచి చేతి గాయంతో బాధపడుతున్న జీతూ రాయ్ శుక్రవారం ఇక్కడ 50 మీటర్ల పిస్తోల్ ఈవెంట్‌లో చైనాకు చెందిన ప్రపంచ, ఒలింపిక్ మాజీ చాంపియన్ పాంగ్ వెయిని చిత్తుచేసి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ ఈవెంట్ ఫైనల్‌లో జీతూ రాయ్ 191.3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా, 186.5 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమైన పాంగ్ వెయి రజత పతకంతోనూ, చైనాకే చెందిన ఒలింపిక్ కాంస్య పతక విజేత వాంగ్ జివెయి (165.8 పాయింట్లు) కాంస్య పతకంతోనూ సంతృప్తి చెందాల్సి వచ్చింది. అంతకుముందు 60 షాట్ క్వాలిఫయింగ్ సిరీస్‌లో జీతూ రాయ్ మొత్తం 562 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరుకోగా, 564 పాయింట్లతో పాంగ్ వెయి అగ్రస్థానంలోనూ, 563 పాయింట్లతో జివెయి ద్వితీయ స్థానంలోనూ నిలిచారు. అయినప్పటికీ ఫైనల్‌లో జీతూ రాయ్ వీరిద్దరినీ తలదన్ని స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడం విశేషం.

టీమిండియాను ఓడించగలం
బంగ్లా ఓపెనర్ తమీమ్ ధీమా
మీర్పూర్, మార్చి 4: ఆదివారం జరిగే ఆసియా కప్ ఫైనల్‌లో బలమైన భారత జట్టును ఓడించి కప్‌ను గెలుచుకునే సామర్థ్యం తమ జట్టుకు ఉందని బంగ్లాదేశ్ జట్టు సీనియర్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ శుక్రవారం చెప్పాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లకు సంబంధించి తమీమ్‌కు మరిచిపోలేని మధురానుభూతులు ఎన్నో ఉన్నాయి. 2007లో జరిగిన వన్‌డే ప్రపంచ కప్ టోర్నమెంట్ సందర్భంగా పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో భారత్‌పై బంగ్లాదేశ్ సాధించిన సంచలన విజయం సందర్భంగా జహీర్‌ఖాన్ వేసిన బంతిని తమీమ్ సిక్స్ కొట్టిన విషయాన్ని ఎవరు కూడా మరిచిపోలేరు. అయితే తాను ఆమ్యాచ్‌ని మరిచిపోయానని, కానీ మీడియా వాళ్లు ఎప్పుడూ దాన్ని తనకు గుర్తు చేస్తుంటారని తమీమ్ అన్నాడు. భారత్‌పై తమకు మరిచిపోలేని మ్యాచ్‌లు కొన్ని ఉన్నాయని అతను అంటూ, తాము గనుక పూర్తి సామర్థ్యంతో ఆడితే భారత్‌ను ఓడించే అవకాశాలున్నాయని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. గత ఏడాది వన్‌డే ఫార్మెట్‌లో తాము టీమిండియాను ఓడించామని అంటూ , ఇప్పుడు 20 ఓవర్ల ఫార్మెట్‌లో దాన్ని ఎందుకు పునరావృతం చేయలేమన్నాడు.
భిన్నమైన యాక్షన్‌తో బౌల్ చేసే టీమిండియా కొత్త ఫాస్ట్‌బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాను తమ సహచరులు సమర్థవంతంగా ఎదుర్కోగలరన్న నమ్మకాన్ని తమీమ్ వ్యక్తం చేశాడు. అయితే బుమ్రా ఒక్కడే కాదు, టీమిండియాలో ప్రతి ఆటగాడూ తమకు ముఖ్యమేనని తమీమ్ అన్నాడు. కాగా, టి-20 మ్యాచ్‌లలో ఫలితాన్ని నిర్ణయించేది ఒకటి, రెండు ఓవర్ల ఆటేనని తమీమ్ అన్నాడు.