క్రీడాభూమి

యుద్ధానికి సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 16: శ్రీలంక పర్యటనకు వెళ్లి, అక్కడ టెస్టు, వనే్డ, టి-20 సిరీస్‌ల్లో ప్రత్యర్థిని క్లీన్ స్వీప్ చేసిన విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇప్పుడు ఆస్ట్రేలియాపై దృష్టి కేంద్రీకరించింది. ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇక్కడి చిదంబరం స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌కి అన్ని విధాలా సిద్ధమైంది. ఇరు జట్లు అన్ని విభాగాల్లోనూ దాదాపు సమవుజ్జీలుగా నిలవడంతో, ఈ సిరీస్ ఒక యుద్ధాన్ని తలపించనుంది. ఆస్ట్రేలియాకు 5-0 తేడాతో వైట్ వాష్ వేస్తే, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ నంబర్ వన్ స్థానాన్ని సంపాదిస్తుంది. అయితే, ఇది అనుకున్నంత సులభం కాదనేది నిజం. స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆసీస్ జట్టు మిచెల్ స్టార్క్, జొస్ హాజెల్‌వుడ్ వంటి మేటి బౌలర్లు లేకపోవడంతో కొంత వరకు బలహీనంగా కనిపిస్తున్నది. అయితే, కెప్టెన్ స్మిత్, వైస్-కెప్టెన్ డేవిడ్ వార్నర్, గ్లేన్ మాక్స్‌వెల్ వంటి ప్రతిభావంతులు ఆ జట్టులో ఉన్నారు. ఐపిఎల్‌లో ఆడిన అనుభవం ఉండడంతో, భారత్ పిచ్‌లు, వాతావరణంపై స్పష్టమైన అవగాహన ఉన్న వారిని నిలువరించడం టీమిండియాకు అసాధ్యం కాదుగానీ, సులభమని అనుకోవడానికి వీల్లేదు. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యకు సేవలు అందించేందుకు వీలుగా ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ సిరీస్‌లో మొదటి మూడు మ్యాచ్‌ల నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో రోహిత్ శర్మతో కలిసి అజింక్య రహానే ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయి. ప్రాక్టీస్ సెషన్‌లో ఫుట్‌బాల్ ఆడుతూ కింద పడడంతో స్పిన్నర్ అక్షర్ పటేల్ కాలు బెణికింది. ఆదివారం నాటి మ్యాచ్‌కి అతను అందుబాటులో ఉండడం అనుమానంగానే కనిపిస్తున్నది. అయితే, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్ అందుబాటులో ఉండడంతో, అక్షర్ ఫిట్నెస్‌తో లేకపోయినా భారత్‌కు వచ్చే నష్టం ఉండదు. భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో కీలక పాత్రను పోషిస్తుండగా, బ్యాటింగ్‌లో కెప్టెన్ కోహ్లీ అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అజింక్య రహానే, లోకేష్ రాహుల్, రోహిత్ శర్మ, కేదార్ జాధవ్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వంటి హేమాహేమీలతో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. కాగితంపై చూస్తే, ఆస్ట్రేలియా కంటే టీమిండియా పరిస్థితి కొంత మెరుగ్గా కనిపిస్తుంది. అంతేగాక, హోం అడ్వాంటేజ్ కూడా కోహ్లీ సేనకు కలిసొచ్చే అంశం. మొత్తం మీద ఆసీస్ కంటే భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు మొదలవుతుంది.

చిత్రం..చెన్నైలోని చిదంబరం స్టేడియంలో శనివారం నెట్ ప్రాక్టీస్‌కు హాజరైన భారత ఫాస్ట్ బౌలర్లు ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా