క్రీడాభూమి

పూర్తి భద్రత కల్పిస్తాం.. బంతి మీ కోర్టులోనే ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా భారత్‌లో పాకిస్తాన్ జట్టుకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) శుక్రవారం స్పష్టం చేసింది. భారత్‌లో ఆడటంపై తమకు భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నాయని, కనుక ఈ మెగా టోర్నీ నుంచి వైదొలగాలనుకుంటున్నామని పాక్ క్రికెట్ బోర్డు (పిసిబి) బెదిరిస్తున్న నేపథ్యంలో బిసిసిఐ ఈ హామీని ఇచ్చింది. పాక్ జట్టు భద్రత విషయమై బిసిసిఐతో పాటు భారత ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వాలని పిసిబి చీఫ్ షహర్యార్ ఖాన్ చేసిన డిమాండ్ గురించి న్యూఢిల్లీలో విలేఖర్లు ప్రశ్నించగా, ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ కప్ టి-20 టోర్నీలో పాక్‌తో పాటు అన్ని జట్లకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని బిసిసిఐ సీనియర్ అధికారి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. ‘్భద్రతా ఏర్పాట్ల గురించి పాక్ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రపంచ కప్ టి-20 టోర్నీలో పాక్‌తో పాటు మిగిలిన అన్ని జట్ల ఆటగాళ్లకు బిసిసిఐ కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తుంది. కనుక ప్రస్తుతం బంతి పాక్ కోర్టులోనే ఉంది. ఈ మెగా టోర్నీలో ఆడేందుకు భారత్‌కు రావాలా? వద్దా? అనే విషయంపై పిసిబియే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒక వేళ ఈ టోర్నీ నుంచి పాక్ జట్టు వైదొలిగితే ఆ విషయమై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి)కు సమాధానం చెప్పుకోవలసింది పిసిబియే’ అని రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. పాక్ జట్టు భద్రతపై భారత ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని పిసిబి చేస్తున్న డిమాండ్ గురించి విలేఖర్లు ప్రశ్నించగా, ‘ప్రభుత్వం తరఫున మేమెలా మాట్లాడగలం?’ అని ఆయన అన్నారు.
దాయాదుల పోరుపై అనిశ్చితి
ఇదిలావుంటే, ప్రపంచ కప్ టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఈ నెల 19వ తేదీన భారత్-పాక్ జట్ల మధ్య ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్‌పై అనిశ్చితి నెలకొంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై జనవరిలో పాక్ ఉగ్రవాదులు దాడి జరపడాన్ని నిరసిస్తూ హిమాచల్‌ప్రదేశ్‌లోని మాజీ సైనికోద్యోగులు ఈ మ్యాచ్ నిర్వహణను వ్యతిరేకిస్తున్నారు. అయితే ధర్మశాలలో ఈ మ్యాచ్ యథాతథంగా జరుగుతుందని ఆశిస్తున్నానని గురువారం హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌తో భేటీ జరిపిన అనంతరం బిసిసిఐ కార్యదర్శి, బిజెపి ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కాగా, వివాదాస్పదమైన ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ నేత రాజీవ్ శుక్లా కూడా వీరభద్ర సింగ్‌తో మాట్లాడారు. భారత్-పాక్ జట్ల మధ్య ధర్మశాలలో మ్యాచ్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని వీరభద్ర సింగ్ హామీ ఇచ్చినట్లు శుక్లా తెలిపారు. పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడులకు వ్యతిరేకంగా హిమాచల్‌ప్రదేశ్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ సైనికోద్యోగులకు తాము కూడా సంఘీభావాన్ని తెలియజేస్తున్నామని, అందుకే భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచ్‌ల గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ధర్మశాలలో భారత్-పాక్ జట్ల మధ్య జరిగేది ప్రపంచ కప్ ఈవెంట్ మ్యాచ్ కావడం, ప్రస్తుత పరిస్థితుల్లో దీని వేదికను మార్చడం కష్టతరమైనందున ఈ మ్యాచ్ నిర్వహణకు అందరూ సహకరించాలని రాజీవ్ శుక్లా విజ్ఞప్తి చేశారు.

భద్రతపై ఆందోళన అనవసరమన్న ఐపిఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా