క్రీడాభూమి

ప్రాక్టీస్ సెషన్ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ బురదమయంగా మారడంతో, బుధవారం ప్రాక్టీస్ సెషన్ రద్దయింది. దీనితో ఆస్ట్రేలియా క్రికెటర్లు కొంత సేపు ఇండోర్ ప్రాక్టీస్‌ను కొనసాగించగా, భారత ఆటగాళ్లు రొటీన్ వామప్‌కు పరిమితమయ్యారు. ఇలావుంటే, గురువారం నాటి మ్యాచ్‌ని వర్షం వెంటాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెన్నైలో జరిగిన మొదటి వనే్డకు కూడా వర్షం వల్ల ఇబ్బందులు తలెత్తిన విషయం తెలిసిందే.

మరో విజయం భారత్ లక్ష్యం

నేడు ఆస్ట్రేలియాతో రెండో వనే్డ

కోల్‌కతా, సెప్టెంబర్ 20: ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం ఆస్ట్రేలియాతో జరిగే రెండో వనే్డ ఇంటర్నేషనల్‌ను గెల్చుకోవడమే లక్ష్యంగా విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా బరిలోకి దిగనుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మొదటి వనే్డను టీమిండియా 26 పరుగుల తేడాతో గెల్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఆధిక్యాన్ని 2-0గా మార్చాలన్న పట్టుదల భారత క్రికెటర్లలలో కనిపిస్తున్నది. కాగా, మొదటి మ్యాచ్‌లో గెలిచినప్పటికీ, కీలక బ్యాట్స్‌మెన్ అనూహ్యమైన రీతిలో విఫలం కావడం భారత అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నది. ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించి, పొరపాట్లు పునరావృతం కాకుండా వారు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అయితే, భారత బ్యాట్స్‌మెన్ కంటే బౌలర్లే ఆస్ట్రేలియాను ఎక్కువగా భయపెడుతున్నారు. యువ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్ బంతులను సమర్థంగా ఎదుర్కోవడంలో ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడుతున్నారు. 3చైనామన్2 బంతులతో కుల్దీప్ అల్లాడిస్తుండగా, అనూహ్యంగా దిశను మార్చుకొని దూసుకొచ్చే బంతులతో చాహల్ భయపెడుతున్నాడు. వీరిద్దరినీ ఎదుర్కోవడానికి స్టీవెన్ స్మిత్ కెప్టెన్సీ వహిస్తున్న ఆస్ట్రేలియా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగానే, మొదటి వనే్డకు ముందు కేరళ స్పిన్నర్ జియాస్‌తో నెట్స్‌లో బౌలింగ్ వేయించింది. ఇప్పుడు కోల్‌కతాలో స్థానిక స్పిన్నర్లు అశుతోష్ శిబ్రం, రూపక్ గుహా సేవలను పొందుతున్నది. వీరిద్దరు నెట్స్‌లో బౌలింగ్ చేస్తుంటే, స్పిన్‌ను ఎదుర్కొనే విషయంలో ఆసీస్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంటున్నది.

పాండ్యకు బ్రేక్!

ఆస్ట్రేలియాను వేధిస్తున్న అంశాల్లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యకుఏ విధంగా బ్రేక్ వేయాలన్నది కీలకమైనది. 76 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన భారత జట్టుకు పాండ్య అండగా నిలిచాడు. హ్యాట్రిక్ సిక్సర్లతో చెలరేగిపోయాడు. 66 బంతుల్లోనే 83 పరుగులు చేసి, మహేంద్ర సింగ్ ధోనీ (88 బంతుల్లో 79)తో కలిసి భారత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 2015 ఐపిఎల్ నుంచి పాండ్య ఎదుగుదల నిరాటంకంగా కొనసాగుతున్నది. అత్యంత కీలకమైన ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతూ, అత్యుత్తమ సేవలు అందిస్తున్న పాండ్య మీడియం పేస్ బౌలర్‌గానూ రాణిస్తున్నాడు. మొదటి వనే్డలో ఆస్ట్రేలియా బౌలింగ్‌ను, ప్రత్యేకించి స్పిన్నర్ ఆడం జంపాను చిత్తుచేసిన విధానం ఆ జట్టు కెప్టెన్ స్మిత్‌కు ఆందోళన కలిగిస్తున్నది. పాండ్య ఈ స్థాయిలో ఆడితే, టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఫామ్‌లోకి వస్తే పరిస్థితి ఏమిటన్న భయం అతనిని వెంటాడుతున్నది. స్పిన్‌కు అనుకూలించే భారత్ పిచ్‌లపై స్పెషలిస్టు స్పిన్నర్ జంపా విఫలమైన నేపథ్యంలో, పార్ట్‌టైమర్లు గ్లేన్ మాక్స్‌వెల్, ట్రావిస్ హెడ్, అష్టన్ అగర్ అద్భుతాలు సృష్టిస్తారనుకోవడం అత్యాశే అవుతుంది. బ్యాటింగ్‌లో స్మిత్ అనుకున్న స్థాయిలో ఆడలేకపోతున్నాడు. అతను ఏ విధంగా మిగతా బ్యాట్స్‌మెన్‌కు మార్గదర్శకుడవుతాడన్నది ప్రశ్న. ఓపెనర్ డేవిడ్ వార్నర్ విజృంభిస్తే తప్ప ఆసీస్ పరిస్థితి మెరుగుపడదు. ఇలావుంటే, ట్రావిస్ హెడ్‌ను ఓపెనర్‌గా పంపిస్తే, నాలుగో స్థానం కోసం గ్లేన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టొయినిస్ మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. జార్జి బెయిలీపై గత ఏడాది వేటు పడిన తర్వాత, ఈ స్థానంలో ఆసీస్‌కు ఇంత వరకూ సరైన బ్యాట్స్‌మన్ లభించలేదు. ఆల్‌రౌండర్లు కావడంతో మాక్స్‌వెల్, స్టొయినిస్ ఈ స్థానాన్ని భర్తీ చేయడానికి పోటీపడుతున్నారు. వీరిద్దరితోపాటు జేమ్స్ ఫాల్క్‌నెర్ రూపంలో మరో ఆల్‌రౌండర్ ఆసీస్ జట్టులో ఉన్నాడు. మొత్తం మీద బ్యాటింగ్‌లో కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ, బౌలింగ్‌లో మాత్రం ఆస్ట్రేలియా చాలా బలహీనంగా ఉందనేది వాస్తవం. మొదటి వనే్డలో బౌలర్ భువనేశ్వర్ కుమార్ 20 బంతుల్లో 32 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడం ఆసీస్ బౌలింగ్ వైఫల్యాలకు అద్దం పడుతుంది. అన్ని విభాగాల్లోనూ లోపాలను సరిదిద్దుకొని, పటిష్టమైన వ్యూహాలతో పోరాడితే తప్ప, టీమిండియాకు గట్టిపోటీని ఇవ్వడం ఆస్ట్రేలియాకు సాధ్యం కాదు.
మ్యాచ్ గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు మొదలవుతుంది.