క్రీడాభూమి

టైటిలే టీమిండియా లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీర్పూర్: టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీలకు వామప్ టోర్నీ ఆసియా కప్ టి-20 టోర్నీలో టైటిల్ సాధించడమే లక్ష్యంగా మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని భారత జట్టు ఆదివారం నాటి ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను ఢీకొనేందుకు సిద్ధమైంది. ఏ రకంగా చూసినా ఫేవరిట్‌గా టీమిండియానే పేర్కోవాలి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప బంగ్లాదేశ్ విజేతగా నిలవడం అసాధ్యం. అయితే, మష్రాఫ్ మొర్తాజా కెప్టెన్సీలో బంగ్లాదేశ్ ఇటీవల అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నది. సంచలన విజయాలను సాధిస్తున్నది. టి-20 ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో ఉన్నప్పటికీ, నంబర్ వన్ జట్టు భారత్‌కు గట్టిపోటీని ఇవ్వడానికి సిద్ధమవుతున్నది. శ్రీలంక, పాకిస్తాన్ వంటి మేటి జట్లపై విజయాలను నమోదు చేసి ఫైనల్‌లో స్థానం దక్కించుకున్న బంగ్లాదేశ్ ఇదే టోర్నీలో భారత్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉంది. భారత యువ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాపై తమీమ్ ఇక్బాల్ పైచేయి సాధిస్తాడా? అపారమైన అనుభవం ఉన్న వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా స్థాయిలో సౌమ్య సర్కార్ బౌలింగ్‌లో మెరిపిస్తాడా అన్నది ఆసక్తిని రేపుతున్నది. స్వదేశంలో, వేలాది మంది అభిమానుల సమక్షంలో ఆడడం బంగ్లాదేశ్‌కు కలిసొచ్చే అంశం. తనదైన రోజున ఎంతటి బలమైన జట్టునైనా చిత్తుచేసే సత్తా బంగ్లాదేశ్‌కు ఉంది. ఆసియా కప్ పోటీలకు ముందు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు వనే్డ సిరీస్‌ను కోల్పోవడమే ఇందుకు ఉదాహరణ. అయితే, ఇప్పుడు ఫార్మెట్ వేరు. వరుస విజయాలతో సంపాదించిన ఆత్మవిశ్వాసం వేరు. అందుకే, అన్ని విభాగాల్లోనూ బంగ్లాదేశ్ కంటే భారత్ ఎంతో పటిష్టంగా కనిపిస్తున్నది. శిఖర్ ధావన్ ఫామ్ కొంత ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, యువరాజ్ సింగ్ వంటి మేటి బ్యాట్స్‌మెన్ అండ టీమిండియాకు ఉంది. హార్దిక్ పాండ్య రూపంలో జట్టుకు సమర్థుడైన ఆల్‌రౌండర్ లభించాడు. అతనితోపాటు జస్‌ప్రీత్ బుమ్రా, ఆశిష్ నెహ్రా, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్ వంటి సమర్థులు జట్టులో ఉన్నారు. బంగ్లాదేశ్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలను గమనిస్తే, భారత్‌ను చిత్తుచేసే స్థాయిలో లేవన్న విషయం స్పష్టమవుతుంది. అయితే, మిగతా ఫార్మెట్స్‌తో పోలిస్తే టి-20 మ్యాచ్‌ల్లో అసాధారణ, సంచలన ఫలితాలు నమోదుకావడం ఆనవాయితీగా వస్తోంది. ధోనీ సేన ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అలాంటి చిరస్మరణీయ విజయాన్ని బంగ్లాదేశ్ నమోదు చేసే అవకాశం లేకపోలేదు. పిచ్ బౌలర్లకు సహకరిస్తున్నది కాబట్టి, షేర్ ఎ బంగ్లా మైదానంలో మరోసారి లోస్కోరింగ్ మ్యాచ్ తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే, ఫైనల్‌కు గ్రౌండ్ సిబ్బంది పిచ్‌ని ఏ విధంగా తీర్చిదిద్దుతారో చూడాలి.
భారత్‌కే విజయావకాశాలు: మొర్తాజా
మీర్పూర్: ఆసియా కప్ టి-20 క్రికెట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రాఫ్ మొర్తాజా అన్నాడు. ప్రపంచ ర్యాకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిన టీమిండియా బలం ఏమిటో తమకు తెలుసునని అన్నాడు. ఆదివారం నాటి ఫైనల్‌లో టీమిండియా ఫేవరిట్‌గా బరిలోకి దిగుతుందని, అయితే, తాము చివరి క్షణం వరకూ పోరాడతామని మొర్తాజా అన్నాడు.